హెక్టార్ కు రూ.25 వేలు నష్టపరిహారం అందిస్తాం

Submitted by arun on Thu, 08/23/2018 - 11:05

ఏపీలో 2006 తర్వాత ఇప్పుడు పెద్ద వరదలు వచ్చాయని, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు సీఎం చంద్రబాబు. ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఏరియల్ వ్యూ చేసి, జిల్లాల్లో జరిగిన నష్టంపై అంచనా వేశారు. రాజమండ్రి విమానాశ్రయంలో అధికారులతో ఆయన సమీక్షించారు. 

ఉభయగోదావరి జిల్లాల్లో  600 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు సీఎం చంద్రబాబు. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన పరిహారం చెల్లిస్తామని, హెక్టార్ కు  25 వేలు నష్టపరిహారంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

తూర్పు గోదావరి జిల్లాలోని 19 మండలాల్లో 45 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయని, బాధితుల కోసం 16 పునరావాస కేంద్రాలు నడుస్తున్నాయని సీఎం చెప్పారు. అలాగే, 6,600 హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్న సీఎం.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్రకాలువ వల్ల ఎక్కువ నష్టం వాటిల్లిందని, ఎర్ర కాలువ ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తామని అన్నారు. కాజ్ వేల పునర్నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తున్నామని, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనులు 57.5 శాతం పూర్తయ్యాయని, వచ్చే ఏడాది మే నాటికి మొత్తం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఈ ప్రాజెక్టు నిమిత్తం కేంద్రం నుంచి 2,600 కోట్లు రావాల్సి ఉందని, ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం తీసుకున్నా తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు చంద్రబాబు. 

రాష్ట్రంలో 57 ప్రాధాన్య ప్రాజెక్టులు చేపట్టామన్న సీఎం ఇప్పటివరకూ 16 ప్రాజెక్టులు పూర్తయినట్టు చెప్పారు. ఆర్ అండ్ బి రహదారులకు 35 కోట్లు కేటాయిస్తామని, రాయలసీమలో కరవు ఉందని, కోస్తాలో వరదలు వచ్చాయని, ఆరు జిల్లాల్లో కరవు నెలకొని ఉందని వివరించారు సీఎం చంద్రబాబు.

English Title
CM Chandrababu Naidu Aerial Survey in Flood Affected Areas

MORE FROM AUTHOR

RELATED ARTICLES