10 రోజుల్లో రైతు రుణాలు మాఫీ: రాహుల్

Submitted by arun on Wed, 06/06/2018 - 18:50
Rahul Gandhi

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రైతుల మీద కాల్పులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తీరుతామని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్‌లో రైతులపై కాల్పులు జరిగి ఏడాది అయిన సందర్భంగా జరిగిన రైతు ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. 

కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని శివరాజ్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. 'మోడీ కావచ్చు, శివరాజ్ ప్రభుత్వం, లేదా బీజేపీ ప్రభుత్వం ఏదైనా కావచ్చు. బడా పారిశ్రామికవేత్తలకే వారు బాసటగా నిలుస్తారు. రైతులకు ఒక్క పైసా కూడా విదల్చరు' అని ఎద్దేవా చేశారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.70,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
 
రైతులపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాల్పులు జరిపి వారిని పొట్టనపెట్టుకుందని, దేశవ్యాప్తంగా రైతులు తమ హక్కుల కోసం నిలదీస్తూ నిస్సహాయ పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రైతు సభకు హాజరైన రైతు కుటుంబాలే అందుకు సాక్షమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి రాగానే రైతులు నేరుగా పొలాల నుంచే తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు దగ్గర్లోనే ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ తాను మధ్యప్రదేశ్ వచ్చేసరికి 'మేడ్ ఇన్ మాండసౌర్'‌ను చూడాలని అనుకుంటున్నానని, ఇందుకు కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా పూర్తి సహకారం అందిస్తారని చెప్పారు. తాను శుష్క వాగ్దానాలు చేసే రకం కాదని మోదీకి రాహుల్ చరకలు వేశారు. 'రెండు కోట్ల మంది యువకులకు ఉద్యోగాలిస్తామని మోదీ వాగ్దానం చేసారు. మీ బ్యాంక్ అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తామని గొప్పగా చెప్పారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మోదీ నుంచి కనీసం ఒక్క రూపాయైనా మీలో ఎవరికైనా అందిందా?' అని రాహుల్ ప్రశ్నించారు.

English Title
Congress will waive farm loan in 10 days, if voted to power in MP: Rahul Gandhi in Mandsaur

MORE FROM AUTHOR

RELATED ARTICLES