కోదండరామ్ కొత్త పార్టీ పైనా కేసీఆర్ సర్వే

x
Highlights

ఇంతకాలం ప్రభుత్వ పనితీరుపై సర్వేలు చేయించిన గులాబీ బాస్.. ఇప్పుడు కోదండరాం పార్టీ ప్రభావంపై సర్వే చేయిస్తున్నారు. కోదండ్ బలబలాలు, ఏయే వర్గాలు ఆయనకు...

ఇంతకాలం ప్రభుత్వ పనితీరుపై సర్వేలు చేయించిన గులాబీ బాస్.. ఇప్పుడు కోదండరాం పార్టీ ప్రభావంపై సర్వే చేయిస్తున్నారు. కోదండ్ బలబలాలు, ఏయే వర్గాలు ఆయనకు వెన్నుదన్నుగా ఉంటాయి? కాంగ్రెస్‌తో జట్టు కడితే టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుదన్న అంశాలపై కేసీఆర్ దృష్టి పెట్టారు. మూడు విభిన్న ఏజెన్సీలకు పని అప్పగించిన కేసీఆర్ సమాచారాన్ని పక్కాగా తెప్పించుకునేందుకు నిఘా వర్గాలను కూడా రంగంలోకి దింపారు.

సీఎం కేసీఆర్ సర్వేలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. సమగ్ర కుటుంబ సర్వే, సమగ్ర భూ సర్వే, సమగ్ర నేరస్తుల సర్వే ఇలా ప్రభుత్వం తరపున ఎన్నో సర్వేలు చేయించారు. ప్రభుత్వ పథకాల అమల్లో లోటుపాట్లు సవరించేందుకూ సర్వేల సమాచారాన్ని వినియోగించుకున్నారు. పార్టీ తరపున కూడా సర్వేలనే నమ్ముకున్నారు. ఇక ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే పలు సర్వేలు నిర్వహించి ఆ ఫలితాలను ఎమ్మెల్యేలకు అందజేశారు. పనితీరు మెరుగు పరచుకోవాలని హెచ్చరించారు. ఇక తుది సర్వే కూడా పూర్తయిందని పార్టీ సీనియర్లు రిలాక్సవుతున్న తరుణంలో మరోసారి సర్వేల బాట పట్టారు కేసీఆర్. టీ-జాక్ చైర్మన్ కోదండరాం రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసిన క్రమంలో దాని ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై సర్వేలు చేయిస్తున్నారు. గత నెలన్నర కాలంలో మూడు విభిన్న సంస్థలతో సర్వేలు చేయిస్తూ కోదండరాం ఎఫెక్ట్ పై సమాచారాన్ని సేకరిస్తున్నారు. కోదండరాం, కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ఎన్నికల బరిలో నిలిస్తే ప్రజలు ఎవరికి పట్టం కడతారన్న అంశంపైనా ప్రజా నాడి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ సర్వేల్లో వచ్చిన ఫలితాల్ని బట్టే అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు రచించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. అందుకే ఈ సర్వేల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ బాస్ ప్రతి నియోజకవర్గంలో ఒక శాతం ఓటర్ల నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. సగటున ప్రతి నియోజకవర్గంలో రెండున్నర లక్షల మంది ఓటర్లుంటారు. అందుకే కనీసం 2500 మందిని సర్వే సంస్థలు కలిసి కోదండరాం ప్రభావంపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. పార్టీ ఏర్పాటు తర్వాత ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న అంశం మీద ఆధారపడే టికెట్లు ఖరారు చేస్తారని సమాచారం. దీంతో తమకు టికెట్ వస్తుందో రాదోనని చాలా మంది ఎమ్మెల్యేలు టెన్షన్ ఆందోళన చెందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories