హంగ్‌ అంచనాలతో చకచకా ..పావులు కదుపుతున్న ప్రజాకూటమి

హంగ్‌ అంచనాలతో చకచకా ..పావులు కదుపుతున్న ప్రజాకూటమి
x
Highlights

కాంగ్రెస్‌ కూటమి సైతం, వ్యూహప్రతివ్యూహాలకు తెరలేపింది. ఫలితాలను బట్టి ప్లాన్‌ ఏ, ప్లాన్‌ బీ సిద్దం చేసుకుంటోంది. ఏకంగా ఢిల్లీ పెద్దలు రంగప్రవేశం...

కాంగ్రెస్‌ కూటమి సైతం, వ్యూహప్రతివ్యూహాలకు తెరలేపింది. ఫలితాలను బట్టి ప్లాన్‌ ఏ, ప్లాన్‌ బీ సిద్దం చేసుకుంటోంది. ఏకంగా ఢిల్లీ పెద్దలు రంగప్రవేశం చేశారు. సంకీర్ణ సమీకరణాల్లో దిట్టయిన కర్ణాటక మంత్రి శివకుమార్‌ ఎంటరయ్యారు. అసలు కాంగ్రెస్ ధీమా ఏంటి. ఎలాంటి స్ట్రాటజీలకు పదునుపెడుతోంది.? తెలంగాణలో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో తేలుతుంది కానీ, అంతకుముందే రాజకీయ పార్టీలు అనేక సమీకరణాలు చూసుకుంటున్నాయి. ఇక కాంగ్రెస్ నేతృత్వంలతోని ప్రజాకూటమి అయితే, చాలా వేగంగా పావులు కదుపుతోంది. లగడపాటి సర్వేపై నమ్మకం, అటు ఓటింగ్‌ శాతం పెరగడం వంటి పరిణామాలతో, విజయం తమదేనన్న ధీమాతో చకచకా అస్త్రాలను బయటికి తీస్తోంది.

ప్రజాకూటమిలో పార్టీల నేతలందరూ గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. కూటమి భాగస్వామపక్షాలను ఒక పార్టీగా పరిగణించాలని వినతిపత్రం ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కలిసి ప్రజా కూటమిగా ఏర్పడ్డామని గవర్నర్‌కు తెలిపారు. ప్రజాకూటమిగా ఎన్నికల ముందే ఏర్పడ్డామని అన్ని పార్టీలు కలిసి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ను కూడా ఇచ్చామని చెప్పారు. సర్కారియా కమిషన్‌ సిఫారసులు, కోర్టుల తీర్పు ప్రకారం, ఎక్కువ స్థానాలు పొందిన కూటమినే, ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని గవర్నర్‌ను కోరారు నేతలు. తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌. రాహుల్‌ పిలుపు మేరకు ఉదయం ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్. ఎన్నికల ఫలితాల తరువాత తలెత్తబోయే పరిణామాల గురించి చర్చించారు. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. జాతీయ, స్థానిక సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ గురించి రాహుల్, ఉత్తమ్ సమాలోచనలు జరపారు. ప్రజా కూటమి అభ్యర్థుల విజయావకాశాలు ఎలా ఉన్నాయో రాహుల్ ఆరా తీశారు. ఫలితాలను బట్టి ఎలాంటి వ్యూహం అనుసరించాలో ఉత్తమ్‌కు నిర్దేశించారని తెలిసింది.

అటు ఢిల్లీ నుంచి కాంగ్రెస్‌ పెద్దలు హైదరాబాద్‌లో వాలిపోయారు. కర్ణాటక మంత్రి శివకుమార్‌ సైతం పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కర్ణాటక తరహాలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే, ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేయాలో మేథోమథనం సాగిస్తున్నారు. స్వతంత్రులకు ఇప్పటికే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు మద్దతిస్తే, భరోసా ఉంటుందంటున్నారు. ఢిల్లీలోనూ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి, అండగా ఉండాలని కోరుతున్నారు. కేసీఆర్‌కే తాము బేషరతుగా సపోర్ట్‌ ఇస్తామని ఎంఐఎం ప్రకటించినా, ఎంఐఎం తమకే సపోర్ట్‌ ఇస్తుందన్న ఆశలో ఉంది కాంగ్రెస్. ఆఖరి ప్రయత్నంగా మజ్లిస్‌నూ తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కౌంటింగ్‌కు ముందే సామదానదండోపాయాలతో, అభ్యర్థుల లెక్క పక్కాగా చూసుకుంటోంది కాంగ్రెస్. తన అనుభవాన్నంతా రంగరించి, పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది.

మరోవైపు తమ పార్టీ అభ్యర్థులను సైతం, కాంగ్రెస్ ప్రలోభాలకు గురి చేస్తోందని టీఆర్ఎస్‌ ఆరోపిస్తోంది. నాగర్‌ కర్నూల్ టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి, సెన్సేషనల్‌ ఆరోపణలు చేశారు. చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తనకు ఫోన్ చేసి, కాంగ్రెస్‌కి మద్దతివ్వాలని కోరినట్టు చెప్పారు. రెండుసార్లు విశ్వేశ్వర్ రెడ్డి తనకు ఫోన్ చేశారని గుర్తు చేశారు.మొత్తానికి కౌంటింగ్‌కు ముందే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఫలితాలు పోటాపోటీగా ఉంటే, తమిళనాడు, కర్ణాటక తరహాలో క్యాంపు రాజకీయాలు కూడా షురూ అయ్యే ఛాన్సుంది. స్వతంత్రులపై టీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు దృష్టిపెట్టాయి. బేరసారాలూ మొదలెట్టాయి. ఫిరాయింపులకూ ప్రయత్నిస్తున్నాయి. ఇవన్నీ జరగాలంటే, పార్టీల వ్యూహాలు పారాలంటే, హంగ్‌ పరిస్థితులు రావాలి. అయితే హంగ్‌ రాదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదో ఒక పార్టీకే జనం పట్టం కడతారని అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories