యూజర్ల వ్యక్తిగత సమాచారం లీకవడంలో అసలు ఫేస్‌బుక్ పాత్రేంటి?

యూజర్ల వ్యక్తిగత సమాచారం లీకవడంలో అసలు ఫేస్‌బుక్ పాత్రేంటి?
x
Highlights

యూజర్ల వ్యక్తిగత సమాచారం లీకవడంలో అసలు ఫేస్‌బుక్ పాత్రేంటి? ఇందులో ఫేస్‌బుక్ స్వార్థం ఉందా? లేకుంటే మోసానికి గురైందా? అనే ప్రశ్నలు ఈ వివాదంలో...

యూజర్ల వ్యక్తిగత సమాచారం లీకవడంలో అసలు ఫేస్‌బుక్ పాత్రేంటి? ఇందులో ఫేస్‌బుక్ స్వార్థం ఉందా? లేకుంటే మోసానికి గురైందా? అనే ప్రశ్నలు ఈ వివాదంలో తలెత్తుతున్నాయి. అయితే విద్యాప్రయోజనాల నిమిత్తమే యూజర్ల వ్యక్తిగత సమాచారం ఇచ్చామనే ఫేస్‌బుక్ ప్రకటనతో దానిపై విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది.

ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారం ఎలా లీకైందో కేంబ్రిడ్జ్ అనలిటికా, ఫేస్‌బుక్‌ సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ చెప్పాలని, వినియోగదారుల సమాచార భద్రత కోసం సంస్థ ఎలాంటి ప్రణాళికలను యోచిస్తోందో చెప్పాలని అమెరికా, యూకే రాజకీయవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. అయితే విద్యా ప్రయోజనాల కోసమే యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని రీసెర్చర్లకు బహిర్గతం చేసినట్టు ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో పేర్కొంది. రీసెర్చర్ నమ్మబలికి యూజర్ల సమాచారాన్ని తీసుకెళ్లి కేంబ్రిడ్జ్ అనాలిటికా చేతుల్లో పెట్టారని ఆరోపించింది. ఇంతకీ జరిగిన అసలు కథేంటి?

డాక్టర్‌ అలెగ్జాండర్‌ కోగన్‌ కేంబ్రిడ్జ్‌లో సైకాలజీలో ప్రొఫెసర్‌ మనుషుల మనస్తత్వం ఎలా మారుతోంది, ముఖ్యంగా ఈ ఆధునిక యుగంలో వారి ప్రవర్తనలో వస్తున్న మార్పులేంటి అనే అంశంపై ‘దిసీజ్‌ యువర్‌ డిజిటల్‌ లైఫ్‌’ అనే యాప్‌ రూపొందించాడు. దాన్ని ఫేస్‌బుక్‌కు అనుసంధానం చేశారు. వ్యక్తిగత డేటాను పొందడానికి ఫేస్‌బుక్‌ రూల్స్‌ ఒప్పుకోవు. అయితే తన టార్గెట్‌ అంతా మనిషి సైకాలజీని డిజిటల్‌ కోణంలో నుంచి చూడడమేని ఆయన నమ్మబలికాడు. వేల మంది ప్రజలతో ఫేస్‌బుక్‌ మాధ్యమం ద్వారా ఇంటరాక్ట్‌ అవుతూ వారి డేటా సేకరించాడు.

ఇక క్రిస్టొఫర్‌ వైలీ ఈయన డేటా అనలిటిక్స్‌లో అఖండుడు. ఒకప్పుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ప్రచార సహాయకుడిగా తరువాత ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన స్టీవ్‌ బానన్‌కు సన్నిహితుడు. సామాజిక మాధ్యమాల్ని విరివిగా వాడుకొని, వాటి ద్వారా ఓటర్లకు చేరువ కావొచ్చని, పెద్ద పెద్ద నెట్‌వర్కింగ్‌ సైట్లకు డబ్బు ఎరవేసి డేటాను తీసుకోవచ్చని వైలీ ఓ ప్రతిపాదన చేశాడు. బానన్‌ దానిపై ఆసక్తి చూపడంతో.. కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే సంస్థను స్థాపించి- దాని ద్వారా ఆపరేషన్‌ కొనసాగించాలని భావించాడు. అయితే తప్పు చేస్తున్నానని పశ్చాత్తాపపడి ఆ పనిని పూర్తి చేయడానికి అంగీకరించలేదు. కానీ డేటా అనలిటిక్స్‌ సంస్థలోని మిగిలిన వారు మాత్రం అలెగ్జాండర్‌ కోగన్‌ను సంప్రదించి డేటాసేకరించి ట్రంప్‌ ప్రచార సమయంలో వాడుకున్నారు. విశేషమేమంటే ఈ డేటా లీక్‌ గురించి మొదట బయటపెట్టినది వైలీయే. గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనిచ్చిన సమాచారం ఆధారంగానే మొత్తం డొంకంతా కదిలింది.

అయితే అప్పట్లోనే అటు కోగన్‌, ఇటు వైలీల కార్యకలాపాలను ఫేస్‌బుక్‌ గమనించినా.. చర్య తీసుకోకుండా ఓ అడ్వయిజరీని పంపి- ‘చట్టవిరుద్ధంగా డేటా ను తీసుకోవడం నేరం’ అని చెప్పి ఊరుకుంది. స్కాం బయటపడ్డాక.. కోగన్‌ రూపొందించిన యాప్‌ను తొలగించింది.. వైలీ అకౌంట్లను స్తంభింపజేసింది. ఇది కుంభకోణం కాదు.. కేవలం డేటా బ్రీచ్‌.. ఉల్లంఘన మాత్రమే.. ఇందులో సంస్థకు ప్రత్యక్ష సంబంధం లేదు...అంటూ ఫేస్ బుక్ వాదిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories