నేల టిక్కెట్టు మూవీ రివ్యూ

నేల టిక్కెట్టు మూవీ రివ్యూ
x
Highlights

సినిమా పేరు: నేల టిక్కెట్టు నటీనటులు: రవితేజ, మాళవిక శర్మ, జగపతిబాబు, అలీ, పృథ్వీ, పోసాని కృష్ణమురళి తదితరులు సంగీతం: శక్తినాథ్‌ కార్తిక్‌...

సినిమా పేరు: నేల టిక్కెట్టు
నటీనటులు: రవితేజ, మాళవిక శర్మ, జగపతిబాబు, అలీ, పృథ్వీ, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: శక్తినాథ్‌ కార్తిక్‌
సినిమాటోగ్రాఫర్: ముఖేశ్‌
కూర్పు: చింత కె ప్రసాద్‌
నిర్మాత: రామ్‌ తళ్లూరి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కల్యాణ్‌ కృష్ణ
బ్యానర్‌: ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల: 25-05-2018

‘నేల టిక్కెట్టు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు మాస్ రాజా రవితేజ. టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి.. రెండు వరుస హిట్స్ (సోగ్గాడే చిన్ని నాయనా, రారాండోయ్ వేడుక చూద్దాం) అందుకున్న కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీతో మాళవిక శర్మ అనే కొత్త హీరోయిన్ టాలీవుడ్‌కి పరిచయం అవుతోంది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో రామ్‌ తళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ శుక్రవారం (మే 25) థియేటర్స్‌లో విడుదలైంది.

క‌థ‌: నేల‌టిక్కెట్టుగాడు(ర‌వితేజ‌) ఓ అనాథ‌. హైద‌రాబాద్‌లో త‌న స్నేహితుల‌తో క‌లిసి ఉంటాడు. అనాథ కావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రినీ ఏదో ఒక బంధంతో పిలుచుకుంటూ ఉంటాడు. ఓ సంద‌ర్భంలో డాక్ట‌ర్ కోర్సు చ‌దువుతున్న మాళ‌విక‌(మాళ‌వికా శ‌ర్మ‌)ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. మ‌రోవైపు ఆనంద్ భూప‌తి(శ‌రత్‌బాబు) చాలా మంచి వ్య‌క్తి. అనాథ‌ల కోసం ఆనంద నిల‌యంను నిర్మించాలనుకుంటాడు. అది అత‌ని జీవితాశ‌యం. మ‌రో ఆశ త‌న కొడుకు అజ‌య్ భూప‌తి(జ‌గ‌ప‌తిబాబు)ని మంత్రిగా చూడాల‌నుకుంటాడు. ఆనంద్ భూప‌తి కొడుకు కావ‌డంతో అజ‌య్ ఎల‌క్ష‌న్స్‌లో గెలిచి.. మంత్రి అవుతాడు. ఓరోజు అజ‌య్ భూప‌తి కారుపై టెర్ర‌రిస్ట్ ఏటాక్ జ‌రుగుతుంది. ఆ ఏటాక్‌లో అజ‌య్ భూప‌తి త‌ప్పించుకుంటాడు. కానీ ఆనంద భూప‌తి చ‌నిపోతాడు. ఆనంద భూప‌తి టెర్ర‌రిస్ట్ ఏటాక్ వ‌ల్ల చ‌నిపోలేద‌ని.. ప్లానింగ్ ప్ర‌కారం జ‌రిగిన మ‌ర్డ‌ర్ అని తెలుస్తుంది. అదే స‌మ‌యంలో నేల‌టిక్కెట్టుకి, హోమ్ మినిష్ట‌ర్‌కి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతాయి. అస‌లు ఈ గొడ‌వ‌లకు కార‌ణం ఏంటి? ఇద్ద‌రి మ‌ధ్య సంబంధం ఏంటి? ఆనంద భూప‌తి హ‌త్య వెనుక కార‌ణ‌మేంటి? మ‌నుషులు ముఖ్య‌మ‌నుకునే నేల‌టిక్కెట్ చివ‌ర‌కు ఎలా గెలుపు సాధించాడు..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు కల్యాణ్‌ కృష్ణ. ఈ రెండు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. అతని నుంచి వచ్చిన మూడో సినిమా ఇదే. కానీ, గత రెండు చిత్రాల నైపుణ్యం వాటిల్లో చూపించిన ప్రతిభ ‘నేల టిక్కెట్టు’లో కనిపించకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కథలో కొత్తదనం లోపించింది. మంచికీ చెడుకీ మధ్య యుద్ధం ఎన్నో ఏళ్లుగా చూస్తున్నదే. ప్రతి సినిమాలోనూ అదే పాయింట్‌ ఉంటుంది. అదే కథను ఎంత కొత్తగా చూపించాం అన్నదే కీలకం. కానీ, కల్యాణ్‌ అటు వైపుగా ఆలోచించలేదు. చుట్టూ జనం, మధ్యలో మనం అనే కాన్సెప్ట్‌ జనరంజకంగా తీయొచ్చు. పైగా రవితేజ లాంటి కథానాయకుడు దొరకడం కల్యాణ్‌కు కలిసొచ్చిన విషయం. అయితే కాన్సెప్ట్‌ని, రవితేజలోని బలాలను దర్శకుడు సరిగ్గా వాడుకోలేదని అనిపిస్తుంది. కథ ప్రారంభం నుంచి సన్నివేశాలు నడుస్తాయి. కానీ వాటికి, అసలు కథకు సంబంధం ఉందా లేదా? అన్నది మాత్రం ప్రేక్షకుడికి అంతుచిక్కదు. ద్వితీయార్ధం కూడా ఇలాగే ఉంది. లెక్కకు మించి సన్నివేశాలు, ఫ్రేమ్‌ పట్టనంత నటీనటులు ఉన్నా ఒక్క సందర్భంలోనూ ప్రేక్షకుడు కథలో లీనమవ్వలేడు. రవితేజ ఎనర్జీ, అతను అందించే వినోదం అక్కడక్కడా అప్పుడప్పుడూ ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. కానీ, అదే టెంపోను చివరి వరకూ కొనసాగించలేకపోయాడు దర్శకుడు. ద్వితీయార్ధంలో మరింత గందరగోళం కనిపించింది. కథను ఎలా ముగించాలో తెలియక సన్నివేశాలను పొడిగించుకుంటూ వెళ్లాడు. పతాక సన్నివేశాల్లో ప్రతి నాయకుడు కూడా మారిపోవడం మరింత మెలో డ్రామాగా అనిపిస్తుంది. పాటలు, సందర్భానుసారంగా లేకపోవడంతో పాటు వాటిలో మెరుపు తగ్గడంతో అవి కూడా స్పీడు బ్రేకర్లలాగే పనిచేస్తాయి.

ఎవరెలా చేశారంటే: రవితేజ ఎప్పటిలాగే హుషారుగా కన్పించడానికి ప్రయత్నించారు. తానొక్కడే సినిమాను నెట్టుకురావడానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ, కథలో పాత్రలో బలం లేకపోవడంతో తాను కూడా ఏమీ చేయలేకపోయాడు. మాళవిక శర్మకు ఇదే తొలి చిత్రం. చూడ్డానికి బాగానే ఉన్నా రవితేజతో పాటు ఆమె కెమెస్ట్రీ అంతగా పండలేదనే చెప్పాలి. జగపతిబాబు మరోసారి ప్రతినాయకుడి పాత్రలో కన్పించారు. ఆయన పాత్రని డీల్‌ చేసిన విధానం సరిగ్గా లేదు. సీనియర్‌ నటులు చాలా మంది ఉన్నా, వాళ్లను దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేదు. బ్రహ్మానందం పాత్రకు ఒక్క డైలాగు లేకపోవడం ఇందుకు అద్దం పట్టింది. ‘ఫిదా’కు సంగీతం అందించి ఈ దర్శకుడేనా అనిపించింది. పాటలేవీ చెవికి ఇంపుగా అనిపించలేదు. దరువు ఎక్కువగా అనిపించింది. సాహిత్యం కనిపించలేదు. బడ్జెట్‌ పరిమితుల వల్లో ఏమో కానీ, సినిమాను చుట్టేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. కల్యాణ్‌ బలమైన కథను రాసుకోవాల్సింది. దాన్ని తీర్చదిద్దడంలో నైపుణ్యం కొరవడింది. దర్శకుడిగానే కాదు రచయితగానూ ఇంకా కసరత్తులు చేస్తే బాగుండేది.

ప్ల‌స్ పాయింట్స్‌:
- ర‌వితేజ న‌ట‌న‌
- సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్‌:
- క‌థ‌లో కొత్త‌దనం లేక‌పోవ‌డం.. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌
- కథాంశం కొన్ని సార్లు పాత‌దే అయినా.. క‌థ‌నం గ్రిప్పింగ్‌గా లేక‌పోవ‌డం
- సంగీతం, నేప‌థ్య సంగీతం

Show Full Article
Print Article
Next Story
More Stories