మురళీ ఆత్మహత్యతో తెలంగాణలో పరిణామాలు ఎలా మారబోతున్నాయి.?

Highlights

ఒక ఆత్మహత్య... కొత్త చరిత్రను సృష్టించింది. ఒక ఆత్మహత్య... స్వరాష్ట్ర సాధన కోసం సంచలనమైంది. ఒక ఆత్మహత్య తెలంగాణలో సరికొత్త శకం లిఖించింది. ఇది గతం....

ఒక ఆత్మహత్య... కొత్త చరిత్రను సృష్టించింది. ఒక ఆత్మహత్య... స్వరాష్ట్ర సాధన కోసం సంచలనమైంది. ఒక ఆత్మహత్య తెలంగాణలో సరికొత్త శకం లిఖించింది. ఇది గతం. శ్రీకాంతచారి రూపంలో సాక్షాత్కరించిన వాస్తవం. కానీ ఇప్పుడు అలాంటి చరిత్రే మళ్లీ పునరావృతం అవుతుందా? ఉస్మానియా యూనివర్సిటీలో మురళీ ఆత్మహత్యతో తెలంగాణలో పరిణామాలు ఎలా మారబోతున్నాయి.?

డిసెంబరు 3, 2009. తెలంగాణ కోసం విద్యార్థి శ్రీకాంతచారి ఆత్మార్పణం చేసుకున్న రోజు. తెలంగాణ ఉద్యమం ఉధృతమైన మలుపు తీసుకున్న రోజు. అంతకుముందు ఏదో అలా సాగిపోయి సాగిలాపడుతుందనుకున్న దశ నుంచి ఊహించని విధంగా ఊహకు అందని విధంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిద్దుర లేపిన రోజు. మొత్తంగా స్వరాష్ట్ర కాంక్షను ఎలుగెత్తి విశ్వవ్యాపితం చేసిన రోజ. నాలుగు కోట్ల ప్రజాకాంక్షను పతాకస్థాయికి చేర్చిన రోజు. డిసెంబరు 3, 2017. ఏడేళ్ల తర్వాత మళ్లీ అదే రోజు. ఉస్మానియా యూనివర్సిటీలో మురళీ ఆత్మహత్య చేసుకున్న రోజు.

కొలువుల కొట్లాట సభకు ఒక్కరోజు ముందు జరిగిన ఈ ఆత్మహత్య చరిత్ర గతిని మరోసారి మలుపు తిప్పుబోతుందా? నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఉద్యమించి కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తమను గాలికొదిలేశారంటూ జేఏసీ అండతో నిరుద్యోగులు కదంతొక్కుతున్న ఈ సమయంలో ఈ ఆత్మహత్య జరగడంతో ఇలాంటి ప్రశ్నే ఉదయిస్తుంది.

రెండు ఘటనలు ఒక్కసారి పరిశీలిద్దాం. మొదటి ఘటన సరికొత్త చరిత్ర సృష్టించింది. అందులో అనుమానమే లేదు. రెండో ఘటన మాత్రం మరో చరిత్రను లిఖిస్తుందని చెబుతోంది జేఏసీ. మురళీ ఆత్మహత్యకు కారణాలు ఏమైనా కావచ్చు. అతని ఆత్మార్పణం వెనుక అనేక అనుమానాలూ ఉండొచ్చు. కానీ తెలంగాణ కోసం కొట్లాడి కొదమసింహాల ఉరికి ఉతికి ఆరేసిన జేఏసీ సహా నిరుద్యోగులు, అన్ని పార్టీల నాయకులు మురళీ సూసైడ్‌ను సర్కార్‌ మొండి వైఖరికి ముడేస్తున్నారు.

అవును. నూటికి నూరుపాళ్లు నిజం. కొలువుల కోసం కొదమసింహాలై కొట్లాడుతామని, తెలంగాణ సర్కార్‌‌కు కొరకరాని కొయ్యలా మారుతామని, నిరుద్యోగుల కోసం మరో ఉద్యమంతో బెబ్బులిలా విరుచుకుపడుతామంటున్న జేఏసీ మురళీ భౌతికకాయాన్ని సందర్శించింది. నివాళులర్పించింది. ప్రభుత్వ వైఖరి వల్లే మురళి ఆత్మహత్య చేసుకున్నాడంటూ విద్యార్థి సంఘాలకు ఆందోళనకు దిగింది. పరిహారంపై ప్రభుత్వం హామీ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతోంది.

మొత్తంగా మురళీ ఆత్మహత్యతో జేఏసీ మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతోందా? అన్ని పక్షాలను ఏకం చేసి రాజకీయంగా టీఆర్ఎస్‌పై యుద్ధానికి సన్నద్ధమవుతుందా? మురళీ సూసైడ్‌ ఎవరికి ఎలాంటి గుణపాఠం నేర్పించబోతోంది? ఇవన్నీ సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories