నేడు పోలవరానికి గడ్కరీ.. పర్యటనపై ఉత్కంఠ!

Submitted by arun on Wed, 07/11/2018 - 12:23
nitin gadkari

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ  పోలవరం పర్యటన ఆసక్తిగా మారింది. ఎన్‌డీఏ నుంచి టీడీపీ వైదొలగిన తరువాత  తొలి సారి ఏపీలో పర్యటిస్తున్న గడ్కరి ఏయే అంశాలను ప్రస్తావిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రాజెక్టుపై మంత్రి సందేహాలు లేవనెత్తితే అక్కడికక్కడే నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.  

పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలతో మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న వేళ  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం పర్యటన  ప్రాధాన్యతను సంతరించుకుంది. జల వనరుల శాఖ అధికారులతో క్షేత్రస్ధాయి పనులను పరిశీలించనున్న  మంత్రి పలు అంశాలను ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు నిధులు మంజూరు చేశామంటూ ప్రచారం చేస్తూ ఉండటంతో ఈఅంశం మరో సారి తెరపైకి రానుంది. ఇదే సమయంలో గడ్కరీతో పాటు పోలవరం వెళ్లాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు పనుల పురోగతిలో ఎటువంటి దాపరికం లేకుండా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలంటూ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 

దీంతో పాటు పనుల పురోగతి, నిధుల కేటాయింపు, కేంద్రం మంజూరు చేసిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధులపై పూర్తి నివేదికను రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు సిద్ధం చేశారు. రెండు రోజుల పాటు అధికారులతో సమావేశాలు నిర్వహించిన మంత్రి దేవినేని ఉమ నివేదికను స్వయంగా పరిశీలించారు.  

పోలవరం పర్యటన నేపధ్యంలో కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయిన గడ్కరీ  రాష్ట్ర ప్రభుత్వం అందించిన డీపీఆర్‌‌లు  కేంద్రం విడుదల చేసిన నిధుల వివరాలు కోరారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అందించిన నివేదికపై పూర్తి స్ధాయిలో చర్చించారు. దీంతో  పాటు అంచనాల పెంపుపై కూడా చర్చించిన గడ్కరీ సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీ నేతల నుంచి అందిన  నివేదికల ఆధారంగా  పలు అంశాలను ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని ప్రస్తావిస్తూనే  కాంట్రాక్టర్ మార్పు అంశం, వివిధ ప్యాకేజీల్లో నిధుల విడుదలపై  వివరణ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా ఉన్నా గడ్కరి ఏయే అంశాలను ప్రస్తావిస్తారు. అధికారులు, మంత్రులు, ఎలాంటి సమాధానామిస్తారనేది ఆసక్తిగా మారింది.  

English Title
nitin-gadkari-visit-polavaram-project

MORE FROM AUTHOR

RELATED ARTICLES