పెళ్లిని ఆపిన సెల్ఫీ...తాళికట్టే సమయానికి...

Submitted by arun on Mon, 07/02/2018 - 13:14
marriage

సరిగ్గా తాళికట్టే సమయానికి ‘ఆపండి..’ అంటూ ఎవరో గట్టిగా అరవడం వధువు ప్రియుడిననో వరుడి ప్రేమికురాలిననో చెప్పి పెళ్లిని ఆపేయడం తెలిసిందే. టెక్నాలజీ యుగంలో ఇప్పుడు యువత వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్ల ద్వారా ఆ పని కానిస్తోంది. తాళికట్టే సమయానికి వరుడి వాట్సాప్‌కు వచ్చిన ఓ సెల్ఫీ పెళ్లికి బ్రేకులు వేసింది.

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన యువతి హైదరాబాద్‌లోని ఓ సూపర్‌మార్కెట్‌లో మూడేళ్లుగా పనిచేస్తోంది. ఆమెతోపాటు క్యాషియర్‌గా పనిచేస్తున్న మల్లబోయిన ప్రశాంత్‌ అనే యువకుడు ఓ సందర్భంలో ఆమెతో కలిసి సెల్ఫీ దిగాడు. అయితే, ఆ యువతికి మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని కనుకదుర్గ కాలనీకి చెందిన ఆడెపు అనిల్‌ కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. ఆదివారం వివాహం జరిపేందుకు కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌‎లోని బీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో పెళ్లికి పెద్దలు ఏర్పాట్లు చేశారు. 

కాసేపట్లో తాళి కట్టాల్సి ఉండగా వరుడు అనిల్‌ కుమార్‌  వాట్సాప్‌కు ప్రశాంత్‌ ఫొటోలు పంపాడు. ఆ ఫొటోల్లో వధువుతో ప్రశాంత్‌ దిగిన సెల్ఫీలున్నాయి. వరుడికి ఫోన్‌ చేసి వధువు, తాను ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్నట్లు చెప్పాడు ప్రశాంత్‌. దీంతో వరుడు పెళ్లికి నిరాకరించాడు. తనను మోసం చేశారంటూ వధువు, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అటు వధువు కుటుంబ సభ్యులు కూడా ప్రశాంత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎప్పుడో తీసుకున్న సెల్ఫీని చూపి పెళ్లి ఆగిపోయేందుకు కారణమైన ప్రశాంత్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

English Title
marriage break down because of selfie

MORE FROM AUTHOR

RELATED ARTICLES