ఆ ఏనుగుతో మోడీ అలా డాన్స్ చేయించగలుగుతారా...

x
Highlights

పంద్రాగస్టు అనగానే ఎర్రకోట గుర్తుకొస్తుంది. ఎర్రకోట పై నుంచి ప్రధాని చేసే ప్రసంగం కళ్ళ ముందు కదలాడుతుంది. ఈ పంద్రాగస్టు సందర్భంగా కూడా అదే జరిగింది....

పంద్రాగస్టు అనగానే ఎర్రకోట గుర్తుకొస్తుంది. ఎర్రకోట పై నుంచి ప్రధాని చేసే ప్రసంగం కళ్ళ ముందు కదలాడుతుంది. ఈ పంద్రాగస్టు సందర్భంగా కూడా అదే జరిగింది. కాకపోతే...రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రసంగానికి ప్రాధాన్యం పెరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన సుదీర్ఘ ప్రసంగం పాత అంశాలను సృజించింది. కొత్త అంశాలను ప్రస్తావించింది. ప్రత్యక్షంగా పాలనాపరంగా, పరోక్షంగా పార్టీపరంగా చోటు చేసుకోబోయే మార్పులను వెల్లడించింది. మోడీ ప్రసంగం ప్రజలను ఆకట్టుకుందా ? ప్రభుత్వ విధానాల్లో ఎలాంటి మార్పులు రానున్నాయి ? బీజేపీ ధోరణిలో ఎలాంటి మార్పు చోటుచేసుకోనుంది.

ఎర్రకోటపై మోడీ ప్రసంగం సుమారు 80 నిమిషాల పాటు కొనసాగింది. ఇదీ ఒక రికార్డే. ఇది సుదీర్ఘ ప్రసంగంలో ప్రజలను ఆకట్టుకునే, వారిని మెప్పించే, అందరినీ ఒప్పించే అంశాలు ఎంత మేరకు ఉన్నాయన్నదే అసలు ప్రశ్న. మోడీ ప్రసంగం ఎన్నికల ప్రసంగం అనడంలో ఎవరికీ సందేహం లేదు. 2014లో ఎన్నికలకు ముందు ఉన్నప్పటి ఆవేశాన్ని, వాక్చాతుర్యాన్ని ఆయన ఈ ప్రసంగం సందర్భంగా తగ్గించుకున్నారు. దానికి బదులుగా ఆలోచనలు రేకెత్తించేలా ప్రసంగించారు. మరి ఆ ప్రసంగం ఓటర్లను ఆకట్టుకుంటుందా ? రాబోయే ఎన్నికల్లో ఓట్లను కురిపిస్తుందా? అనేది ఇక ఎన్నికల్లోనే తేలనుంది.

పిల్లలకు ఎప్పుడూ ఒక కొత్త కథ చెప్పాల్సిందే. ప్రజలకు మాత్రం అలా కాదు. చెప్పిన కథనే మళ్ళీ మళ్ళీ చెబుతుంటేనే అది వారి బుర్రలకు ఎక్కుతుంది. అప్పుడు మాత్రమే వారు ఆ నాయకుల ఘనతను గుర్తుంచుకోగలుగుతారు. జ్ఞాపకం చేసుకోగలుగుతారు. ఇదీ రాజకీయ నాయకుల విశ్వాసం. ప్రధానమంత్రి మోడీ కూడా అందుకు భిన్నం కాదు. ప్రధానమంత్రిగా కన్నా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న నేతగా మోడీ ప్రసంగం సాగింది. ప్రజలను ఆకట్టుకునేలానే కొనసాగింది. మోడీ తనను తాను గొప్ప నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకోగలిగారు. సామాజిక న్యాయం కోసం పోరాటం చేసే యోధుడిగా చిత్రీకరించుకోగలిగారు. ఆరు దశాబ్దాల పాటు ఇతర ప్రభుత్వాలు సాధించలేని వాటిని తన ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో సాధించిందన్న అభిప్రాయాన్ని కలిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంతో తన పాలన తీరును పోల్చిచూపారు. గ్రామీణ ప్రాంతాలలో మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుద్దీకరణ, గ్యాస్ సరఫరా లాంటి అంశాల్లో తమ ప్రభుత్వం ఎంత వేగంగా పని చేసిందో వివరించారు. ప్రసంగం పై జరిగిన వివిధ సర్వేల్లోనూ మోడీకి అత్యధిక స్థాయిలో ప్రజాదరణ లభించడం విశేషం. రెడ్ టేప్ టు రెడ్ కార్పెట్, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ లతో పాటుగా సంస్కరణ, ఆచరణ, పరివర్తన లాంటి నినాదాలు మోడీ ప్రసంగంలో చోటు చేసుకున్నాయి. అదే సమయంలో అంతా ఊహించినట్లుగా ప్రజాకర్షణ పథకాలను మాత్రం పెద్దగా ప్రకటించలేదు.

ఎర్రకోటపై ప్రధాన మంత్రి తన ప్రసంగంలో అందరికీ ఇల్లు, ఆరోగ్యం, టాయ్ లెట్, అధికారం, నైపుణ్యాలు అందించడం గురించి మాట్లాడారు. వాటికి తోడుగా డిజిటల్ అనుసంధానితను ప్రస్తావించారు. అంతరిక్ష యాత్రల గురించీ చెప్పారు. ఆరు కోట్ల మంది బోగస్ లబ్ధిదారులను తమ ప్రభుత్వం ఎలా ఏరిపారేసిందో, నల్లడబ్బుపై ఉక్కుపాదం ఎలా మోపిందో వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రజానీకం ఎలా లబ్ధి పొందిందో చాటిచెప్పారు. ఇక్కడ మోడీకి కలసి వచ్చిన అదృష్టం మరొకటి కూడా ఉంది. ఒకటి, రెండు దశబ్దాలుగా వివిధ ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు ఇప్పుడు తమ ఫలితాలను అందిస్తున్నాయి. దారిద్ర్య నిర్మూలన, పనికి ఆహారపథకం, గ్రామీణఉపాధి, గ్రామీణ విద్యుద్దీకరణ లాంటి వాటిని ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మోడీ ఫినిషింగ్ టచ్ తో ఆ ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఆ విమర్శలేవీ ప్రభావం కనబరిచే అవకాశం కూడా లేదు. కారణం... మోడీ చెప్పినట్లుగా దేశ జనాభాలో 65 శాతం 35 ఏళ్ళ లోపుగా ఉంది. దీంట్లో యువతకు కనిపించేది మోడీ ప్రభుత్వం ఇచ్చిన ఫినిషింగ్ టచ్ మాత్రమే. అలా అని బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయకుండా ఉండలేదు. ఆ ఫలితాలు దక్కాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ లోగా ప్రభుత్వ విధానాలలోనూ ఎంతో మార్పు రావాలి. చేపట్టే సంస్కరణలతో ఆచరణలో ఫలితాలు వస్తూ పరివర్తన చోటు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

అమెరికాలో ఒబామా కేర్ అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించినా ఆశించిన ఫలితాలను మాత్రం అందించలేకపోయింది. భారతదేశంలో తాజా మోడీ కేర్ అమల్లోకి రాబోతున్నది. బడ్జెట్ లో అరకొరగా ప్రస్తావించిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య అభియాన్ గా రీప్యాకేజ్ చేశారు. ఎర్రకోటపై ప్రసంగంలో మోడీ దీని గురించి ప్రస్తావించారు. ఇక ఈ పథకాన్ని అమలు లోకి తీసుకువచ్చే తేదీకి కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. మోడీ ఎంతగానో అభిమానించే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన సెప్టెంబర్ 25 నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ ఆరోగ్య అభియాన్ ఒక అసాధరణ పథకం అనడంలో సందేహం లేదు. దేశంలో పది కోట్ల కుటుంబాలకు....అంటే సుమారుగా 50 కోట్ల మందికి ఈ పధకం ప్రయోజనం కలిగించనుంది. దీని కింద ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల మేరకు ఆరోగ్య బీమా లభించనుంది. ఇంత భారీ పథకాన్ని ఎలా అమలు చేస్తారనే విషయంలోనే ఇప్పుడు కొన్ని సందేహాలు నెలకొంటున్నాయి. మరీ ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ ఎన్నికలు ఇప్పటికే సమీపించాయి. ఆ తరువాత లోక్ సభ ఎన్నికలు కూడా త్వరలోనే జరుగనున్నాయి. ఆశించిన రీతిలో ఈ పథకం అమలైతే, అది ఓట్లు కురిపిస్తుందనడంలో సందేహం లేదు.

ప్రధాని మోడీ ప్రసంగం తీరును విశ్లేషించాలంటే అందుకు ముందుగా పాతికేళ్ళ వెనక్కు వెళ్ళాలి. 1990లలో అద్వానీ రథయాత్ర చేపట్టే సమయంలో ఆరెస్సెస్ సిద్ధాంతకర్త గోవిందాచార్య ఒక మాట అన్నారు. మేము కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కాదు...కానీ, కాంగ్రెస్ తరువాత మేమే ...అని ఆనాడు ఆయన అన్నారు. అంటే అప్పట్లో అదీ బీజేపీ పరిస్థితి. పాతికేళ్ళలో ఎన్నో మార్పులు వచ్చాయి. పార్టీల పరిస్థితులు తలకిందులయ్యాయి. భావజాలంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వంతో పాటుగా పార్టీ విధానాల్లోనూ మార్పులు వస్తున్నాయి.

బీజేపీకి చుక్కాని ఆరెస్సెస్. హిందీ, హిందూ, హిందుస్థాన్ అనేది ఒకప్పుడు ఆరెస్సెస్ విధానంగా ఉండింది. అద్వానీ సారథ్యం కొనసాగినంత కాలం కూడా ఇదే పార్టీ విధానంగా ఉండింది. వాజ్ పేయి ప్రధాని అయిన నాటి నుంచి ఈ విధానం కొంత బలహీనపడింది. మోడీ సారథ్యంలో అది పూర్తిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందాల్సిన ఆవశ్యకత, అధికారం నిలబెట్టుకునే అవసరం కూడా అందుకు దారి తీసింది. సంస్కరణ, ఆచరణ, పరివర్తన అనేది మోడీ సరికొత్త నినాదంగా మారింది. ఇన్నాళ్ళుగా మాట్లాడిన ప్రాచీన విజ్ఞానానికి మోడీ ఇప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్జానాన్ని జోడిస్తున్నారు. గతమెంతో ఘనమంటూనే ఆశావహ భవిష్యత్తుకు బాట వేస్తున్నారు. మహిళాసాధికారికత గురించి, యువతకు అవకాశాల గురించి మాట్లాడుతున్నారు.

మోడీ తన ప్రసంగంలో ఈశాన్య భారతం గురించి, మహిళల గురించి కూడా విస్తృతంగా మాట్లాడారు. తమిళ జాతీయవాది సుబ్రహ్మణ్య భారతి, బాబా సాహెబ్ అంబేద్కర్ సూక్తులను ఉటంకించారు. ఇవన్నీ కూడా బీజేపీ అనుసరిస్తున్న విస్తృత సామాజిక చేకూర్పు ధోరణిని చాటి చెప్పేవే. మోడీ చెప్పిన సంస్కరణ, ఆచరణ, పరివర్తన అనేది పార్టీ విధానాలపై కూడా తన ప్రభావాన్ని కనబరుస్తోంది. పాత తరం ఆలోచనల్లో సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయి. వాటికి తగ్గట్లుగా ఆచరణ ఉంటోంది. అంతిమంగా ఇక రావాల్సింది పరివర్తన. ఈ నేపథ్యంలోన బీజేపీ ప్రొఫైల్ పిక్ మారిపోతున్నది. సంఘ్ పరివార్ ఎంతో గొప్పగా భావించే సావర్కర్, గోల్వాల్కర్ లాంటి వారిని బీజేపీ ఇప్పుడు కాస్తంత పక్కకు పెట్టేసింది. బీజేపీ పూర్వ అవతారం అయిన జన్ సంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కి కూడా పెద్దగా ప్రాచుర్యం కల్పించడం లేదు. వారికి బదులుగా హిందూత్వ భావనకు కాస్తంత దూరంగానే ఉండిన దీన్ దయాళ్ ఉపాధ్యాయనే ఇప్పుడు బీజేపీకి స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆరెస్సెస్ ప్రముఖ సిద్ధాంతకర్తల్లో ఒకరు. బీజేపీ మాతృక అయిన జన్ సంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. అంత్యోదయ అంటే అట్టడుగు స్థాయి వ్యక్తి కూడా ఉన్నత స్థాయికి చేరుకునేలా చేయడం. గాంధీతో పాటుగా గా దీన్ దయాళ్ ఉపాధ్యాయ కూడా ఈ సిద్ధాంతాన్ని ప్రబోధించారు. గాంధీని కాంగ్రెస్ సొంతం చేసుకుంటే, దీన్ దయాళ్ ఉపాధ్యాయను తనకు ఆదర్శంగా మోడీ ఎంచుకున్నారు.

మొత్తం మీద మోడీ ఎర్రకోటపై నుంచి మరో సారి తన సమ్మోహనాస్ర్తాన్ని ప్రయోగించారు. తన ప్రసంగంలో అత్యున్నత స్థాయి ఆకాంక్షలను వ్యక్తం చేశారు. అదే సమయంలో పేదవారి అవసరాల గురించి కూడా ప్రస్తావించారు. రెండింటి మధ్య సమతుల్యం సాధించేందుకు ప్రయత్నించారు. ముద్ర పథకం కింద 13 కోట్ల మంది స్వయంఉపాధి కోసం లబ్ధి పొందినట్లుగా మోడీ చెప్పారు. దీనితో పాటుగా ఆరోగ్య బీమా పథకంపై కూడా మోడీ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీటితో ఎన్నికల గండం నుంచి బయటపడాలని భావిస్తున్నారు.ప్రభుత్వ విధానాలు నిర్వీర్యమైపోయాయనే విమర్శను కాంగ్రెస్ ప్రభుత్వ హయాం మూటగట్టుకుంది. ఎన్ డీఏ హయాంలో ప్రభుత్వ విధానాలే శాపంగా మారాయనే ఆరోపణలు వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు, బ్యాంకుల మొండి బకాయిలు, నష్టాలు, జీఎస్టీ అమలు లాంటివాటిని విపక్షాలు ప్రస్తావిస్తున్నాయి. ప్రధాని మోడీ తన ప్రసంగంలో భారతీయ ఆర్థిక వ్యవస్థను ఏనుగుగా అభివర్ణించారు. అది ఇప్పుడు నిద్ర లేచిందన్నారు. ఇక పరుగులు తీయడమే తరువాయి అన్నారు. మరి ఆ ఏనుగును అలా పరుగులు తీయించే శక్తి మోడీకి ఉన్నదా అనేదే ఇప్పుడు కీలకంగా మారుతోంది. మోడీ పాటకు అనుగుణంగా ఆ ఏనుగు డ్యాన్స్ చేయగలిగితే ఇక మోడీకి తిరుగులేదు. ఆ ఏనుగుతో మోడీ అలా డాన్స్ చేయించగలుగుతారా...లెటజ్ వెయిట్ అండ్ సీ...

Show Full Article
Print Article
Next Story
More Stories