‘భాగమతి’ మూవీ రివ్యూ

Submitted by arun on Fri, 01/26/2018 - 12:37
Bhaagamathie

టైటిల్ : భాగమతి
జానర్ : థ్రిల్లర్‌
తారాగణం : అనుష్క, ఉన్ని ముకుందన్‌, జయరామ్‌, ఆశా శరత్‌, మురళీ శర్మ
సంగీతం : తమన్‌.ఎస్‌
దర్శకత్వం : జి. అశోక్‌
నిర్మాత : వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌

అనుష‌్క..టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్. విజయశాంతి తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో హీరోయిన్ ఓరియంటెంట్ మూవీస్ కళ తీసుకువచ్చింది అనుష్క. అరుంధతి, రుద్రమదేవితో స్టార్ హీరోలకు ధీటుగా సినిమా బాధ్యతను తనపై వేసుకుని మెప్పించింది. మరోసారి భాగమతితో సందడి షురూ చేసింది. టాలీవుడ్ లేడీ ఓరియంటెండ్ సినిమాలకు పెట్టింది పేరు అనుష్క. విజయశాంతి తర్వాత..మళ్లీ లేడి ఓరియంటెడ్ మూవీస్ కి క్రేజ్ తీసుకువచ్చింది అనుష‌్కనే. అరుంధతి సినిమాతో కథలో దమ్ముంటే హీరో తో సంబంధంలేదని నిరూపించింది. కథే సినిమాకు హీరో అని రుజువు చేసింది. ఇక రుద్రమదేవి సినిమాతో ఏకంగా 50కోట్ల భారీ బడ్జెట్ చిత్రాన్నే తన భుజాలపై వేసుకుంది. అరుంధతి, రుద్రమదేవి లాంటి సినిమాల తర్వాత మరోసారి భాగమతితో తన సందడి మొదలైంది. ఎప్పుడో 2012లో పునాదులు పడ్డ ఈ సినిమా కేవలం అనుష్క కోసమే దర్శక-నిర్మాతలు ఇంతకాలం వేచి చూశారు. ప్రచార చిత్రాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. మరి ‘భాగమతి’ అనుష్క లెక్కలు తేల్చిందా? అనుష్కపై దర్శక-నిర్మాతలు పెట్టుకున్న నమ్మకం నిజమైందా?

కథేంటంటే: ఐఏఎస్‌ అధికారి చంచల(అనుష్క) కేంద్ర మంత్రి ఈశ్వర్‌ ప్రసాద్‌(జయరాం) దగ్గర పర్సనల్‌ సెక్రటరీగా పనిచేస్తుంటుంది. మచ్చలేని నాయకుడిగా చలామణి అవుతూ రాజకీయంగా సొంత నిర్ణయాలు తీసుకుంటుండటంతో అతన్ని ఏదో ఒక కేసులో ఇరికించాలని అధిష్ఠానం పెద్దలు నిర్ణయిస్తారు. అప్పటికే ఒక హత్య కేసులో జైలులో ఉన్న చంచలను సీబీఐ తన కస్టడీలోకి తీసుకుని పురాతన భాగమతి బంగ్లాకు తరలించి, ఈశ్వర్‌ప్రసాద్‌ చేసిన వ్యవహారాలపై ఆరా తీస్తుంది. ఈ క్రమంలో ఈశ్వర్‌ ప్రసాద్‌ గురించి ఎలాంటి నిజాలు తెలిశాయి. హత్య కేసులో చంచల జైలుకు వెళ్లడానికి కారణం ఏంటి? ఆమె ఎవరిని? ఎలా హత్య చేసింది? ఆమెకూ, కాళంగి రాజ్య భాగమతి శతపత్ర రాణికీ సంబంధం ఏంటి?

ఎలా ఉందంటే?: లెక్క తేలాల్సిందే అంటూ ప్రచార చిత్రాల్లో భాగమతి అవతారంలో అనుష్క చేసిన సందడిని చూసి ఇది పూర్తిగా ఆ పాత్ర చుట్టూ సాగే సినిమా అనే అభిప్రాయం కలుగుతుంది. కానీ, ఇందులో భాగమతికంటే కూడా చంచల కథే ఎక్కువ. కాళంగి రాజ్యం కంటే కూడా వర్తమాన పరిస్థితులే ఎక్కువగా తెరపై కనిపిస్తాయి. ఒక రాజకీయ నాయకుడి నేర ప్రస్థానం చుట్టూ కథను రాసుకున్న దర్శకుడు దాన్ని భాగమతి బంగ్లా నేపథ్యాన్ని జోడించి, భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ కథలో నాలుగైదు చోట్ల హారర్‌ ఎలిమెంట్స్‌ బలంగా పండాయి. తమన్‌ నేపథ్య సంగీతంతో ప్రేక్షకుడిని భయపెట్టే ప్రయత్నం చేశారు. మిగిలినదంతా ఈశ్వర ప్రసాద్‌ ఎత్తులు, పైఎత్తులు అతని పన్నాగాన్ని చిత్తు చేసే చంచల కథే తెరపై కనిపిస్తుంది.

భాగమతి బంగ్లాలోకి వెళ్లాకే అసలు కథ వూపందుకుంటుంది. అక్కడ కూడా ఎక్కువ సన్నివేశాలను బంగ్లాను చూపించడానికే పరిమితం చేశారు. దాంతో సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. విరామం సమయానికి భాగమతి అవతారంలో అనుష్క తెరపై కనిపించి కథను ఆసక్తికరంగా మారుస్తుంది. ద్వితీయార్ధంలో వచ్చే మలుపులు చంచలను విలన్‌గా మార్చినంత పనిచేస్తాయి. దాంతో కథ ఎటువైపు మళ్లుతుందో అనే ఉత్కంఠ రేకెత్తుతుంది. కానీ, అక్కడ మరో మలుపు చోటు చేసుకోవడంతో పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

నటీనటులు : అరుంధతి, రుద్రమదేవిగా చరిత్ర సృష్టించిన అనుష్క భాగమతిగా మరోసారి అదే స్థాయి పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఐఏఎస్‌ ఆఫీసర్‌ చెంచలగా హుందాగా కనిపించిన స్వీటీ, భాగమతిగా రౌద్ర రసాన్ని కూడా అద్భుతంగా పలికించింది. భాగమతి గెటప్‌ లో అనుష్క మరోసారి అరుంధతి సినిమాని గుర‍్తు చేసింది. మినిస్టర్‌ ఈశ్వర్‌ ప‍్రసాద్‌గా.. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో జయరామ్‌ నటన ఆకట్టుకుంటుంది. హీరోగా నటించిన ఉన్ని ముకుందన్ ది చిన్న పాత్రే అయినా తనదైన హావ భావాలతో మెప్పించాడు . సీబీఐ జేడీ పాత్రలో ఆశా శరత్‌ నటన బాగానే ఉన్నా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉన్న నటి కాకపోవటంతో అంతగా కనెక్ట్ కాలేదు. ఇతర పాత్రల్లో మురళీ శర్మ, ధనరాజ్, విధ్యుల్లేఖ రామన్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులు పడతాయి. మది ఛాయాగ్రహణం, తమన్‌ సంగీతం కథను మరింత ప్రభావవంతంగా మార్చాయి. తమన్‌ నేపథ్య సంగీతం భయపెట్టిస్తుంది. రవీందర్‌ కళా నైపుణ్యం తెరపై అడుగడుగునా కనిపిస్తుంది. దర్శకుడు అశోక్‌ కథ రాసుకున్న విధానం, కథనాన్ని అల్లిన వైనం బాగుంది. హారర్‌ ఎలిమెంట్స్‌తో పాటు, పతాక సన్నివేశాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. యూవీ క్రియేషన్స్‌ నిర్మాణ విలువలు చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి.

ప్లస్ పాయింట్స్ :
నేపథ్య సంగీతం
అనుష్క నటన
 సాంకేతిక విభాగం 
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ తికమక పెట్టే కథనం
 

English Title
bhaagamathei movie review

MORE FROM AUTHOR

RELATED ARTICLES