టీడీపీలో పొత్తుల కలకలం...అయ్యన్న, కేఈపై చంద్రబాబు ఆగ్రహం

Submitted by arun on Sat, 08/25/2018 - 07:46
babu

తెలుగుదేశం పార్టీలో పొత్తుల తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. మంత్రులు కేఈ, అయ్యన్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పొలిట్‌ బ్యూరోలో చర్చించకుండా పొత్తులపై ఎలా మాట్లాడతారంటూ సీరియస్‌ అయ్యారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సీనియర్‌ మంత్రులు స్పందించడం తగదన్న చంద్రబాబు అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ ఆదేశించారు. 

తెలుగుదేశం పార్టీలో పొత్తుల రగడ...కలకలం రేపుతోన్న మంత్రుల వ్యాఖ్యలు...తెలుగుదేశం పార్టీలో పొత్తుల వ్యవహారం పెద్ద తుఫాన్నే రేపింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందంటూ జరుగుతోన్న ప్రచారం పార్టీలో తీవ్ర కలకలం రేపింది. గతంతో పోల్చితే కాంగ్రెస్‌పై వ్యతిరేకత తగ్గిందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారంటూ వార్తలు రావడం, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేసే అవకాశముందంటూ ప్రచారం జరగడంతో సీనియర్‌ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు ఘాటుగా రియాక్టయ్యారు. ఒకవేళ కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపితే ప్రజలు బట్టలూడదీసి తరిమితరిమి కొడతారంటూ అయ్యన్న వ్యాఖ్యానించారు. ఇక కేఈ కూడా కాంగ్రెస్‌ దరిద్రాన్ని అంటగట్టుకోమంటూ తీవ్రంగానే స్పందించారు.

మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీలో చర్చ జరగకుండానే పొత్తులపై ఎందుకు మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పొత్తులపై టీడీపీ పోలిట్‌బ్యూరోలో నిర్ణయం తీసుకుంటారనే సంగతి సీనియర్ మంత్రులకు తెలియకపోతే ఎలా అంటూ మండిపడ్డారు. పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని చంద్రబాబు ఆదేశించారు. పొత్తుల వివాదాన్ని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు మంత్రులు కేఈ, అయ్యన్న నుంచి వివరణ కోరారు. పొత్తులపై ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకునే సంప్రదాయం టీడీపీకి ఉందని, అలాంటిది ఇప్పుడెందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాలంటూ ఆదేశించారు.

English Title
CM Chandrababu Serious on Ministers over Alliance in 2019 Elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES