టీ కాంగ్ లీడర్లను వెంటాడుతున్న కన్నడ భయం

Submitted by arun on Thu, 06/07/2018 - 13:05
tpcc

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త భయం వెంటాడుతోంది. అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని.. వచ్చేది తమ ప్రభుత్వమే అని భరోసా ఇస్తున్న టీ కాంగ్రెస్ లీడర్లకు.. సరికొత్త టెన్షన్ పట్టుకుంది. యేళ్లుగా ఊరిస్తున్న అధికారం.. ఈ సారి వస్తే అది తమకే దక్కుతుందా..? లేదా..? అనే సమస్య పుట్టుకొచ్చింది. మరి టీ కాంగ్రెస్‌ నాయకులను అంతగా వేధిస్తున్న అంతర్మథనం ఏంటి..? 

ఎన్నికలకు యేడాది సమయమున్నా.. హామీల వర్షం గుప్పిస్తూ.. ప్రజల్లోకి జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న కాంగ్రెస్ లీడర్ల మెదళ్లను.. కొత్తగా పుట్టుకొచ్చిన ఓ సమస్య తొలిచేస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన కన్నడ రాజకీయాల్లో కాంగ్రెస్ పొలిటికల్ ఎత్తుగడలు.. తెలంగాణలోని ఆ పార్టీ నాయకులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి అధికారం దక్కకుండా.. అప్పటివరకు తీవ్ర విమర్శలు చేసుకున్న కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతవరకు బాగానే ఉన్నా.. భవిష్యత్తులో ఇదే ఫార్ములా.. తమ కొంప ముంచుతుందా అనే టెన్షన్ పట్టుకుంది.. టీ కాంగ్ లీడర్లకు. 

కన్నడ రాజకీయాలను కాంగ్రెస్ కోణంలో పరిశీలిస్తే.. అవసరాన్ని బట్టి ప్రాంతీయ పార్టీలతో జట్టు కడుతామనే సంకేతాలను.. ఇచ్చినట్లైంది. దీంతో భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే ఫార్ములాను అప్లై చేసే అవకాశాలు లేకపోలేదు. ఇదే ఆందోళనతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న టీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న కాంగ్రెస్‌ నాయకులు.. చివరకు ఎన్నికలయ్యాక ప్రాంతీయ పార్టీతో జతకట్టాల్సి వస్తే తమ పరిస్థితేంటనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఇక కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని తనకు కేసీఆరే చెప్పారని.. సాక్ష్యాత్తు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పిన డైలాగులతో.. టీ కాంగ్ నాయకుల దిమ్మ తిరిగిపోయింది. ఇంతవరకు తాము పడుతున్న ఆందోళన నిజం కాబోతుందా అనే టెన్షన్‌ తలకెక్కి కూర్చుంది. ఎన్నికల ముందు వరకు యుద్ధం చేసి.. ఆ తర్వాత కర్ణాటక వలె.. ఇక్కడ కూడా అదే టీఆర్ఎస్‌తో జతకట్టాల్సి వస్తుందా అనే అనుమానాలు ఆ పార్టీ నాయకులను వెంటాడుతున్నాయి. 

అధికారం కోసం.. ప్రాంతీయ పార్టీలను అక్కున చేర్చుకోవడానికి సిద్దమవుతున్న కాంగ్రెస్ హైకమాండ్.. తెలంగాణలో అదే సీన్ రిపీట్ అయితే.. టిఆర్ఎస్ ను తప్పసరిగా ఆహ్వనించాల్సి వస్తుంది. అప్పుడు రాష్ట్ర పార్టీ ప్రయోజనాలు బలిచేయాల్సి వస్తుందనే భయంలో.. ఆ పార్టీ నేతలున్నారు. మరి టీ కాంగ్రేస్ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేది వేచి చూడాల్సిందే. 

English Title
telangana congress leaders fear on 2019 elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES