ఎన్టీఆర్ బయోపిక్ నుంచి డైరెక్టర్ తేజ ఔట్

Submitted by arun on Thu, 04/26/2018 - 11:14
NTR Biopic

ఎన్టీఆర్ బయోపిక్‌ ప్రాజెక్ట్‌ నుంచి డైరెక్టర్ తేజ తప్పుకున్నారు. ఈ సినిమాకు తాను న్యాయం చెయ్యలేననిపించి దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించి తేజ ఓ సంచలనం రేపారు. అయితే దర్శకత్వ బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహానటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి..ఎన్టీఆర్‌ బయోపిక్‌కు సంబంధించిన సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి దర్శకుడు తేజ తప్పుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు డైరెక్టర్ తేజ. తాను ఎన్టీఆర్ కు వీరాభిమానినని అయితే, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు న్యాయం చేయలేనేమో అనే తప్పుకుంటున్నానని చెప్పారు. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించే అవకాశం ఉండొచ్చని తేజ తెలిపారు. 

మార్చి 29న తెలుగు దేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామకృష్ణ స్టూడియోలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. తండ్రి ఎన్టీఆర్‌ తరహాలో బాలకృష్ణ దుర్యోధనుడి వేషంలో చెప్పిన సంభాషణ సీన్‌తో షూటింగ్‌ పట్టాలెక్కింది. అయితే ఎన్టీఆర్‌ జీవితాన్ని ఎలా చూపించాలి? ఎక్కడి నుంచి ఎక్కడివరకు ఆయన జీవితాన్ని తెరకెక్కించాలి? అనే విషయాల్లో బాలకృష్ణకు, దర్శకుడు తేజకు మధ్య విభేదాలు వచ్చాయని స్క్రిప్ట్‌ విషయంలో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా తేజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. 

తన తండ్రి జీవితం తనకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలిసే చాన్సే లేదని భావిస్తున్న బాలయ్య, ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయిపోతున్నారని టాక్. ఇప్పటి వరకు తీసిన సీన్లలో సైతం ఆయనే డైలాగులు, గెటప్పులు, డైరెక్షన్ అన్నీ చూసుకుంటూ రావడంతో తేజ ఇబ్బంది పడినట్టుగా తెలుస్తోంది. బాలకృష్ణ ఎన్టీఆర్ సీఎం అయ్యేవరకు తీయమని చెబితే తేజ మరణం వరకు తీస్తానని చెప్పడంతో విభేదాలు ముదురు పాకాన పడ్డట్టు చెబుతున్నారు.

దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావుకు, గౌతమీపుత్ర శాతకర్ణి డైరెక్టర్‌ క్రిష్‌కు బాలయ్య కబురు పెట్టినట్టు తెలిసింది. మేలో 15 రోజులు షూటింగ్ చేయాల్సిందేనని బాలకృష్ణ పట్టుబడుతున్నట్టు సమాచారం. అయితే బాలీవుడ్ సినిమా ‘మణికర్ణిక’ షూటింగ్‌లో క్రిష్‌ బిజీగా ఉండటంతో.. ఆ చాన్స్‌ రాఘవేంద్రరావుకు దక్కవచ్చునని భావిస్తున్నారు. వీరిద్దరు కాదంటే స్వయంగా తానే దర్శకత్వం వహించాలని బాలకృష్ణ భావిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

English Title
Teja Walk Out Of NTR Biopic

MORE FROM AUTHOR

RELATED ARTICLES