రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన కమల్‌హాసన్

Submitted by lakshman on Fri, 09/15/2017 - 19:09

చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నిన్నమొన్నటి వరకూ అన్నాడీఎంకే అంతర్గత విభేదాలతో తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు నడిచాయి. ఇప్పుడు పన్నీర్, పళని చేతులు కలపడంతో ఈ వివాదం దాదాపుగా సద్దుమణిగింది. వీరి వ్యవహారం తర్వాత రజనీ రాజకీయ ప్రవేశంపై చర్చోపచర్చలు సాగాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించి మరో సంచలనానికి తెరలేపారు సినీ నటుడు కమల్ హాసన్. అంతేకాదు, మాట మార్చే హామీలను తానివ్వనని.. ప్రస్తుతం తమిళనాడు పరిస్థితి మార్చాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు కమల్ ప్రకటించారు. మార్పుకు నాంది పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీ అనేది ఒక సిద్ధాంతం నుంచి పుట్టుకొచ్చేదని కమల్ తెలిపారు. ఇదిలా ఉంటే లెఫ్టిస్టులే తన హీరోలని కమల్ ప్రకటించడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే కేరళ సీఎం పినరై విజయన్‌తో కమల్ భేటీ అయ్యారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో కమల్ టచ్‌లో ఉన్నారు.

ఈ పరిణామాలను పరిశీలిస్తే కమల్ పెట్టబోయే రాజకీయ పార్టీ విధివిధానాలు దాదాపుగా కమ్యూనిస్టు సిద్ధాంతాలని ప్రతిబింబించేలా ఉండబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కమల్ తన పార్టీ పేరును ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కమల్ రాజకీయ పార్టీ ప్రకటనతో హీరో రజనీకాంత్ పొలిటకల్ ఎంట్రీ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. రజనీకాంత్ కూడా రాజకీయ పార్టీ స్థాపిస్తే తమిళ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారనేది కూడా ఆసక్తికరమైన అంశం. పోటీ ఎవరెవరి మధ్య ఉండబోతుందనే దానిపై ఇప్పటికే హాట్‌హాట్‌గా చర్చలు సాగుతున్నాయి.  ఏదేమైనా కమల్ పొలిటికల్ ఎంట్రీతో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు సరికొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. పైగా సినీ రంగానికి చెందిన వారిని తమిళులు ఎంతలా ఆరాధిస్తారో అందరికీ తెలిసిందే. తమిళనాడు దివంగత సీఎంలు ఎంజీఆర్, జయలలిత సినీరంగానికి చెందిన వారే కావడం గమనార్హం.

English Title
kamal hasan confirms to establish the political party

MORE FROM AUTHOR

RELATED ARTICLES