Japan Earthquake: జపాన్‌లో 155 సార్లు భూకంపాలు.. పెరుగుతున్న మృతులు

Japan Earthquake Death Toll Rises To 30 As A Total Of 155 Tremors Rattle Country
x

Japan Earthquake: జపాన్‌లో 155 సార్లు భూకంపాలు.. పెరుగుతున్న మృతులు

Highlights

Japan Earthquake: తీవ్ర ప్రాణ,ఆస్తి నష్టం వాటిల్లిందన్న ప్రధాని ఫుమియో కిషిదా

Japan Earthquake: ప్రకృతి ప్రకోపానికి జపాన్‌ కంపించింది. సోమవారం సంభవించిన వరుస భూకంపాల ఘటనల్లో కనీసం 30 మంది మృతి చెందినట్లు జపాన్ అధికార వర్గాలు ధృవీకరించాయి. పలు సమయాల్లో 155 సార్లు భూమి కంపించినట్టు అక్కడి ఆర్కియోలాజికల్ విభాగం ప్రకటించింది. భూకంప తీవ్రత ఎక్కువగా సంభవించిన ప్రాంతాల్లో తీర ప్రాంతం ఎక్కువగా ఉండే ఇషికావాలో ఈ మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. వరుసగా సంభవించిన ఘటనల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

తీర ప్రాంతమైన ఇషికావా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో 7.6 తీవ్రతతో భూకంపాలు వరుసగా వచ్చాయని జపాన్‌ వాతావరణ సంస్థ వెల్లడించింది. వాజిమాలో 1.2 మీటర్లు, కనజావాలో 90 సెం.మీ ఎత్తులో అలలు ఎగిసిపడ్డట్లు అధికారులు తెలిపారు. దీంతో జపాన్‌ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. నీటి సరఫరా పైప్‌లైన్లు సైతం దెబ్బతిన్నాయి. విద్యుత్‌ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడింది. బుల్లెట్‌ రైలు సేవలు నిలిచిపోయాయి.

మొబైల్‌ సర్వీసులకూ అంతరాయం కలిగింది. తీర ప్రాంతంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మరోసారి భూప్రకంపనలు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని జపాన్‌ వాతావరణ సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

సోమవారం సంభవించిన భూకంపాల్లో తీవ్ర నష్టం సంభవించినట్లు జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా ప్రకటించారు. అనేకమంది ప్రాణాలు కోల్పాయారని వెల్లడించారు. భవనాలు కుప్పకూలాయని, అగ్ని ప్రమాదాలు సంభవించాయని చెప్పారు. సహాయక చర్యలను స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, రహదారులు దెబ్బతినడంతో సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు భూకంప ప్రభావిత ప్రాంతాలకు వెంటనే నిత్యావసరాలు పంపాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

జపాన్‌ భూకంప ప్రభావం దక్షిణ కొరియానూ తాకింది. తీర ప్రాంతాల్లో పలు చోట్ల సునామీ అలలను గుర్తించినట్లు ఆ దేశ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్లు తెలిపాయి. మరోవైపు రష్యా, ఉత్తర కొరియాలోనూ తీర ప్రాంత ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories