నిరూపిస్తే ఆస్తి మొత్తం రాసిస్తా

Submitted by arun on Tue, 09/04/2018 - 09:27

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ మరో వివాదంలో చిక్కుకుంది. సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో ‘మా’ నిధులు దుర్వినియోగం చేశారంటూ వస్తున్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. నిధులు దుర్వినియోగం అయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఒక వర్గం అంటుంటే మరో వర్గం మాత్రం నిధుల దుర్వినియోగం జరిగింది వాస్తమేనంటోంది. మా..లో అసలేం జరిగింది. 

తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా..లో నిదులు గోల్‌మాల్ జరిగినట్టు కొద్దిరోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. మా సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి అమెరికాలో ప్రదర్శన హక్కుల విషయంలో అవకతవకలు జరిగాయని పరిశ్రమలో ఓ వర్గం ఆరోపిస్తోంది. ప్రధానంగా అధ్యక్షుడు శివాజీరాజాతోపాటు అసోసియేషన్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న హీరో శ్రీకాంత్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. 

మా కి సొంత భవనం కట్టించాలన్న ఆలోచనతో మెగాస్టార్ చిరంజీవితో విదేశాల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. ఈ ఈవెంట్ ద్వారా మా అసోసియేషన్‌కు కోటి రూపాయల నిధులు సమకూరాయి. అయితే, ఈ నిధుల విషయంలో అవకతవకలు జరిగినట్టు ప్రధాన ఆరోపణ. ఈ కోటి రూపాయలు కాకుండా అదనంగా కొంత డబ్బు అసోసియేషన్‌కు చెందిన బినామీ అకౌంట్‌లోకి చేరినట్టు ఓ వర్గం ఆరోపిస్తోంది. దీనిపై నిజనిర్దారణ కమిటీ వేయడానికి కూడా అసోసియేషన్ పెద్దలు ఒప్పుకోవడం లేదంటున్నారు. 

ఈ ఆరోపణలపై స్పందించిన మా అధ్యక్షుడు శివాజీరాజా, ట్రెజరర్ పరుచూరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ తదితరులు  మరోసారి సమావేశమై చర్చించారు. అయితే, దీనికి జనరల్ సెక్రటరీ నరేష్ హాజరుకాలేదు. నిధుల సమీకరణలో అవకతవకలు జరిగినట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మా సభ్యులు కొట్టిపారేశారు. అసోసియేషన్‌లో 5 పైసలు దుర్వినియోగమైనా తన ఆస్తినంతా రాసిచ్చేస్తానని శివాజీ రాజా సవాల్‌ చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు నిరూపిస్తే అసోసియేషన్ గడప కూడా తొక్కనని, నిరూపించలేకపోతే ఆరోపణలు చేస్తున్న వారు మా నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు హీరో శ్రీకాంత్. ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ ఉదంతం, శ్రీరెడ్డి విషయంలో టాలీవుడ్ వివాదంలో చిక్కుకోగా‌.. తాజా వివాదం మరోసారి ‘మా’ను అప్రతిష్ట పాలు చేసేలా ఉంది. 

English Title
shivaji raja and srikanth open challenge

MORE FROM AUTHOR

RELATED ARTICLES