లామినేటెడ్ ఆధార్ కార్డు వాడకండి

Submitted by arun on Wed, 02/07/2018 - 15:55
plastic Aadhaar cards

ఆధార్ కార్డ్ గోప్యతపై సందేహపు మబ్బులు కమ్ముకున్న సమయంలో ప్లాస్టిక్ ఆధార్ కార్డులు లేదా లామినేషన్ చేసిన ఆధార్ కార్డులు తీసుకోవద్దని ఉడాయ్ హెచ్చరిస్తోంది. పీవీసీ కార్డులతో ఎలాంటి ఉపయోగం లేకపోగా అనధికారిక ప్రింటింగ్ కేంద్రాలలో వ్యక్తిగత వివరాలు చోరీకి గురయ్యే అవకాశముందని ఓ ప్రకటనలో తెలిపింది. 

ఆధార్‌కార్డును ‌కలర్‌ ప్రింట్ వేయించి లామినేషన్‌ చేసుకుంటున్నారా? అయితే వెంటనే ఆ ఆలోచనకి స్వస్తి చెప్పండి. అలాంటి పనులతో ఆధార్‌ దుర్వినియోగమయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సీఈఓ అజయ్‌ భూషణ్‌ పాండే. లామినేషన్‌, పీవీసీ కార్డు, స్మార్ట్‌ కార్డు ఆధార్‌ అనవసరం.. అంతే కాకుండా అనధికారిక ఏజెన్సీలు ఆధార్‌ డేటాను దుర్వినియోగం చేసే ప్రమాదముందని వివరించారు. అనధికార ముద్రణ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ చోరీకి గురయ్యే అవకాశం ఉందని.. మన సమ్మతి లేకుండా వ్యక్తిగత సమాచారం లీకవుతుందని పాండే తెలిపారు.

ఆధార్‌ స్మార్ట్‌కార్డు ప్రింటింగ్‌ పేరుచెప్పి అనేక అనామక ఏజెన్సీలు ప్రజలను దోచుకుంటున్నాయని.. ఇందుకు 50 నుంచి 300 వరకు వసూలు చేస్తున్నాయని ఉడాయ్ చీఫ్ తెలిపారు. లామినేషన్, స్మార్ట్ కార్డులు డబ్బు దండగ పనులని తేల్చి చెప్పారు. అలా చేయడం వల్ల క్యూఆర్‌ కోడ్‌ పనిచేయకపోవచ్చని ఆయన చెబుతున్నారు. వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసి, తెల్లకాగితంపై ప్రింట్‌ తీసిన ఆధార్‌ చెల్లుబాటు అవుతుందని చెప్పారు. ఎం-ఆధార్‌, జిరాక్స్‌ కాపీలు కూడా ప్రామాణికమేనన్నారు. ఆధార్ కార్డుల కోసం ఎక్కడా డబ్బు చెల్లించనక్కర్లేదని స్పష్టం చేశారు. ఆధార్ కార్డును అనధికారికంగా ప్రచురించడం చట్టప్రకారం నేరమని, జైలు శిక్షకు గురి కావల్సి వస్తుందని  హెచ్చరించారు.

English Title
Don't go for plastic Aadhaar cards, it may expose your personal data: Govt

MORE FROM AUTHOR

RELATED ARTICLES