బంగారం అడ్డా... శంషాబాద్‌ గడ్డ.. యథేచ్ఛగా తరలింపు

బంగారం అడ్డా... శంషాబాద్‌ గడ్డ.. యథేచ్ఛగా తరలింపు
x
Highlights

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా బంగారం అక్రమరవాణా జోరుగా సాగుతోంది. కిలోలకొద్ది బంగారం అక్రమ మార్గంలో నగరానికి వస్తోంది. ఇంటి దొంగల సహకారంతో...

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా బంగారం అక్రమరవాణా జోరుగా సాగుతోంది. కిలోలకొద్ది బంగారం అక్రమ మార్గంలో నగరానికి వస్తోంది. ఇంటి దొంగల సహకారంతో అంతర్జాతీయ ముఠాలు సాధారణ ప్రయాణికులనే కొరియర్లుగా మార్చి వేలకోట్ల విలువైన బంగారాన్ని తరలిస్తున్నారు. సిటీలోని బంగారు వ్యాపారులకు ఈ అక్రమరవాణాలో సంబంధాలున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నా..వారిని గుర్తించటంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల నుంచి కిలోల కొద్దీ అక్రమ బంగారం పట్టుబడుతోంది. బ్యాగ్ జిప్పుల్లో, కరెంట్ తీగలుగా, సూట్‌కేసు అరల్లో, చెప్పులు, బొమ్మలు, చివరికి ఆడవాళ్ళు ధరించే లో దుస్తుల్లోనూ బంగారాన్ని పెట్టి అక్రమ రవాణా చేస్తున్న తీరు కస్టమ్స్ అధికారులు నోళ్లు వెళ్ళబెట్టేలా చేస్తుంది.

ఈ వారంలోనే దాదాపు కోటి రూపాయల విలువ చేసే మూడు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఓ మహిళ దగ్గర 1099 గ్రాముల బంగారం పట్టుబడింది. కార్బన్ పేపర్‌లో బంగారు రేకును చుట్టారు. దుబాయ్‌ విమానాశ్రయంలో ఓ వ్యక్తి ఆటబొమ్మలు, చాక్లెట్లు ఉన్న ఓ ప్యాక్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో తమ బంధువులకు ఇవ్వాలని తనకిచ్చినట్టు ఆమె తెలిపింది. ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతకు ముందురోజే ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ విమానాల పార్కింగ్‌ బే 56ఎల్‌ సమీపంలో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న వ్యక్తికి స్మగ్లర్‌ పర్సు ఇచ్చి వెళ్లిపోయాడు. అధికారులు అటు రావడంతో భయపడిన ఆ వ్యక్తి పర్సును ఎయిరో బ్రిడ్జి దగ్గర చీకట్లోకి విసిరేసి పరుగెత్తాడు. ఆ పర్సులో నల్లని టేపులో చుట్టిన 1632గ్రాముల 14 బంగారం బిస్కెట్లు పట్టుబడ్డాయి. దుబాయ్‌ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడు 615 గ్రాముల బంగారం బిస్కెట్లను చెత్తడబ్బాలో పడేసి వెళ్లిపోయాడు.

ఇంటిదొంగల సహకారంతో సాధారణ ప్రయాణీకుల ద్వారా స్మగ్లింగ్ మాఫియా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టు అధికారుల విచారణలో తేలింది. తొలిసారి ప్రయాణించే మహిళలతో పాటు ఉపాధి కోసం వెతికే వారిని కూడా వలలో వేసుకుని ఈ ముఠా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. స్మగ్లింగ్‌ ముఠాకు చెందిన ఆరుగురు వ్యక్తులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు దగ్గరే కాపేసి.. ప్రయాణికుల ద్వారా వచ్చిన పార్సిళ్లను సమీపంలోని హోటళ్లకు తీసుకెళతారు. నలుగురు వ్యక్తులు కేరళ తీసుకెళ్లి అక్కడి నుంచి ముంబైకి తరలిస్తున్నట్లు.. మరో ఇద్దరు నేరుగా హైదరాబాద్‌ నుంచే ముంబైకి తరలిస్తున్నట్లు గుర్తించారు. వీరితో పాటు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. వారం రోజుల్లో 5 పార్సిళ్లను ముంబైకి తరలించినట్లు నిందితులు తెలిపారని సమాచారం.

నగరానికి చెందిన కొన్ని ప్రముఖ బంగారు దుకాణాల వ్యాపారులకు ఈ ముఠాలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. పూర్తి వివరాలు రాబట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. లోపలి వ్యక్తుల ప్రమేయం లేకుండా ఇంత భారీగా స్మగ్లింగ్ చేయడం అసాధ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories