రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..విశ్వాసపాత్రులు, సీనియర్లకు క్యాబినేట్‌లో అవకాశం ?

రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..విశ్వాసపాత్రులు, సీనియర్లకు క్యాబినేట్‌లో అవకాశం ?
x
Highlights

రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. క్యాబినేట్ లో బెర్త్ కోసం ఆశావ‌హులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ వర్కింగ్...

రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. క్యాబినేట్ లో బెర్త్ కోసం ఆశావ‌హులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కెటీఆర్ ను ప్ర‌స‌న్నం చేసుకుంటే, మరికొందరు సామాజిక సమీకరణాలను నమ్ముకున్నారు. ఏ జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కనుందో ? తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్య‌మంత్రిగా కెసీఆర్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న‌తో ప్రమాణస్వీకారంచేసిన మ‌హమూద్ అలీకి హోంమంత్రిగా బాద్య‌త‌లు క‌ట్ట‌బెట్టారు. ఇక పూర్తి స్థాయి క్యాబినెట్ విస్త‌ర‌ణ‌పై కేసీఆర్ దృష్టిసారించారు. టీఆర్ ఎస్ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలో పార్టీలో మొద‌టినుంచి విశ్వాస‌పాత్రులుగా ఉన్న వారికే మంత్రి ప‌దవులు వస్తాయని ముఖ్య‌మంత్రి చెప్ప‌డంతో సీనియర్ ఎమ్మెల్యేలు ఆశ‌లు పెట్టుకున్నారు. మంత్రి పదవి కోసం పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ను పలువురు సీనియర్, తాజా ఎమ్మెల్యేలు ప్ర‌స‌న్నం చేసుకుంటున్నారు.

గతంలోని పలువురు మంత్రులకు కొత్త క్యాబినేట్ లో చోటుద‌క్క‌క‌పోవ‌చ్చ‌నే చ‌ర్చ టీఆర్ ఎస్ లో జరుగుతోంది. ఉమ్మడి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో జూప‌ల్లి కృష్ణారావు ఓట‌మి పాలు కావ‌డంతో వనపర్తి ఎమ్మెల్యే నిరంజ‌న్ రెడ్డికి మంత్రి ప‌దవి ఖాయ‌మ‌ని తెలుస్తోంది. బిసికోటాలో త‌న‌కు మంత్రి పదవి వ‌స్తుంద‌న్న ఆశలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో పట్నం మ‌హేంద‌ర్ రెడ్డి ఓడిపోవ‌డంతో కొడంగ‌ల్ నుంచి గెలిచిన ఆయన సోదరుడు ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డికి లేదా మేడ్చ‌ల్ ఎమ్మెల్యే సి. మ‌ల్లారెడ్డికి బెర్త్ ద‌క్క‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. వ‌రంగ‌ల్ జిల్లాకు సంబంధించిన క‌డియం శ్రీహ‌రికి మళ్లీ మంత్రి పదవి వరిస్తుందనే ప్ర‌చారం జ‌రుగుతున్నాఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపుతార‌న్న గుసగుస‌లు వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాల్లో జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి పేరు గ‌ట్టిగా వినిపిస్తోంది. ముత్తిరెడ్డి కెసీఆర్ కు అత్యంత స‌న్నిహితుడు కావ‌టం ఉద్య‌మ స‌మ‌యం నుంచి పార్టీకి అండ‌గా ఉన్నారనే ప్రచారం కూడ జ‌రుగుతోంది. వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చోటు క‌న్ఫామ్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. డోర్న‌క‌ల్ నియోజక‌వ‌ర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యానాయ‌క్ కూడ పోటీలో ఉన్నారు.

ఉమ్మడి క‌రీంన‌గ‌ర్ జిల్లా కోటాలో మాజీ ఆర్థిక మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ కు స్పీక‌ర్ గా నియ‌మిస్తార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. కెటీఆర్ కు ఇప్ప‌టికే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌దవి క‌ట్ట‌బెట్ట‌డంతో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి అనుమాన‌మేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. మాల సామాజిక వ‌ర్గానికి చెందిన కొప్పుల ఈశ్వ‌ర్ కు ఈ క్యాబినెట్ లో చోటుద‌క్కే అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి మెద‌క్ జిల్లా నుంచి ఎమ్మెల్యే హ‌రీష్ రావుకు మంత్రి పదవి గ్యారంటీ. మ‌హిళా కోటాలో ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. న‌ల్గొండ జిల్లాలో జ‌గ‌దీష్ రెడ్డి, గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిల మ‌ద్య మంత్రి ప‌ద‌వి దోబుచులాడుతోంది. మ‌హిళా కోటాలో ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డికి చోటు ద‌క్క‌క‌పోతే త‌న‌కు అవ‌కాశం వ‌స్తుంద‌ని ఎమ్మెల్యే గొంగిడి సునీత భావిస్తున్నారు. నిజామా బాద్ జిల్లాలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి మళ్లీ మంత్రి ద‌క్కుతుందా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక వేళ పోచారం కు ద‌క్క‌పోతే త‌న‌కే అవ‌కాశం వ‌స్తుంద‌నే భావ‌న‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి ఉన్నారు. జీవ‌న్ రెడ్డికి ఎంపీ క‌విత‌, కెటీఆర్ ఆశీస్సులు ఉండ‌టంతో ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. బిసి కోటాలో సీనియ‌ర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ ఆశ‌పెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గ‌తంలో జోగురామ‌న్న‌, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మంత్రులుగా ప‌నిచేశారు. ఈసారి ఇద్ద‌రిలో ఒక్క‌రికే అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చు.

టీఆర్ ఎస్ కు ఎదురుగాలి వీచిన ఖ‌మ్మంలో ఒకే ఒక్క ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్ గెలుపోందారు. ఈసారి మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌నే ఆశలో ఆయన ఉన్నారు. మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌తో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు కూడ వినిపిస్తోంది. హైద‌రాబాద్ లోనూ ఆశావ‌హుల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. గ‌త క్యాబినెట్ లో మంత్రులుగా ప‌నిచేసి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్, ప‌ద్మారావు ల్లో ఒక్క‌రికే మంత్రిగా చాన్స్ ద‌క్కే అవ‌కాశాలున్నాయి. దానం నాగేంద‌ర్ మంత్రి ప‌ద‌విపై గంపెడాశ‌లు పెట్టుకున్నారు. కెటీఆర్ ఎక్క‌డుంటే దానం అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నారు. కూక‌ట్ ప‌ల్లి, శేరిలింగంప‌ల్లి నుంచి గెలిచిన మాధ‌వ‌రం కృష్ణారావు, ఆరెక‌పూడి గాంధీల పేర్లు కూడ వినిపిస్తున్నాయి. ఎంత మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సామాజిక స‌మీక‌ర‌ణాలు, సీనియారిటీ, పార్టీకి లాయ‌ల్టీ అనే అంశాల‌ను పరిగణలోకి తీసుకుని కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. ఏ ఎమ్మెల్యే జాతకం ఎట్లుందో రేపు తెలిసిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories