ఇంకా బతికున్న బ్లూ వేల్‌ గేమ్‌ ...

Submitted by arun on Thu, 10/11/2018 - 14:27
Blue Whale game

పసి ప్రాణాలు తీస్తూ ప్రపంచాన్ని కుదిపేసిన బ్లూవేల్ గేమ్‌ ఇంకా ఉందా..? దేశంలోని చిన్నారులింకా ఆ గేమ్‌ను ఆడుతున్నారా..? ప్లే స్టోర్‌ నుంచి డెలిట్‌ చేశామని చెబుతున్నదాంట్లో నిజమెంత..? కర్ణాటకలో 12 యేళ్ల విద్యార్థి బలవన్మరణంతో బ్లూ వేల్‌ గేమ్‌ మరోసారి తెరపైకి వచ్చింది. బ్లూ వేల్ గేమ్‌ మాయలో చిన్నారులింకా ఉన్నారని ఆ గేమ్‌ ఆడుతున్నారని తేలిపోయింది. 

కర్ణాటకలోని కలబురిగికి చెందిన 12 యేళ్ల సమర్థ్‌ అనే చిన్నారి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఏడో తరగతి చదువుతున్న సమర్థ్‌ చిన్నవయస్సులోనే ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరా తీస్తే కొన్నాళ్లుగా మొబైల్‌ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నాడని, ఇంటర్‌నెట్‌లో బ్లూ వేల్‌ గేమ్‌ ఆడుతున్నాడని తెలిసింది. దాని మాయలో పడి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. 

గత వారం రోజులుగా పరధ్యానంగా ఉన్న సమర్థ్‌ ఇటీవలే ఓ ఇనుప స్టాండ్‌ను కొనివ్వాలని ఇంట్లో వారిని అడిగాడు. స్టాండ్‌ ఎందుకని అడిగితే ప్రాక్టికల్ ఎగ్జామ్‌ కోసం అని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు స్టాండ్‌ను తీసుకొచ్చారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో తనకు పానీపూరి కావాలని మారాం చేస్తే తల్లి బయటకు వెళ్లి వచ్చేలోగా సమర్థ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. చాలాకాలంగా మొబైల్‌తోనే గడుపుతున్న సమర్థ్‌ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతాడని అనుకోలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. 

బ్లూవేల్‌ గేమ్‌ మాయలోనే సమర్థ్‌ ప్రాణం వదిలినట్లు తేలింది. అప్పట్లో సంచలనం రేపిన ఈ గేమ్‌ పట్ల కేంద్రంతో సహా సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మనదేశంలో మరణాలు పెరగడంతో ప్లే స్టోర్‌ నుంచి ఈ గేమ్‌ను తీసేయాలంటూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. అయితే ఈ గేమ్‌ చాపకింద నీరులా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికీ చెప్పకుండా చాలామంది ఈ గేమ్‌ను ఆడుతున్నట్లు తెలుస్తోంది. 

English Title
twelve year old boy who played blue whale game hangs to death in kalaburgi

MORE FROM AUTHOR

RELATED ARTICLES