దూసుకుపోతున్న దినకరన్‌

Submitted by arun on Sun, 12/24/2017 - 10:46
ttv dinakaran

తమిళనాడులోని ఆర్కే నగర్ ఉపఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది. కౌంటింగ్ ప్రారంభం కావడంతో అందరి దృష్టి ఆర్కే నగర్ ఓట్ల లెక్కింపుపై పడింది. అధికార ప్రతిపక్షాలతోపాటు స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్‌కు సెమీ ఫైనల్‌ లాంటి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అన్న ఆసక్తి దేశ వ్యాప్తంగా నెలకొంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎవరికి వారు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఫలానా వారు గెలుస్తారని ముందస్తు సర్వేలు చెబుతున్నప్పటికీ ఆర్కేనగర్‌ ఓటర్ల నాడి ఏంటో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. 

మొత్తం 100 మంది అధికారుల ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 19 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నానికి తుది ఫలితం తేలిపోనుంది. ఈ నెల 21న ఉప ఎన్నిక ఓటింగ్‌ పూర్తికాగా మొత్తం 1.77 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదు కావడంతో గెలుపు ఎవరిదన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. 

మొత్తం 59 మంది అభ్యర్థులు ఈ ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మధుసూదన్‌, మరుదుగణేష్‌, టీటీవీ దినకరన్‌ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఒక్కో బెంచీకి ముగ్గురు లెక్కింపు అధికారులు, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉన్నారు. మొదటి రౌండ్‌ లెక్కింపు ఇప్పటికే పూర్తయ్యింది. అయితే, కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రధాన అభ్యర్థుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, నేతలకు మధ్య వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీకి చెందిన నేతలను లోనికి అనుమతిస్తున్నారని ఆరోపించారు. 

రెండో రౌండ్ పూర్తయ్యే సరికి ఇండిపెండెంట్ అభ్యర్థి టీటీవీ దినకరన్ ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో అన్నా డీఎంకే అభ్యర్థి మధుసూదన్, మూడో స్థానంలో డీఎంకే అభ్యర్థి మరుదుగణేష్ ఉన్నారు. ఇప్పటి వరకూ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల సంఖ్యను చూస్తే అన్నాడీఎంకే అభ్యర్థికి 4521, డీఎంకే అభ్యర్థికి 2383, ఇండిపెండెంట్ అభ్యర్థి దినకరన్‌‌కు 10,421 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 
 

English Title
RK Nagar By-Election Result 2017

MORE FROM AUTHOR

RELATED ARTICLES