నేడు లోక్‌సభ ముందుకు అవిశ్వాస తీర్మానాలు

Submitted by arun on Mon, 03/19/2018 - 10:08
tdpmps

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన ఎన్డీయే ప్రభుత్వంపై వైసీపీ, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవాళ లోక్‌సభ ముందుకు రానుంది. పార్టీ తరఫున ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి శుక్రవారం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు మరోసారి నోటీసు అందజేశారు. సభా నిబంధనల ప్రకారం కేంద్రమంత్రి మండలి సభ విశ్వాసాన్ని కోల్పోయిందని ఆ నోటీసులో ఆయన తెలిపారు. అటు టీడీపీ ఎంపీ తోట నరసింహం కూడా అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేశారు. 

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు అవసరమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ.. సభ ఆర్డర్‌లో లేదని చెబుతూ ఈ నోటీసులను పక్కనబెట్టినట్టు లోక్‌సభ స్పీకర్ శుక్రవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో పట్టు వదలకుండా 16వ తేదీ సాయంత్రం వై.వి.సుబ్బారెడ్డి మరో నోటీసు ఇచ్చారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు సుబ్బారెడ్డి, తోట నరసింహం ఇచ్చిన నోటీసులు ఇవాళ లోక్‌సభ స్పీకర్ మళ్లీ పరిగణనలోక తీసుకోనున్నారు. దీంతో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. 

అవిశ్వాస తీర్మానం చర్చకు రావాలంటే సభ సజావుగా సాగాలి. సభలో గందరగోళం నెలకొంటే స్పీకర్ అవిశ్వాస తీర్మానం నోటీసుల్ని పరిగణనలోకి తీసుకోరు. శుక్రవారం ఇదే జరిగింది. టీడీపీ.. వైసీపీ ఇచ్చిన సభ అవిశ్వాసం తీర్మానం నోటీసు... సభ ముందుకు వచ్చినప్పుడు అన్నాడీఎంకే , టీఆర్ఎస్ పోడియంలో ఆందోళనకు దిగాయి. స్పీకర్ అవి‌శ్వాస తీర్మానం నోటీసు గురించి చదివినా ఆ పార్టీలు ఆందోళన విరమించలేదు. దీంతో సభ  ఆర్డర్‌లో లేదని సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు. కొద్ది రోజులుగా సభలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇవాళ కూడా సభ సజావుగా సాగుతుందా..అనే అనుమానం నెలకొంది. 
 

English Title
Two no-confidence motions against Modi govt

MORE FROM AUTHOR

RELATED ARTICLES