సంచనలం సృస్టించిన నన్‌ రేప్‌ కేసు కీలక మలుపు....

Submitted by arun on Sat, 09/22/2018 - 12:44
Bishop Franco Mulakkal

కేరళలో అత్యంత సంచనలం సృస్టించిన నన్‌ రేప్‌ కేసు కీలక మలుపు తీసుకుంది. అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ అరెస్ట్‌ అయ్యారు. 3 రోజుల పాటు విచారించిన తర్వాత ఫ్రాంకోను అరెస్ట్‌ చేస్తున్నట్లు సిట్‌ అధికారికంగా ప్రకటించింది. అంతకుముందే పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేశారు. 

కేరళలో క్రైస్తవ సన్యాసినిపై రేప్‌ కేసులో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ మరో అడుగు ముందుకేసింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్‌ చర్చ్‌ బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ను సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. మూడు రోజుల క్రితం తమ అదుపులోకి తీసుకున్న సిట్‌ సుదీర్ఘ విచారణ తర్వాత శుక్రవారం రాత్రి అరెస్ట్‌ చేస్తన్నట్లు అధికారికంగా ప్రకటించింది. 

గత కొంతకాలంగా కేరళలో నన్ రేపు కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫ్రాంకో ములక్కల్‌ కేరళలో నిర్వహిస్తున్న జలంధర్‌ చర్చ్ స్కూళ్ల పర్యవేక్షణకు వచ్చిన సందర్భంగా నన్‌పై ఆయన పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. 2014 నుంచి 2016 వరకు తనపై 13 సార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత సన్యాసిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చర్చిల్లో జరుగుతున్న అఘాయిత్యాలపై పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. బిషప్‌కు మద్దతుగా పలువురు అండగా నిలవగా నన్‌కు మరికొందరు మద్దతునిచ్చారు. అప్పటి నుంచి న్యాయపోరాటం చేస్తున్న బాధితురాలు దీనిపై వాటికన్‌లోని పోప్‌కు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో ములక్కల్‌ స్థానంలో ఏగ్నెలో రుఫినో గ్రేసియస్‌కు బాధ్యతలు అప్పగిస్తూ వాటికన్‌ నుంచి అధికారిక సమాచారం అందినట్లు చర్చి వర్గాలు వెల్లడించాయి. 

ఇటు దీని తీవ్రత దృష్ట్యా.. కేసును స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌కు అప్పగించారు. దీంతో ఫ్రాంకో ములక్కల్‌ను మూడు రోజుల కిందట అదపులోకి తీసుకున్న సిట్‌ సుదీర్ఘ విచారణ తర్వాత శుక్రవారం రాత్రి ఆయన్ని అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించింది. ఇటు ఓ నన్‌పై లైంగిక దాడికి పాల్పడి అరెస్ట్‌ అయిన తొలి భారతీయ కాథలిక్‌ బిషప్‌గా ములక్కల్‌ పేరు తెచ్చుకున్నట్లైంది. మరోవైపు బిషప్‌ను అరెస్ట్‌ చేసే ముందు బాధితురాలి నుంచి తాజా స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. 

English Title
Kerala nun rape case: Bishop Franco Mulakkal arrested

MORE FROM AUTHOR

RELATED ARTICLES