`ఆఫీస‌ర్‌` మూవీ రివ్యూ

`ఆఫీస‌ర్‌` మూవీ రివ్యూ
x
Highlights

సినిమా పేరు: ఆఫీసర్‌ నటీనటులు: నాగార్జున, మైరా శరీన్‌, ఫెరోజ్‌ అబ్బాసీ, షాయాజీ షిండే, రాజేంద్రప్రసాద్‌, అజయ్‌, ప్రియదర్శి, బేబీ కావ్య తదితరులు సంగీతం:...

సినిమా పేరు: ఆఫీసర్‌
నటీనటులు: నాగార్జున, మైరా శరీన్‌, ఫెరోజ్‌ అబ్బాసీ, షాయాజీ షిండే, రాజేంద్రప్రసాద్‌, అజయ్‌, ప్రియదర్శి, బేబీ కావ్య తదితరులు
సంగీతం: రవి శంకర్‌
సినిమాటోగ్రఫీ: ఎన్‌. భరత్‌ వ్యాస్‌, రాహుల్‌ పెనుమత్స
ఎడిటింగ్‌: అన్వర్‌ అలీ, ఆర్‌.కమల్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాంగోపాల్‌వర్మ
బ్యానర్‌: ఆర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ: 01-06-2018
కింగ్ నాగార్జున - ఆర్జీవీ క్రేజీ కాంబినేషన్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఆఫీసర్’ చిత్రం భారీ అంచనాల నడుమ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కర్ణాటకకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ కె.ఎం.ప్రసన్న జీవితం ఆధారంగా యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ఆఫీసర్’ చిత్రాన్ని రూపొందించారు వర్మ. ఈ మూవీలో నాగార్జున సరసన ముంబై మోడల్ మైరా సరీన్ జోడీ కట్టింది. తెలుగులో ఆమెకు తొలి చిత్రం ఇదే కావడం విశేషం. వ‌ర్మలో విష‌యం త‌గ్గిపోయింది అని అంద‌రూ అనుకుంటున్న స‌మ‌యంలో వ‌ర్మ ఓపెన్ చాలెంజ్ చేశాడు. `ఆఫీస‌ర్‌` సినిమాను తాను అంద‌రూ మెచ్చుకునేలా తీస్తాన‌ని... ఒక ప‌క్క సెన్సేష‌న‌ల్ కాంబినేష‌న్‌.. మ‌రో ప‌క్క వ‌ర్మ ఛాలెంజ్ అన్ని సినిమాపై అంచ‌నాల‌ను పెంచ‌డంలో స‌క్సెస్ అయ్యాయి. మ‌రి ఆఫీస‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కూ మెప్పించాడో తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం..

కథ: నారాయణ్‌ పసారి(ఫెరోజ్‌ అబ్బాసీ) ముంబైలో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌. వరుస ఎన్‌కౌంటర్‌లతో ముంబైలో మాఫియా అనేది లేకుండా చేస్తుంటాడు. దీంతో ప్రజల్లో అతనికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడుతుంది. అయితే అదే సమయంలో నారాయణ ఓ ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో చిక్కుకుంటాడు. ఈ కేసును దర్యాప్తు చేపట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన అధికారి శివాజీ రావు(నాగార్జున అక్కినేని) నేతృత్వంలో ఓ కమిటీని అధికారులు నియమిస్తారు. విచారణలో పసారికి అండర్‌ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నట్లు తేలుతుంది. దీంతో పసారిని అరెస్ట్‌ చేసి కోర్టు బోనులో నిలబెడతాడు శివాజీ. అయితే తన నెట్‌వర్క్‌ను ఉపయోగించి పసారి నిర్దోషిగా బయటపడతాడు. కేసు ఓడిపోవటం ఇష్టం లేని శివాజీ ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని అక్కడే ఉండిపోతాడు. తనని అరెస్ట్‌ చేయించాడన్న పగతో పసారి.. శివాజీపై పగబడతాడు. అక్కడి నుంచి వీరిద్దరి మధ్య వార్‌ మొదలౌతుంది. తర్వాత జరిగే పరిణామాలు, మధ్యలో ఓ ట్విస్ట్‌, చివరకు యుద్ధంలో గెలుపు ఎవరిది? అన్నదే కథ.

ఎలా ఉందంటే: మాఫియా, అండర్‌వరల్డ్‌, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన కథను బాగా డీల్‌ చేయగలగడం రాంగోపాల్‌వర్మకు ఉన్న ప్రధాన బలం. ఈ మూడు అంశాలు ఇందులో ఉండేలా చూసుకున్నాడు వర్మ. రొటీన్‌ సినిమాలకు భిన్నంగా ఈ కథను మొదలు పెట్టాడు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఇన్వెస్టిగేషన్‌ ఎలా సాగుతుంది? డిపార్ట్‌మెంట్‌ లోపల తతంగం ఏంటి? అన్న విషయాలను బాగా పరిశీలించిన వర్మ.. దానికి సంబంధించిన సన్నివేశాలను చాలా లోతుగా తెరకెక్కించగలిగాడు. కథ ప్రారంభం, గమనం, చాలా ఆసక్తిగా సాగుతాయి. సామాన్య ప్రేక్షకుడికి, రొటీన్‌ సినిమాలు చూసేవాళ్లకు ఈ తరహా కథ, కథనాలు సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి. తొలి సగంలో శివాజీరావు చేసే ఇన్వెస్టిగేషన్‌ చాలా పకడ్బందీగా సాగడంతో వర్మ మళ్లీ ట్రాక్‌ ఎక్కాడనిపిస్తుంది. సాంకేతికంగా తన పట్టు చూపించడంలో వర్మ సఫలమయ్యాడు. అయితే, ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవదు. ద్వితీయార్ధం మొదలవగానే మళ్లీ ఇప్పటి వర్మ బయటకొస్తాడు. హీరో-విలన్ల మధ్య రొటీన్‌ రివెంజ్‌ డ్రామా నడిపి ఈ కథను ఓ సగటు కథగా మార్చేశాడు. ద్వితీయార్ధంలో ఛేజింగ్‌లు, ఫైట్లకే పరిమితమైన వర్మ.. సినిమా ప్రారంభంలో ప్రేక్షకుడిలో కలిగించిన ఆసక్తిని క్రమంగా తగ్గించుకొంటూ వెళ్లిపోయాడు. నిజానికి ద్వితీయార్ధం సరిగా డీల్‌ చేసి ఉంటే, ‘శివ’స్థాయి సినిమా కాకపోయినా, ఈ మధ్య వర్మ తెరకెక్కించిన సినిమాల్లో అత్యుత్తమ చిత్రంగా నిలిచేదేమో. పతాక సన్నివేశాలు చూస్తే, వర్మ కూడా ఒక సగటు దర్శకుడిగా ఆలోచిస్తున్నాడా? అనిపిస్తుంది.

నటీనటులు: సీరియస్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో నాగార్జున మెప్పించాడు. థ్రిల్లర్‌ సినిమాకు కావాల్సిన ఇంటెన్సిటీని తన నటనలో చూపించాడు. ఈ వయసులో కూడా ఫిట్‌గా కనిపించారు. శివాజీ పాత్రకు తన వంతు న్యాయం చేశారు. ఇక హీరోయిన్‌ సైరా మరీన్‌ది చిన్న పాత్రే. ఫర్వాలేదనిపించింది. ఇక నెగటివ్‌ రోల్‌తో ఫెరోజ్‌ అబ్బాసీ మెప్పించాడు. అవినీతి అధికారిగా పసారీ పాత్రలో ఆకట్టుకున్నాడు. బేబీ కావ్య నటన బావుంది. అజయ్‌ తప్ప మిగతా పాత్రలన్నీ తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియనివే.

Show Full Article
Print Article
Next Story
More Stories