అనితా ఓ అనితా

అనితా ఓ అనితా
x
Highlights

చిన్నప్పటినుంచీ ఆమెకున్న ఒకే ఒక స్వప్నం... డాక్టర్ అవ్వాలని. ఇందుకోసం పాపం రేయింబవళ్లు కష్టపడి చదివింది, మంచి మార్కులు సాధించింది, కానీ ఇంతలోనే ‘నీట్’...

చిన్నప్పటినుంచీ ఆమెకున్న ఒకే ఒక స్వప్నం... డాక్టర్ అవ్వాలని. ఇందుకోసం పాపం రేయింబవళ్లు కష్టపడి చదివింది, మంచి మార్కులు సాధించింది, కానీ ఇంతలోనే ‘నీట్’ అనే రాకాసిబల్లి బారిన పడి.. ప్రాణాలు కాపాడాల్సిన వైద్య వృత్తి చేపట్టకముందే బలవంతంగా ప్రాణాలు తీసుకుంది అనిత. సరదాగా అందరూ డాక్టర్ అనిత, డాక్టర్ అనిత అంటూ ఎప్పుడూ ఏడిపించేవారు, కానీ అర్థాంతరంగా మరణించిందన్న అనిత మరణవార్త విని, బహుశా కంటతడి పెట్టని తమిళ విద్యార్థి, తమిళ తల్లిదండ్రులు ఉండరేమో. అంతలా అందరినీ కలచివేసింది అనిత జీవితం, అనిత మరణం.

నీట్ బలితీసుకున్న విద్యాకుసుమం

200/200 మార్కులు..
దళిత కుటుంబంలో పుట్టిన అనిత అత్యంత వెనుకబడ్డ గ్రామీణప్రాంతంనుంచి వచ్చినప్పటికీ చదువులో మాత్రం అందరికంటే ముందుండేది. కడు పేద అమ్మాయి.. కానీ చదువుల్లో సాక్షాత్తు సరస్వతీదేవి అన్నట్టు మార్కులు సాధించింది. 12వ తరగతిలో 200కు గానూ ఏకంగా 196.75 మార్కులను సాధించింది. కానీ నీట్‌లో 720కి గానూ 86 మార్కులు మాత్రమే స్కోర్ చేయగలిగింది. ఇక్కడే అనిత చతికిలపడింది. ఫిజిక్స్, మ్యాథ్స్‌లో 200కు 200 మార్కులు, కెమిస్ట్రీలో 199, బయాలజీలో 194 సాధించిన తెలివైన విద్యార్థిగా నిలిచిన అనిత జీవన పోరాటంలో ఓడిపోయింది. అసామాన్య ప్రతిభా పాటవాలను చదువులో ప్రదర్శించిన సామాన్యురాలు చివరికి విధి వంచితురాలిగా మిగిలిపోయే దుస్థితికి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించడం కుదరదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో డిప్రెషన్‌లోకి పోయింది అనిత. మరోవైపు రాజకీయ ఒత్తిడి కూడా అనితను ఊపిరాడకుండా చేశాయి. అసలు క్లాస్ 12లో వచ్చిన మెరిట్ ప్రాతిపదికనే గత 9 ఏళ్లుగా మెడికల్ సీట్లు ఇస్తూ వస్తున్న తమిళనాడు ప్రభుత్వం ప్రతిభకు మాత్రమే పట్టంకట్టింది. కానీ తాజాగా నీట్ కారణంగా తనకు మెడికల్ సీట్ వచ్చినట్టే వచ్చి, చేజారడంపై అనిత తీవ్రంగా ఆవేదన చెందింది. ఎన్జీఓల ఆర్థికసాయంతో సుప్రీంకోర్టులోనూ పోరాడి, ఓడి, అలసిన అనిత, బలవన్మరణానికి పాల్పడి, మరోసారి నీట్‌పై అగ్గిని రగిల్చింది.

నీట్‌ను క్రాస్ చేయాలంటే కోచింగ్ తప్పదు...
పేద, గ్రామీణ, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు నీట్ పరీక్షలో అర్హత సాధించడం అసాధ్యం. తమిళనాడులో విద్యావిధానాన్ని ఒకటో తరగతి నుంచి మార్చుకుంటూ వస్తే తప్ప, వీరెవ్వరూ నీట్‌లో ఉత్తీర్ణత సాధించడం అసాధ్యం. లేదా లక్ష రూపాయలకు పైగా ఫీజు చెల్లిస్తే కోచింగ్ తీసుకుని, నీట్ సిలబస్‌ను ఔపోసనపట్టి, అప్పుడు మాత్రమే నీట్‌లో ర్యాంక్ సాధించే ఛాన్స్ లభిస్తుంది. కానీ ఈ స్థోమత లేని విద్యార్థులకు ఆత్మహత్యే శరణ్యం అన్నట్టు తయారైంది పరిస్థితి.

నీట్‌లో క్వాలిఫై కాలేని అసమర్థులుగా దక్షిణాది విద్యార్థులను ముద్ర వేసి, బలవంతంగా వారి కలలను తొక్కేయడం అసంఖ్యాకమైన విద్యార్థుల్లో అసహనం, డిప్రెషన్‌ను రాజేసింది. ‘ఇది చాలా కష్టమైన పరీక్ష, ఎందుకంటే పేదవారు నీట్ పరీక్ష కోసం కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టలేరు, నాలాంటివారి పరిస్థితి ఏమిటి అంటూ అనిత్ వాపోయేది.

తమిళుల ఆశాదీపం..
తమిళ విద్యార్థుల నీట్ కష్టాలకు అనిత ఉద్యమ రూపం, మెడికల్ సీట్ల కోసం పోటీపడుతున్న లక్షలాది మంది విద్యార్థులందరి సమస్యలకు అనిత అనే ఈ అమ్మాయే ఆశాదీపంగా మారింది. తమిళ విద్యార్థులకు ప్రమాణాలు తక్కువ ఉండేలా సిలబస్ ఉందనే అపవాదును దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న సమయంలో ఒక ఆడబిడ్డ చేసిన పోరాటం ఎంతోమంది కళ్లు తెరిపిం చింది. ముఖ్యంగా తమ పిల్లలను వైద్యులుగా చూడాలనుకున్న డాక్టర్లకైతే అనిత ఓ ఆశాదీపంలా కనిపించింది. కోర్టులో న్యాయపోరాటం చేసింది..కోర్టు తమిళనాడుకు నీట్ నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదంది. అంతే పోరు నడిపింది. మరోవైపు, సాంఘికంగా, ఆర్థికంగా అత్యంత వెనుకబడ్డ అనిత కుటుంబానికి ఈమె చక్కని దారి చూపించగలదన్న సమయంలో ఇలా అర్ధాంతరంగా బలవన్మరణం పాలవ్వాల్సి వచ్చింది. అసలు అనిత అంత పిరికిదా అంటే దీనికి జవాబు మాత్రం నో అనే వస్తుంది. నాడు తమిళ విద్యార్థులను, తల్లిదండ్రులను నీట్‌పై పోరుకు ఏకం చేసిన గళంగా నిలువగా, నేడు తమిళ ప్రజలనంతా ఆలోచింప చేస్తోంది. అనిత మరణం ప్రభావం కేంద్రంపై ప్రత్యక్షంగా పడుతోంది.

కేంద్రానికి పెద్ద షాక్...
నీట్ పరీక్షను బలవంతంగా కేంద్రం రుద్దుతున్న ఓ చర్యగా తమిళనాడులోని గ్రామగ్రామానికి చెందిన ప్రజలు భావిస్తున్నారు. తప్పకుండా దీనికి తగిన మూల్యం తమిళనాడులో బీజేపీ చెల్లించాల్సి వస్తుంది.. అన్నది తాజాగా ద్రవిడ పార్టీలన్నీ వెలిబుచ్చుతున్న అభిప్రాయం. అనితకు జరిగిన అన్యాయంపై తమిళులంతా ఏకమై గళమెత్తారు. సెలబ్రిటీలు, సామాన్యులు అన్న తేడా లేకుండా ఉన్నవారు లేనివారు అంతా కదలివచ్చారు, కేంద్రంలో కదలిక తెచ్చేందుకు సోషల్ మీడియా, మీడియాలో నీట్‌పై గళమెత్తారు. తిరుచ్చిలో రోజు కూలీగా పనిచేస్తున్న షణ్ముగం కుమార్తె ..17 ఏళ్ల అమ్మాయి అనిత మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అన్ని రాష్ట్రాల్లోని విద్యార్థులు ఇప్పుడు నీట్ లోతుపాతులను పరిశీలించేలా చేస్తోంది. నీట్‌పై అంతకంతకూ పెరుగుతున్న ఒత్తిడిని కేంద్రం తట్టుకోలేక పోతోంది. రాష్ట్రవ్యాప్తంగా తమిళులంతా చేస్తున్న ఉద్యమం కాస్తా ద్రవిడ ఉద్యమంగా రూపాంతరం చెందింది.

దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఇది మరో జల్లికట్టు ఉద్యమంలా మారుతుందేమోననే భయం పట్టుకుంది. వెరసి నీట్‌పై పోరాటం బీజేపీ, బీజేపీయేతర ద్రవిడ పార్టీల ఉద్యమంగా మారిపోయింది. అందుకే ‘మా ఓపికను పరీక్షించవద్దు, మాపై అనాగరికంగా దాడి చేయవద్దు అంటూ బీజేపీ ఘాటుగా తమిళులపై స్పందించాల్సి వచ్చింది. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని, కేవలం నగరాలకు చెందిన పార్టీ అని, ఇంకా చెప్పాలంటే ఉత్తరాది పార్టీనే అన్న విషయం మరోమారు రుజువైందంటూ తమిళ పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. గత కొన్ని నెలలుగా నీట్‌పై తమిళులు చేస్తున్న ఈ ఆరోపణలపై విసుగు చెందిన బీజేపీ, తమిళ నేతలు బ్రూటల్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది.

ప్రాణం పోతే డబ్బిస్తారా?
అనిత మరణంతో, తమ ప్రభుత్వంపై పడ్డ మరకను తొలగించుకునేందుకు అన్నాడీఎంకే సర్కారు 7 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించి, చేతులు దులుపుకుంది. చెక్ ఇవ్వడానికి అనిత తల్లిదండ్రులవద్దకు జిల్లా కలెక్టర్ వచ్చి సాయాన్ని అందజేసే ప్రయత్నం చేశారు. కానీ అనిత తల్లిదండ్రులు పేదవారైనా ఆత్మాభిమానం మెండుగా ఉన్న కుటుంబం కావడంతో ఆ సాయాన్ని తిప్పికొట్టారు. ‘అనిత మరణించింది కేవలం నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని మాత్రమే కానీ ఎటువంటి ప్రభుత్వ సాయం కోసం కాదు’ అంటూ తల్లిదండ్రులు గట్టిగా జవాబు చెప్పేసరికి జిల్లా కలెక్టర్ షాక్ తిన్నారు. ఇంకే విద్యార్థి అనితలా చావకూడదంటూ భోరుమన్నారు అనిత తల్లిదండ్రులు.

సెలబ్రిటీలను కదిలించిన అనిత...
‘అనిత నా కుమార్తె.. ఆమె కోసం నేను గొంతెత్తా ఇది అనిత మరణవార్త తెలిసి, విశ్వనటుడు కమల్‌హాసన్ స్పందించిన విధానమంటే అనిత వేదన, అనిత లాంటి వారి ఆవేదన ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది. రజనీకాంత్ కూడా అనిత మరణం అత్యంత హృదయవిదారకమైన విషయంగా పేర్కొన్నారు. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా అనిత మరణంపై స్పందిస్తూ, విద్యార్థులెవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక అనిత చేపట్టిన నీట్ వ్యతిరేక ఉద్యమం మరో కీలక మలుపులు తిరిగేలా సామాజిక మాధ్యమాల్లో శరవేగంగా వ్యాపిస్తోంది. అసలు మన విద్యావిధానం ఎటుపోతోందనే అనుమానాలను రేకెత్తిస్తోంది. రామనాథపురం వంటి అత్యంత వెనుకబడిన జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు గతేడాది మెడికల్ కాలేజ్‌లో అడ్మిషన్ సంపాదించారు.

మరి వారంతా చక్కగా మెడిసిన్ చదువుకుంటుండగా, కొత్తగా వచ్చిన నీట్‌తో మాకు వచ్చిన ప్రత్యేక లాభమేంటి అని తమిళులు అమాయకంగా అడుగుతున్న ప్రశ్నకు జవాబులు చెప్పేవారు లేరు. ఇప్పటివరకూ ఉన్న మన భారతీయ వైద్యులెవ్వరూ నీట్ పరీక్షలకోసం చదివినవారు, నీట్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు కారే, మరి ప్రపంచం మెచ్చిన వైద్యులుగా వారు తమ వృత్తిలో ఎలా విజయం సాధించగలుగుతున్నారు ? నీట్‌లు లేని కాలంలో వైద్య కోర్సులకు విద్యార్థులను ఎంపిక చేసిన విధానం లోపభూయిష్టమైనదైతే, వీరంతా తమ వైద్యవృత్తిలో అసామాన ప్రతిభా పాటవాలు ఎలా చూపగలిగారన్నవి ఇప్పుడు శేషప్రశ్నలుగా మిగిలాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories