ఫ్యాన్‌గాలి ఎదురు తిరిగేదెవరు... సైకిల్‌ దిగేదెవరు?

ఫ్యాన్‌గాలి ఎదురు తిరిగేదెవరు... సైకిల్‌ దిగేదెవరు?
x
Highlights

అవకాశాల కోసం కొందరు, అసంతృప్తితో మరికొందరు, అదను చూసుకుని ఇంకొందరు, కండువాలు మార్చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో, మరెందరో నాయకులు పార్టీ మారేందుకు...

అవకాశాల కోసం కొందరు, అసంతృప్తితో మరికొందరు, అదను చూసుకుని ఇంకొందరు, కండువాలు మార్చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో, మరెందరో నాయకులు పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కొందరు నేతలు పార్టీని వీడుతున్నామని ప్రకటించినా, మరో పార్టీలోకి చేరలేక సందిగ్దంలో కొట్టుమిట్టాడుతున్నారు. కడప జిల్లాలో టిడిపి నుంచి రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, కడపకు చెందిన మాజీ మంత్రి ఖలీల్ భాషలు వైసిపిలొ చేరారు. కాంగ్రెస్ నుంచి వైసిపిలొకి మాజీ మంత్రి, సీనియర్ నేత రామచంద్రయ్య చేరారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా తన కుమారుడితో కలిసి టిడిపిలో చేరారు. కొద్ది రోజులుగా వైసిపి నుంచి టిడిపిలో ఎవ్వరూ చేరలేదు.

ఇక కర్నూలు జిల్లా సంగతి. కర్నూలు జిల్లా రాజకీయాలపై పట్టున్న కోట్ల కుటుంబం, అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది. మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి, ఈనెల 18న అధికారికంగా తెలుగుదేశంలోకి చేరుతున్నారు. పెద్ద ఎత్తున సభ నిర్వహంచి, సైకిలెక్కుతారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్‌కు టాటా చెప్పి, వైసిపిలో జాయిన్ అయ్యారు. అనంతపురం జిల్లాలో ఇటివల సిఐ గోరంట్ల మాధవ్ వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి మారారు. హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని వైసీపీలో కి చేరారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సిటి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బిజేపి నుంచి జనసేనలో చేరారు.

తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి, మరో కీలకమైన టీడీపీ వికెట్‌ పడేందుకు సిద్దమైందని తెలుస్తోంది. రామచంద్రాపురం టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, వైసీపీలోకి మారడం ఖాయమని తెలుస్తోంది. జనసేనలోకి వెళ్తారని మొన్నటి వరకూ ప్రచారం జరిగినా, సమీకరణాలు సరిపోకపోవడంతో, ఆయన వైసీీపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. కాపు సామాజికవర్గానికి చెందిన ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్‌లు వైసీపీలో చేరారు. వీరితో తోట మూర్తులు టచ్‌లో ఉన్నారని సమాచారం. వీటన్నింటినీ బట్టి చూస్తుంటే, కాపు వర్గానికి చెందిన కీలక నేతలపై జగన్‌ దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఆ విధంగా టీడీపీ, పవన్‌లకు చెక్‌ పెట్టాలని, జగన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన వంగవీటి రాధాకృష్ణ, అధికారికంగా ఏ పార్టీలోనూ చేరలేదు. టీడీపీలో జాయిన్ అవుతారని ప్రచారం జరిగింది. చంద్రబాబుపై ఆయన ప్రశంసలు కురిపించారు. అయితే, వైసీీపీకి రాజీనామా చేసి, చాలారోజులవుతున్నా, ఇప్పటివరకూ వంగవీటి మరో పార్టీలోకి మారకపోవడంపై అనేక ఊహానాగాలు వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి కూడా ఆ‍యనకు గట్టి హామీ దొరకలేదని తెలుస్తోంది. కాపు సామాజికవర్గానికి చెందిన జనసేనతోనూ ఆయన టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వంగవీటి సందిగ్దంలో పడ్డారని సమాచారం.

2014 నుంచి మొన్నటి వరకూ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా ఎమ్మెల్యేలు చేరారు. మంత్రి పదవులు సైతం పొందారు. మరికొందరు వైసీీపీ నేతలు సైతం సైకిలెక్కారు. అయితే ఎన్నికల ముంగిట్లో సీన్ రివర్స్ అవుతోంది. సీట్ల లెక్కలు, సొంత పార్టీలోనే పోటాపోటీ వాతావరణం, సామాజిక సమీకరణలతో, పార్టీ కండువాలు మారుస్తున్నారు నేతలు. రానున్న ఒకట్రెండు నెలల్లో, టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌లలో, కప్పెల తక్కెడ భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories