ఎమ్మెల్యేల్లో మొదలైన ఆందోళన...సర్వే రిపోర్టులు అందజేయనున్న సీఎం

Submitted by arun on Thu, 08/16/2018 - 09:37

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైపోయింది. ముందస్తు ఎన్నికలు తప్పవన్న వాతావరణం క్రియేట్ కావడంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. అధికార పార్టీ అయితే ఒక అడుగు ముందుకేసి అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసింది. త్వరలో జరగనున్న టీఆర్ఎస్‌ ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ ముందస్తుపై ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేయనున్నారు. 

ఎక్కడ చూసినా ముందస్తు ఎన్నికలపైనే చర్చ. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు హోరెత్తుతున్నాయి. ప్రతిపక్షాల సవాళ్లకు స్పందించిన అధికార పక్షం ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం రెడీ అంటూ సంకేతాలిచ్చేసింది. తెలంగాణ భవన్ సాక్షిగా జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముందస్తుపై క్లారిటీ ఇచ్చేశారు సీఎం కేసీఆర్. 

మరోవైపు ఈ నెల 17న జరిగే టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే, చివరి నెలలో చేయించిన సర్వే రిపోర్టులు కూడా ఎమ్మెల్యేలకు అందజేయనుండటంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది.  

షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు జరగాలి. కానీ, నవంబరు, డిసెంబరులలో జరగనున్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తోపాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దానికి తోడు సెప్టెంబరులోనే అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎం ఇటీవల స్పష్టం చేయడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఇక సెప్టెంబరు 2న ప్రగతి నివేదన పేరుతో నిర్వహిస్తున్న సభకు రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో వేదికను కూడా ఖరారు చేశారు. దాదాపు 20లక్షల మందితో సభ ఏర్పాటు చేయనుండటంతో వచ్చే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు, రైతు బీమా, బీసీలకు సబ్సిడీ రుణాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్న సంకేతాలివ్వనున్నారు. మొత్తానికి తెలంగాణలో ముందస్తు ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. 
 

English Title
TRS Plans Biggest Meeting In September

MORE FROM AUTHOR

RELATED ARTICLES