ఆ స్కూల్లో ఒక్కడే స్టూడెంట్

x
Highlights

కార్పొరేట్ కాన్వెంట్‌ల దెబ్బకు సర్కారి బడులు చిన్నబోతున్నాయి. ఏటికేడు తగ్గుతున్న విద్యార్ధులతో ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ‌్నార్ధకంగా మారుతోంది. పలు...

కార్పొరేట్ కాన్వెంట్‌ల దెబ్బకు సర్కారి బడులు చిన్నబోతున్నాయి. ఏటికేడు తగ్గుతున్న విద్యార్ధులతో ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ‌్నార్ధకంగా మారుతోంది. పలు చోట్ల విద్యార్ధుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతోంది. పశ్చిమ గోదావరి జల్లాలో ఒక్క విద్యార్ధి కోసం పాఠశాలను నడుపుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల వైపు చిన్నారులను రప్పించేందుకు రోజుకో పథకం చేపడుతున్నా ఫలితం దక్కడం లేదు. అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు, సకల సౌకర్యాలు, ఉచిత విద్య అందిస్తున్నా సర్కార్ చదువులపై విద్యార్ధుల తల్లిదండ్రులకు నమ్మకం కుదరడం లేదు. పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం కొణిజర్ల గ్రామంలోని ఈ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ఒకే ఒక విద్యార్ధి చదువుకుంటున్నాడు.

ఈ ప్రాధమిక పాఠశాల పరిధిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుకునే విద్యార్ధులు 50 మంది వరకు ఉన్నారు. వీరిలో ఈ చిన్నారి తప్ప మిగిలిన వారంతా ప్రయివేటు స్కూళ్లలోనే చదువుకుంటున్నారు. సర్కారు బడిలో అన్ని సదుపాయాలున్నా ఇక్కడి విద్యార్దుల తల్లిదండ్రులు మాత్రం వేలకు వేలు డబ్బుపోసి కాన్వెంట్ చదువులను కొంటున్నారు. గత ఐదేళ్లుగా చదువుతున్న ఈ ఒక్క విద్యార్ది కోసమే పాఠశాల నిర్వహిస్తున్నారు. ఇతని కోసం ఓ ఉపాధ్యాయుడితో పాటు మధ్యాహ్న భోజన పథకం కోసం మరో ఆయా పని చేస్తున్నారు. ఈ ఒక్క విద్యార్ధి చదువు కోసం ఉద్యోగుల జీతాలతో కలిపి రోజుకు 15 వందల రూపాయల పైనే ఖ‌ర్చు చేస్తున్నారు.

పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య తగ్గిపోతున్నా అటు అధ్యాపకులు గాని ఇటు ఉన్నతాధికారులు గాని పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాల ప్రాధాన్యత, ఉపాధ్యాయుల అర్హత, సదుపాయల గురించి తెలియజేసే అవకాశాలున్నా ఆదిశగా ఏమాత్రం ఆలోచించడం లేదు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళితే అదిగో ఇదిగో అంటూ మాటలకు పరిమితం చేస్తున్నారు.

ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ప్రయివేటు తాకిడి గ్రామాలను ముంచెత్తుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్ధితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ పాఠశాలలు గతంగా మారుతాయంటూ హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్దాయిలో అవగహన కల్పించినప్పుడే సర్కారు బడుల తలరాత మారుతుందంటూ సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories