నిరసనలు.. నీరాజనాలు.. హామీలు... అవమానాలు!!

Submitted by santosh on Thu, 10/11/2018 - 10:27
election candidates, trs, congress, bjp

హామీలు మరిచిన నేతలకు, జనాల నిరసన సెగలు ఇప్పటి వరకూ చూశాం. వాగ్దానాలకు ఆచరణరూపమిచ్చి కొందరు అరుదైన నాయకులకు, వీరాభిషేకాలు ఇప్పుడు చూడబోతున్నాం. ఊరికిచ్చిన మాటలు నెరవేర్చి, చేసిన బాసలను కళ్లముందు చూపించిన లీడర్లకు, జనం నీరాజనం పలుకుతున్నారు. చేసిన మేళ్లను మరచిపోలేమంటూ సన్మానాలు చేస్తున్నారు. గ్రామంలోకి అడుగుపెట్టగానే, అదిగో తమ మనసు గెలిచిన నాయకుడు వచ్చాడంటూ వీరతిలకాలు దిద్దుతున్నారు జనం. సిద్దిపేట నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా, హరీష్‌కు స్వాగతమే లభిస్తోంది. ఇబ్రహీంపూర్‌ గ్రామ ప్రజలు బతుకమ్మలతో ఆహ్వానించారు. మీకే ఓటేస్తామంటూ ప్రతిజ్ణ చేశారు. ఇంకా కొన్ని గ్రామాల్లో శాలువలు కప్పుతూ, జ్ణాపికలు బహూకరిస్తూ, గౌరవించుకుంటున్నారు. 

జనం ఇంతగా గుండెల్లో పెట్టి చూసుకుంటున్నందుకే, ఒకానొక సందర్భంలో ఎమోషనల్‌ అయ్యారు హరీష్ రావు. ఇంతకంటే తనకేం కావాలని, రాజకీయాల నుంచి సంతృప్తిగా దిగిపోవాలనిపిస్తోందని భావోద్వేగమయ్యారు. హరీష్‌ రావుకు, ఇంతటి ఘనసన్మానాలకు కారణం, ఇచ్చిన హమీలను నెరవేర్చడం. చేసిన వాగ్ధానాలకు ఆచరణరూపం ఇవ్వడం. మాట ఇచ్చి మడమ తిప్పకపోవడం. చేసిన అభివృద్ది కళ్లముందు కనిపిస్తోంది కాబట్టే, హరీష్‌ను గుండెల్లో పెట్టుకున్నామని సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రజలు అంటున్నారు. 

సిరిసిల్ల. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు. ఐటీ మినిస్టర్. కేటీఆర్‌ను సైతం ఘనంగా సన్మానించుకున్నారు జనం. రోడ్ల రూపురేఖలు మార్చారని, పంచాయతీ ఆఫీసులను, కార్పొరేట్‌ కార్యాలయంలా కట్టించారని, సిరిసిల్ల ప్రజలు మురిసిపోతున్నారు. ఆడిన మాట తప్పకుండా, ఊరికిచ్చిన హామీలను నెరవేర్చారని సన్మానిస్తున్నారు. ఇచ్చిన మాట చచ్చేదాకా మరవకూడదు. ఒక్కసారి హామీ ఇస్తే, దానికి కట్టుబడాలి. చేయలేకపోతే, ఎందుకు చేయలేకపోయారో, ఎందుకా నిస్సహాయ పరిస్థితి వచ్చిందో, గ్రామ ప్రజలకు వివరించాలి. క్షమాపణలు అడగాలి. కానీ నేటి రాజకీయ నాయకులకు అదే నిజాయితీ కరువైంది. గెలవడానికి నోటికొచ్చిన హామీలిస్తున్నారు. గడపగడపా తొక్కి, వంగి వంగి నమస్కారాలు చేసి, ఓటర్లే దేవుళ్లంటూ, వాగ్ధానాలు ఇస్తున్నారు. ఈసారైనా తమ ఊరిని బాగు చేస్తారని, నేతల మాటలు నమ్మే ప్రజలు, ఓట్లేసి గెలిపిస్తున్నారు. కానీ  గెలిచిన తర్వాత, సదరు ప్రజాప్రతినిధి ఆ ఊరి ముఖం చూసి ఎరుగరు. హామీల అమలు, గ్రామాభివృద్ది ఎక్కడుందంటే, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా. అలా వంచిన నాయకులను, నిలదీస్తున్నారు జనం. నెరవేర్చిన నేతలకు సన్మానిస్తున్నారు. ఎన్నాళ్లీ వంచన అంటూ నిలదీస్తున్నారు.

సో...ఇప్పటికైనా లీడర్స్ జర జాగ్రత్త. ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటే, అరదండాలు తప్పవు. నిరసన సెగలు తప్పవు. అవమానం తప్పదు. ఇచ్చిన హామీలను నాయకులు మరచిపోవచ్చేమో కానీ, జనం మర్చిపోయారన్న సంగతిని, సదరు నేతలు మర్చిపోకూడదు. మర్చిపోతే ఇలాంటి నిరసలు, బహిష్కరణలు తప్పవు. ఎన్నికల్లో విజయమంటే బాధ్యత. ప్రజాస్వామ్య గురుతర బాధ్యత. హామీల మాటలు మర్చిపోతే, తప్పదు భారీ మూల్యం.

English Title
election candidates, trs, congress, bjp

MORE FROM AUTHOR

RELATED ARTICLES