అసెంబ్లీ రద్దు ఆలోచనలకు ఎక్కడ బీజం పడింది...?

x
Highlights

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమయ్యాయి. అయితే తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న కేసీఆర్ ఆలోచనలకు ఎక్కడ బీజం పడింది....

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమయ్యాయి. అయితే తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న కేసీఆర్ ఆలోచనలకు ఎక్కడ బీజం పడింది. గులాబీ బాస్‌ను ముందస్తుకి నడిపించిన పరిస్థితులు ఏంటి..? అసలు అసెంబ్లీని రద్దు చేసినంత మాత్రాన ముందస్తు ఎన్నికలు జరుగుతాయా..? ముందస్తుకు వెళితే గెలుపు ఖాయమనే నిర్ణయానికి టీఆర్ఎస్ అధినేత ఎలా వచ్చారు ప్రస్తుతం.. ఇవే అంశాలపై విస్తృత చర్చ జరుగుతోంది.

తెలంగాణలో వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. లోక్‌సభ సాధారణ ఎన్నికలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా దాదాపు 9 నెలల ముందే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు కేసీఆర్ సాహసించడంపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సిద్ధపడటం వెనుక రాజకీయపరమైన అనేక అంశాలున్నాయని పరిశీలకు చెబుతున్నారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, చత్తీస్ గఢ్ రాష్ట్రాల అసెంబ్లీలకు డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ 4 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించిన సమయంలోనే కేసీఆర్ కూడా తన ముందస్తు ఆలోచనలకు పదును పెట్టినట్టు సమాచారం. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్ సభ ఎన్నికలపై కచ్చితంగా పండుందని కేసీఆర్ అంచనాకు వచ్చారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే ఆ ప్రభావం 2019 సార్వత్రిక ఎన్నికలపై కచ్చితంగా పడుతుందని లెక్కలు వేసుకున్నారు. లోక్ సభతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు జరిగితే మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపడి, ఆ ప్రభావం జాతీయస్థాయిలో ఉండే వాతావరణంలో ఎన్నికలకు వెళ్లడం కన్నా ముందస్తు పరీక్షకు నిలబడటం మంచిదన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేశారని చెబుతున్నారు.

పైగా గత మేలో జరిగిన కర్నాటక అసెంబ్లీకి ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి. అక్కడ కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అదే సమయంలో 2019 ఎన్నికల్లో బీజేపీకి గడ్డుకాలం తప్పదన్న సర్వేలు వెలువడ్డాయి. అంతేకాదు..ఇటీవల బీజేపీతో కేసీఆర్‌ సన్నిహితంగా మెలుగుతున్నారన్న విపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. బీజేపీ టీఆర్ఎస్ దోస్తానా ఆరోపణ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ఒక వర్గం ఓటర్లలో టీఆర్ఎస్‌ పట్ల వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరగాలని కేసీఆర్‌ భావించారని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక తెలంగాణలో కాంగ్రెస్ బ‌ల‌ం పుంజుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్‌, తెలుగుదేశం, తెలంగాణ జ‌న‌ స‌మితి, వామ‌ప‌క్షాలు కలిసి మహా కూటమిగా ఎన్నిక‌ల‌ బరిలోకి దిగితే ఫలితాలు ఎలా ఉంటాయ‌న్న‌ది రాజ‌కీయ‌ పండితుల‌కు కూడా అంతు చిక్క‌డం లేదు. అందుకే మహా కూట‌మి ఏర్పాటు చేసుకునే సమయం, అభ్యర్థుల ఎంపికపై తగిన కసరత్తు చేసుకునే అవకాశం ప్ర‌తిప‌క్షాల‌కు ఇవ్వ‌కుండా కేసీఆర్ ముదస్తు చాణ‌క్యం ప్ర‌ద‌ర్శించారని కొందరంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories