యూపీ సీఎంగా రాజ్‌నాధ్?

యూపీ సీఎంగా రాజ్‌నాధ్?
x
Highlights

ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో సీఎం పీఠం ఎక్కారు యోగి. కానీ అవన్నీ తాటాకుచప్పుళ్లేనని, ప్రభుత్వాసుపత్రుల్లో చిన్నపిల్లల మరణ మృదంగంతో తేలిపోయింది....

ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో సీఎం పీఠం ఎక్కారు యోగి. కానీ అవన్నీ తాటాకుచప్పుళ్లేనని, ప్రభుత్వాసుపత్రుల్లో చిన్నపిల్లల మరణ మృదంగంతో తేలిపోయింది. గోరఖ్‌పూర్‌ ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక కొందరు, మెదడువాపు వ్యాధితో మరికొందరు పిల్లలు, పిట్టల్లా రాలిపోయారు. 42 గంటల్లో 42 మంది కన్నుమూశారు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే 323 మంది పిల్లలు చనిపోయారు. ఆక్సిజన్‌ సిలిండర్ల బకాయిలు చెల్లించకపోవడంతో, చిన్నారులు ఊపిరందక చనిపోయారు. ఏదో చేస్తాడని భావించిన యోగి ఆదిత్యనాథ్‌‌, పాలన ఇంతేనా అని పిల్లలు పోగొట్టుకున్న తల్లులు రోదించారు. గోరఖ్‌పూర్‌ ఫలితంలో వారి వేదన, ఆవేశం ఓట్ల రూపంలో యోగిని నైతికంగా ఓడించింది. ఇప్పుడు కైరానా, నూర్పుర్‌లోనూ అదే ప్రతిధ్వనించింది.

రాబోయే కాలంలో, కాబోయే మోడీ అని అందరూ ఊహించారు. గుజరాత్‌ నుంచి మోడీ ఎగసిపడ్డట్టే, యూపీ నుంచీ అలాగే దూసుకొస్తాడని అంచనా వేశారు. కానీ సీన్‌ మొత్తం రివర్స్‌ అవుతోంది. తన ఏలుబడిలో ఒక్కో ఎంపీ స్థానాన్ని, ప్రతిపక్షాలకు అప్పగిస్తున్నాడు. బీజేపీకి ఆక్సిజన్‌ అందిస్తుందనుకున్న రాష్ట్రంలో, ఆశలు ఆవిరి చేస్తున్నాడు. ఇంతకీ యోగి ఆదిత్యనాథ్‌ సామ్రాజ్యంలో ఏం జరుగుతోంది...ఉప ఎన్నికల్లో వరుస ఓటములు సూచిస్తున్నదేంటి?

యూపీలో సిట్టింగ్ ఎంపీ సీటును కోల్పోయి ఘోర పరాభవాన్ని ఎదుర్కొంటున్న బీజెపీ.. పరిస్థితి తీవ్రతను అంచనా వేస్తోంది. ప్రధాని మోదీ విదేశాల్లో ఉంటూనే అమిత్ షాతో మంతనాలు జరిపారని.. కొన్ని కీలక నిర్ణయాలు కూడా ప్రస్తావనకొచ్చాయని చెబుతున్నారు. ముఖ్యంగా.. సీఎం యోగీ ఆదిత్యనాధ్ తీరు వల్లే పార్టీకి పరాజయాలు వస్తున్నాయని సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు లేవనెత్తడం.. అధిష్టానం బుర్రను వేడెక్కిస్తోంది. యూపీలో వీస్తున్న ఎదురుగాలి ఇదేవిధంగా కొనసాగితే.. భవిష్యత్తులో ఎదురీత తప్పదన్న అంచనాకు వచ్చిన అమిత్ షా.. 2019 లోపు యూపీ బీజేపీ ‘రంగు’ మార్చెయ్యాలన్న కమిట్మెంట్‌తో వున్నారు.

యోగిని తప్పించి సీఎం కుర్చీలో మరో గట్టి పిండాన్ని కూర్చోబెట్టాలని యోచిస్తోంది బీజేపీ. సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌ని పోగొట్టుకున్నపుడే యోగీ మీద అమిత్‌షా కన్ను పడింది. ఇప్పుడు కైరానా సెగ్మెంట్ కూడా ఊస్టింగ్ కావడంతో.. ఆయన్ను సాగనంపడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ నేతల్లో యూపీ మాజీ సీఎం, ప్రస్తుత కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాధ్‌తో పాటు మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వారం పదిరోజుల్లో ఈ విషయమై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందట! ఇటు యూపీలో వరస ఓటములకు కారణం.. సీఎం యోగి మొండిగా చేపట్టిన గ్రేటర్ నోయిడా సందర్శనే కారణమన్న వెర్షన్ వినిపిస్తోంది. గ్రేటర్ నోయిడాకు వెళ్లిన ఏ ముఖ్యమంత్రీ పదవిలో ఎక్కువకాలం నిలదొక్కుకోలేదట!

Show Full Article
Print Article
Next Story
More Stories