‘తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్’

Submitted by arun on Thu, 03/01/2018 - 12:46
babuntr

స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉంది. ఆయన పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉండగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్నారు. ఇకపోతే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ ఉన్నారు. అయితే, ఏపీలో టీడీపీ అధికారంలో ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీపీ అధ్యక్షుడుగా యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను చేయాలంటూ ఆ రాష్ట్రానికి చెందిన టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అదీ కూడా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలోనే. దీంతో చంద్రబాబుతో పార్టీ ఇతర నేతలు కూడా ఒకింత షాక్‌‍కు గురయ్యారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలంగాణ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయిన సందర్భంలో ఈ ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. కార్యకర్తలను సముదాయిస్తూ చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎల్లకాలం ఉంటుందని పార్టీని విలీనం చేసే హక్కు ఎవరికీ లేదని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.

తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఆయన పార్టీనేతలు, కార్యకర్తలతో చర్చించారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీతో పెట్టుకున్నాం. మనం ఇరవై సీట్లు గెలిచాం. ఆ సందర్భంగా ఒక ఎమ్మెల్సీని కూడా గెలిపించాం. తర్వాత వచ్చిన రాజకీయ పరిణామాల్లో మనకు చెప్పకుండానే బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదని బీజేపీ వాళ్లే ప్రకటించారు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఏది చేసినా చెప్పి చేయాలి. కానీ బీజేపీ అలా చేయలేదంటూ చంద్రబాబు బీజేపీని ఈ సందర్భంగా విమర్శించారు. నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉంటే తెలుగుదేశం పార్టీకి మళ్లీ పాత రోజులు వస్తాయి.. అప్పుడే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని గతంలోనే టీటీడీపీ అధ్యక్షుడు రమణకి చెప్పానని చంద్రబాబు గుర్తు చేశారు.
 

English Title
tdp workers demands to chandrababu jr ntr as party chief

MORE FROM AUTHOR

RELATED ARTICLES