వరద మిగిల్చిన విషాదం...

Submitted by arun on Tue, 08/21/2018 - 12:23
Kerala floods

వరదల బీభత్సంతో కకావికలమైన కేరళ రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి కనీసం దశాబ్ద కాలం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వరదల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. భవనాలు, నిర్మాణాలన్నీ ధ్వంసమయ్యాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో భవనాలు, నిర్మాణాలను తిరిగి పునరుద్ధరించాలంటే కనీసం పదేళ్లు పడుతుందని భావిస్తున్నారు. గత వందేళ్లలో కాలంలో ఎన్నడూ లేనంతగా కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో రాష్ట్రానికి దాదాపుగా రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇడుక్కి, మలప్పురం, కొట్టాయం, ఎర్నాకులం జిల్లాల్లో వరదల ప్రభావం తీవ్రంగా పడింది.

రాష్ట్రంలో దాదాపు 10,000 కిలోమీటర్ల మేర రహదారులు నాశనమయ్యాయని అధికారులు వెల్లడించారు. వందల కొద్దీ వంతెనలు వరదలో కొట్టుకుపోయాయని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు లక్ష భవనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. లక్షల టన్నుల పంట పాడైపోయింది. లక్షల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. విధ్వంసానికి గురైన కేరళను పునరద్ధరించడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అత్యంత క్లిష్టమైన పని అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వెల్లడించారు. అయితే వరదల కారణంగా ఇప్పటికే దాదాపు పది లక్షల మంది ప్రజలు పునరావాస సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం వారికి కావాల్సిన అవసరాలు తీర్చడం తమ లక్ష్యమని, ప్రజల క్షేమమే తమ తొలి ప్రాధాన్యమని విజయన్‌ వెల్లడించారు.

గత రెండు రోజులుగా వరదలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సహాయక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆహారం, నీరు లేక ఇళ్లలో చిక్కుకుపోయిన వారిని కాపాడి సహాయక సామాగ్రి అందిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. డ్రోన్ల ద్వారా నీటిలో చిక్కుకున్న వారిని గుర్తించి కాపాడుతున్నారు. వరదలు తగ్గినప్పటికీ ఇప్పుడు వ్యాధుల వ్యాప్తి ప్రభుత్వానికి సవాలుగా మారింది. అంటువ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

పచ్చని చెట్లతో కళకళలాడే కేరళ.. సాగరంగా మారిన తీరును రైలు ప్రయాణం కళ్లకు కడుతోంది. ఎర్నాకుళం నుంచి తిరువనంతపురం మధ్య రైలులో వెళ్లాలంటే ప్రకృతి ప్రేమికులకు కన్నులపంటే. కనుచూపు మేరల్లోని పచ్చదనం, అక్కడక్కడా కనిపించే ఇళ్లు, మధ్యమధ్యలో నదీ ప్రవాహాలు.. ఇలా ఎన్నో అందాలకు ఈ మార్గం నిలయం. అయితే నేడు ఇక్కడ సగంలోతు నీళ్లలో మునిగిన ఇళ్లు, నీరుగారిన పంట పొలాలే దర్శనమిస్తున్నాయి. ఎటుచూసినా వరద నీరే కంటపడుతోంది. భయానక వరదల వల్ల ఇక్కడి రైలు సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వీటిని ఆదివారం పునరుద్ధరించారు. దీంతో తొలి రైలు ఎర్నాకుళం నుంచి దాదాపు ఖాళీగానే పరుగులు తీసింది. 70 కి.మీ. ప్రయాణం అనంతరం చెంగన్నూర్‌లో ఇది కిక్కిరిసిపోయింది. ఆశ్రయం కోల్పోయి కన్నీళ్లతో స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్తున్న వారే ఎక్కువగా దీనిలో ఎక్కారు. రైలు ముందుకు వెళ్తుంటే పంట పొలాలతో కళకళలాడే పండనాడ్‌, చెరియనాడ్‌ ప్రాంతాలు సాగరాన్ని తలపిస్తూ విధ్వంసం తీవ్రతకు నిదర్శనంగా నిలిచాయి. పండనాడ్‌ వరదల్లో చిక్కుకున్న 90 శాతం మంది శిబిరాల్లోనే ఆశ్రయం పొందుతున్నారు. పంబా వంతెనపై రైలు కదులుతుంటే.. భీకరంగా ఉప్పొంగుతున్న నది ఘోష చెవుల్లో మార్మోగుతోంది. పంబ, కక్కి ఆనకట్టల గేట్లు ఎత్తివేయడంతో ప్రమాదకర స్థాయిలో నది పరుగులు పెడుతోంది. మరోవైపు కోచి మెట్రో నుంచి ఆలువా రైలు ప్రయాణంలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. పెరియార్‌ నదికి ఆరు కి.మీ. పరిధిలోని కోచి మెట్రో ప్రాంగణం సహా పెద్దపెద్ద భవనాలు నీటిలో తేలుతున్న భ్రమను కలిగిస్తున్నాయి.

English Title
kerala after floods

MORE FROM AUTHOR

RELATED ARTICLES