పెళ్లయిన కొద్ది గంటలకే ప్రేమజంట ఆత్మహత్య!

Submitted by lakshman on Wed, 09/20/2017 - 17:42

అమరావతి: ప్రకాశం జిల్లాలో విషాద ఘటన జరిగింది. పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకే ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో కలకలం రేపింది. చీరాలలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బత్తుల సందీప్(22) బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో బోగిరెడ్డి మౌనిక(20) కూడా బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా దగ్గరయ్యారు. వీరి ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించాలనుకున్నారు. ఇద్దరూ తమ ప్రేమ గురించి ఇరు కుటుంబాలతో చెప్పారు. చాలామంది పెద్దల‌లాగానే సందీప్, మౌనిక కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో తమను ఎక్కడ వేరుచేస్తారోనన్న భయంతో ఇద్దరూ స్నేహితులకు ఈ విషయాన్ని తెలియజేశారు.

స్నేహితులు వారిద్దరినీ మంగళవారం విజయవాడ తీసుకెళ్లి పెళ్లి చేశారు. సాయంత్రానికి మళ్లీ ఆ కొత్త జంట చీరాలకు చేరుకుంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరూ తమ స్నేహితులకు తాము చనిపోతున్నామని సందేశాలు పంపించారు. మరుసటి రోజు ఇద్దరూ వేటపాలెం సమీపంలోని రైలు పట్టాలపై శవాలుగా కనిపించారు. పెళ్లి చేసుకున్నా.. తమను పెద్దలు ఎక్కడ విడదీస్తారోనన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరు స్నేహితులను విచారిస్తున్నారు. ప్రేమ జంటకు పెళ్లి చేసే ముందు స్నేహితులు తొందరపాటుతనంగా వ్యవహరించడం సరికాదని పోలీసులు సూచిస్తున్నారు. ఊహించని ఈ పరిణామంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. తమ నిర్ణయం పిల్లల ప్రాణాలు తీస్తుందని కలలో కూడా అనుకోలేదని కన్నీరుమున్నీరవుతున్నారు.

English Title
Andhra Pradesh Newlyweds Allegedly Commit Suicide Hours After Marriage

MORE FROM AUTHOR

RELATED ARTICLES