రాములమ్మ ఎక్కడ?

x
Highlights

తెలంగాణలో ముందస్తు కాక రేగుతున్న తరుణంలో, రాములమ్మ సందడి మాత్రం కనిపించడం లేదు....ఎందుకు...విజయశాంతి అలిగారా....సినిమా స్క్రీన్‌పై లేడీ అమితాబ్‌...

తెలంగాణలో ముందస్తు కాక రేగుతున్న తరుణంలో, రాములమ్మ సందడి మాత్రం కనిపించడం లేదు....ఎందుకు...విజయశాంతి అలిగారా....సినిమా స్క్రీన్‌పై లేడీ అమితాబ్‌ చెలరేగి, పొలిటికల్‌ స్క్రీన్‌పై సంచలనంగా ఎదిగిన, రాములమ్మ ఇప్పుడెక్కనున్నారు ముందస్తు వేడితో తెలంగాణ రగులుతుంటే విజయశాంతి యాక్టివ్‌గా లేకపోవడమేంటి రాములమ్మను అధిష్టానం పట్టించుకోవడం లేదా లేదంటే ఆమెనే అలిగారా? ఇంతకీ రాముల్మ ఎక్కడ?

ఫైర్‌ బ్రాండ్‌ రాములమ్మ, పూర్తిగా నల్లపూసయ్యారు. అటు వెండితెర మీదా, ఇటు రాజకీయ తెర మీదా అస్సలు కనిపించడం లేదు. పొలిటికల్‌ హీట్‌, రగులుకున్న తెలంగాణలో అసలు కనపడ్డం లేదు రాములమ్మ. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై ప్రశంసలు కురిపించి, 2014లో అదే పార్టీలో చేరారు విజయశాంతి. మెదక్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. దీంతో క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకున్నట్టు ప్రకటించారు. అయితే, తెలంగాణపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టిపెట్టడం, రాహుల్ గాంధీ నాయకత్వం తీసుకోవడంతో, మళ్లీ కాంగ్రెస్‌ వైపు నడిచారు విజయశాంతి. రాహుల్ సమక్షంలోనే మరోసారి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏమైందోకానీ ఆ తర్వాత రాములమ్మ మాత్రం పొలిటికల్ స్క్రీన్‌పై కనుమరుగయ్యారు.

చాలా రోజుల తర్వాత ఇటీవల బోనాల పండుగలో కనిపించారు. హైదరాబాద్‌లోని మహంకాళీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఇక రాములమ్మ మళ్లీ కాంగ్రెస్‌లో చురుగ్గా పాల్గొంటారని అంతా భావించారు. కానీ ఆమె మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాహుల్‌ గాంధీ ఇటీవలె తెలంగాణలో రెండురోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. కానీ విజయశాంతి మాత్రం రాహుల్ టూర్‌లో కనిపించలేదు.

విజయశాంతి తనకు మరో ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ లో చేరారే గానీ ఏనాడూ చురుగ్గా వ్యవహరించలేదన్న విమర్శలున్నాయి. పైగా రాష్ట్ర నాయకులతో ఆమెకు పెద్దగా సఖ్యత కూడా లేదు. కానీ తననే కాంగ్రెస్‌ పెద్దలు దూరంగా పెట్టారని కుమిలిపోతున్నారు రాములమ్మ. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి కోరినా అధిష్టానం ఇవ్వలేదు. అంతేకాదు పీసీసీ తెలంగాణ కమిటీలో కూడా ఏ పదవి ఇవ్వలేదట. ఎలాంటి బాధ్యతలు అప్పగించనందుకే, దూరంగా ఉండాల్సి వస్తోందని విజయశాంతి తన సన్నిహితులతో గోడు వెళ్లబోసుకున్నారట.

తెలంగాణలో ఇప్పుడు ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణ ఇచ్చి కూడా అధికారంలోకి రాలేకపోయామని కుమిలిపోతున్న కాంగ్రెస్ పార్టీ, ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. సరికొత్త కూటములు కడుతోంది. ఇంతటి కీలకమైన సమయంలోనూ, రాములమ్మ కాంగ్రెస్‌కు చేదోడు, వాదోడుగా ఉండకుండా పంతాలకుపోయి దూరంగా ఉండడం కాంగ్రెస్ శ్రేణులను విస్తుపోయేలా చేస్తోంది.

అయితే, విజయశాంతి పట్ల, కాంగ్రెస్‌ పెద్దల ఆలోచన మరోలా ఉందట. రాములమ్మను, కీలకమైన అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించాలా వద్దా? అనే చర్చ కూడా జరుగుతోందట. నిజానికి ఆమె గతంలో పార్లమెంటు సభ్యురాలిగా పనిచేశారు. అలాంటప్పుడు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆమెను ఎంపీగానే దించవచ్చు అనేది ఒక ఆలోచన. ఇప్పుడు శాసనసభ సమరంలో దించితే, ఒక స్థానానికి పరిమితం అయిపోతుందని అలాకాకుండా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆమె ఫైర్ బ్రాండ్ విమర్శల్ని రాష్ట్రమంతా ప్రచారానికి వాడుకోవాలని కూడా పార్టీలో కొందరు భావిస్తున్నారట. కానీ ఇటు పార్టీ నుంచి కానీ, అటు విజయశాంతి నుంచి, పరస్పర సంప్రదింపుల్లేవు. మాటల్లేవ్...మాట్లాడుకోవడాల్లేవ్...మరి విజయశాంతి ఫైర్‌ బ్రాండ్‌ క్యాంపెన్‌ను ఈ అసెంబ్లీ పోరులో చూస్తామా...చూడమా? వెయిట్‌ అండ్ సీ.

Show Full Article
Print Article
Next Story
More Stories