Russia-Ukraine War: మలుపు తిరగనున్న ఉక్రెయిన్‌ యుద్ధం

Kyivs Forces Moving Towards Occupied Kherson
x

Russia-Ukraine War: మలుపు తిరగనున్న ఉక్రెయిన్‌ యుద్ధం

Highlights

Russia-Ukraine War: ఖేర్సన్‌ను తిరిగి దక్కించుకునేందుకు ప్లాన్‌

Russia-Ukraine War: పశ్చిమ దేశాలు ఇచ్చే ఆయుధాలపై ఉక్రెయిన్‌ భారీ ఆశలు పెట్టుకుంది. రోజురోజు ఆయుధాలను కోల్పోతున్న రష్యాను తరమికొట్టగలమన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. దక్షిణాదిలోని అత్యంత కీలకమైన ఖేర్సన్‌ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్ చెబుతోంది. సెప్టెంబరు నాటికి ఖేర్సన్‌ ప్రాంతం రష్యా నుంచి విముక్తి పొందుతుందని స్పష్టం చేస్తోంది. అయితే పుతిన్‌ బలగాలను వెనక్కి తరిమేయడం సులభమేనా? కీవ్‌కు అది సాధ్యమేనా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు చెందిన కీలక అధికారులు కీవ్‌లో అధ్యక్షుడు జెలెన్‌ష్కీతో కలిసిన తరువాత ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఆరు నెలలకు చేరింది. ఈ యుద్ధంలో ఖేర్సన్‌, మరియూపోల్‌, డాన్‌బాస్‌ ప్రాంతాలను మాస్కో సేనలు సొంతం చేసుకున్నాయి. అదే సమయంలో భారీగా సైనికులను, ఆయుధాలను రష్యా కోల్పోయింది. 16 వందలకు పైగా యుద్ధ ట్యాంకులు, 50 హెలికాప్టర్లు, 36 ఫైటర్‌ జెట్లు, 350 ఫిరంగులతో పాటు 15వేల మందికి పైగా సైనికులను క్రెమ్లిన్‌ కోల్పోయినట్టు అమెరికా నిఘా సంస్థలు చెబుతున్నాయి. అయితే వీటి సంఖ్యపై మాత్రం రష్యా క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక యుద్ధం మరి కొంతకాలం సాగే అవకాశం ఉంది. ఉక్రెయిన్ విషయంలో మరింత ముందుకు వెళ్లాలంటే ఆయుధాలు తప్పనిసరి ఇప్పటిప్పుడు రష్యా కొత్త ఆయుధాలను తయారుచేసే పరిస్థితుల్లో లేదు. దానికి కారణం ఆంక్షల కారణంగా ఆయుధాల తయారీకి అవసరమయ్యే గైడెన్స్‌ వ్యవస్థ, మైక్రో చిప్స్‌, ట్రాకర్స్‌ వంటి విడిభాగాల దిగుమతులు నిలిచిపోవడమే. అత్యాధునిక ఆయుధాలను తయారుచేసి ప్రపంచానికి ఎగుమతి చేస్తున్న మాస్కో ఇప్పుడు వాటి కోసం ఇతర దేశాల సాయం అడుగుతున్నది. తాజాగా చైనా, ఇరాన్‌ దేశాల నుంచి ఆయుధాల కొనుగోలుకు మాస్కో యత్నిస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.

రష్యా పరిస్థితి ఇలా ఉంటే ఉక్రెయిన్‌కు మాత్రం పశ్చిమ దేశాలు భారీగా ఆయుధాలను అందిస్తున్నాయి. తమ దేశాల్లో ద్రవ్యోల్బణం దారుణంగా పెరుగున్నా అమెరికా, మిత్రదేశాలు మాత్రం రష్యా ఓటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా రాకెట్‌ లాంచర్లను భారీగా అందిస్తున్నాయి. అయితే ఈ మధ్యశ్రేణి మల్టీ రాకెట్‌ లాంచర్లతో డాన్‌బాస్‌, మరియూపోల్‌, ఖేర్సన్‌ ప్రాంతాల్లో రష్యా సైన్యాన్ని తరమికొట్టేందుకు బాగా ఉపయోగపడనున్నాయి. అత్యాధునిక హైమార్స్‌, ఎం-270 లాంచర్లతో ఖేర్సన్‌ ప్రాంతంలోని రష్యా సైన్యాన్ని తరమికొడుతామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఇప్పటికే ఆయుధాలను భారీగా కోల్పోయిన రష్యా సెప్టెంబరు నాటికి పరిస్థితి మరింత దిగజారుతుందని కీవ్‌ అంచనా వేస్తోంది. సెప్టెంబరు నాటికి ఖేర్సన్‌ ప్రాంతాన్ని మాస్కో కబంధ హస్తాల నుంచి విడిపిస్తామని స్పష్టం చేసింది. యుద్దంలో కీలక మలుపులు తిరుగుతున్నట్టు ఉక్రెయిన్‌ వివరించింది. తాము ఎదురుదాడి చేస్తామని ప్రకటించింది. అయితే అమెరికా అధికారులు కీవ్‌లో జెలెన్‌స్కీని కలిసిన మరుసటి రోజు ఈ ప్రకటన చేయడం ఆసక్తి రేపుతోంది.

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడి మొదలైన వారంలోనే ఖేర్సన్‌ను రష్యా స్వాధీనం చేసుకుంది. ఖేర్సన్‌ ప్రాంతం రష్యాకు అత్యంత కీలకమైనది. క్రిమియా ప్రాంతానికి భూమార్గంలో రాకపోకలకు అవకాశం ఏర్పడింది. ఇప్పటికే అక్కడ టీవీ టవర్లను ఏర్పాటు చేసింది. ప్రజలకు పౌరసత్వం, పాస్‌పోర్టులను జారీ చేస్తోంది. తమ ఖరెన్సీని అమలు చేస్తోంది. అధికారులు కూడా కొందరు రష్యాకు అనుకూలంగా మారిపోయారు. ఈ నేపథ్యంలో ఖేర్సన్‌ నుంచి రష్యా బలగాలను తరమికొట్టడడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇటీవల ఖేర్సన్ ప్రాంతం దిశగా కీవ్‌ బలగాలు దూసుకెళ్తున్నట్టు తాజాగా ఖర్సన్ ప్రాంతానికి చెందిన ఉక్రెయిన్‌ అధికారి తెలిపారు. అమెరికా, బ్రిటన్‌ అందిస్తున్న రాకెట్‌ లాంచర్లు హైమార్స్‌, ఎం-270తో ఖేర్సన్ నుంచి మాస్కో బలగాలపై దాడులు చేసేందుకు కీవ్‌ ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే కొంత ముందడుగు కూడా వేసింది. 27 కోట్ల డాలర్ల విలువైన డ్రోన్లు, హైమార్స్‌ ర్యాకెట్లు, మందుగుండు సామగ్రిని సాయంగా అందిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు అమెరికా అధికారులు కీవ్‌లో జెలెన్‌స్కీని కలిసి యుద్ధ వ్యూహంపై చర్చించినట్టు తెలుస్తోంది.

ఆరు నెలల పోరాడుతున్నా రష్యా సైన్యం మాత్రం కీవ్‌ను దక్కించుకోలేకపోయింది. ఈ యుద్ధంలో రష్యా విఫలమైనట్టు కొందరు విశ్లేషిస్తున్నారు. అసలు యుద్ధం ఇప్పటికీ మొదలు పెట్టలేదని పుతిన్‌ చెబుతున్నారు. మాస్కో ఆయుధ నిల్వలు తరిగిపోతున్న తరుణంలో కీలక వ్యూహాలను ఇప్పుడే తీసుకోనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఈశాన్య ప్రాంతంలోని ఖార్కివ్‌ నుంచి పుతిన్‌ బలగాలను తరిమి కొట్టినట్టుగానే ఖేర్సన్‌లో కూడా ఉక్రెయిన్‌ తరిమికొట్టగలిగేలా అమెరికా వ్యూహాలను రక్షిస్తున్నట్టు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. కీలకమైన ఖేర్సన్‌, మరియూపోల్‌ రష్యా చేతిలో నుంచి వెనక్కి తీసుకోవడమే లక్ష్యంగా కీవ్‌ సైన్యాన్ని అమెరికా ముందుండి నడిపించే అవకాశం ఉందంటున్నారు. ప్రపంచ మార్కెట్లోకి అత్యధికంగా ధాన్యాన్ని ఉక్రెయిన్‌ ఎగుమతి చేస్తున్నదంటే అందుకు కారణం ఖేర్సనే. ఈ ప్రాంతంలో పంటలు భారీగా సాగువుతున్నాయి. ఈ ప్రాంతాన్ని కోల్పోతే ఉక్రెయిన్‌ ఆహార ధాన్యాల ఎగుమతి భారీగా పడిపోయే అవకాశం ఉంది. పెంటగాన్‌ డైరెక్షన్‌లో ఖేర్సన్‌ ప్రాంతాన్ని తిరిగి దక్కించుకునేందుకు ఉక్రెయిన్ స్కెచ్‌ వేస్తోంది.

యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌కు చెందిన ప్రజలు 60 లక్షల మందికి పైగా దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ యుద్ధంతో లక్షలాది మంది దేశంలోనే ఇతర సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత.. అత్యంత దారుణ మానవ సంక్షోభం ఉక్రెయిన్‌లో నెలకొన్నట్టు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories