ఢిల్లీ గద్దెపై కూర్చోడంలో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి?

ఢిల్లీ గద్దెపై కూర్చోడంలో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి?
x
Highlights

మోడీ స్వరంలో ఇప్పుడు మార్పొచ్చింది. ఆయన మిత్ర పక్షాలతో మళ్లీ స్నేహం మొదలు పెట్టారు. ఎందుకు? కారణమేంటి? పడిపోతున్న గ్రాఫ్ ని నిలబెట్టుకోడానికి...

మోడీ స్వరంలో ఇప్పుడు మార్పొచ్చింది. ఆయన మిత్ర పక్షాలతో మళ్లీ స్నేహం మొదలు పెట్టారు. ఎందుకు? కారణమేంటి? పడిపోతున్న గ్రాఫ్ ని నిలబెట్టుకోడానికి వేస్తున్న ఎత్తుగడలేంటి? మోడీ గ్రాఫ్ దారుణంగా పడిపోతోందనడానికి సాక్ష్యం గుజరాత్ ఎన్నికలు.. మోడీ అంటే అభిమానించే వారు సైతం నోట్ల రద్దుపై మండి పడ్డారు. అంతేకాదు అంబానీలకు దేశాన్ని దోచి పెడుతున్నారన్న రీతిలో సాగుతున్న నిర్ణయాలూ మైనస్ గా మారాయి. అవి చాలదన్నట్లు 2018 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మోడీ పరిస్థితి మరింత దిగజారిందని తేటతెల్లం చేశాయి. మోడీ వేవ్ కరిగిపోతోందని అర్ధం అయ్యాక యూపీలో తగినన్ని సీట్లు రావని తేలిపోయింది. పులి మీద పుట్రలా ఎన్నడూ కలవని ఎస్పీ, బీఎస్పీ ఏకమయ్యాయి. దాంతో యూపీ సమీకరణలు మారిపోయాయి. దాని ఫలితమే2018 తమిళనాడులో అమిత్ షా మిత్రపక్షాలను గౌరవిస్తామని, కొత్త మిత్రులను చేర్చుకుంటామనీ, జాతీయ స్థాయిలో పారదర్శక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనీ సంకేతాలిచ్చారు.

బీహార్ లో జేడీయూ నేత నితీష్ కుమార్ తో చేతులు కలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీ చేశారు..పొత్తుల ో భాగంగా ఎక్కువ సీట్లు కేటాయించి మిత్రులను గౌరవిస్తామని చాటుకున్నారు. మహారాష్ట్రలో శివసేనతో చెడిన మిత్రత్వాన్ని సర్దుకున్నారు.. అసెంబ్లీ సీట్లు చెరిసగం పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. పాత మిత్రులకు స్వాగతం అని చెప్పడం ద్వారా తమిళనాడులో అన్నా డీఎంకే, పీఎంకేలతో కలసి సాగుతున్నారు. యూపీలో చిన్న పార్టీలు కలుపుకుపోవడమే కాదు.. దక్షిణాదిన తెలంగాణ, ఏపీలలో ప్రాంతీయ పార్టీలతో వైరం లేకుండా చూసుకుంటున్నారు. పరిస్థితులకనుగుణంగా మోడీ అనుసరిస్తున్న వ్యూహం మంచం ఉన్నంత మేరకే కాళ్లు చాపు కుంటామన్న తీరునఉంది. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?

బీజేపీ కి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు అందుకే మారుతున్న సమీకరణలకు అనుగుణంగా తన వ్యూహాన్ని మార్చుకుంటోంది.. మరి కాంగ్రెస్? పాత అనుభవాలనుంచి ఆ పార్టీ ఏం నేర్చుకున్నట్లు లేదు ఆ పార్టీ తీరే అందుకు నిదర్శనం.అధికారం కనుచూపు మేరలో లేదు. వచ్చే ఆస్కారమూ కనిపించడం లేదు. సంకీర్ణ ప్రభుత్వాలను నడపడంలో ఆరితేరిన కాంగ్రెస్ ఈ సారి కూడా అవకాశాన్ని చేజార్చుకుంటోంది. తన మిత్రులతో ఇప్పటి వరకూ సీట్ల సర్దుబాటే చేసుకోలేకపోతోంది. బీఎస్పీతో విభేదించి యూపీలో సీన్ చెడగొట్టుకుంది.. ఉప్పు నిప్పు లాంటి ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ కి గట్టి ఎదురు దెబ్బ యూపీ సంకీర్ణంలో అమేథీ, రాయబరేలీ సీట్లను మినహాయించి మూడు పార్టీల కూటమిలో కాంగ్రెస్ కి చోటే లేకుండా పోయింది.

అపజయాలు వెంటాడుతున్నా కాంగ్రెస్ నేత రాహుల్ మాత్రం అదే దూకుడు మీదున్నారు.. కింద పడినా తనదే పై చేయి కావాలనే ధోరణితో అవకాశాలను చెడగొట్టుకుంటున్నారు. అధికారంలో ఉన్న బీజేపి పరిస్థితులకనుగుణంగా తగ్గి వ్యవహరిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం లేనిపోని హెచ్చులకు పోతోంది. అసెంబ్లీ ఎన్నికలు, గ్రౌండ్ సర్వేల ఆధారంగా బీజేపి అడుగులేస్తోంది.తమకు గెలవగలం అనుకున్న సీట్లనే పోటీ చేస్తోంది. బీజేపీ ఇంత సంయమన ధోరణితో నడుచుకోవడం ఈ మధ్య కాలంలో లేదు ఇది గణనీయమైన మార్పు.

కానీ కాంగ్రెస్ మాత్రం అదే అహంకార ధోరణిని ప్రదర్శిస్తోంది. మహా కూటమి అంటుంది. కానీ మిత్రులను కలుపుకుపోవడంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతోంది. మమతా బెనర్జీ ర్యాలీ నిర్వహిస్తే రాహుల్ దానికి వెళ్లకుండా డుమ్మా కొట్టారు.. ఆమ్ ఆద్మీ పార్టీతో అవగాహనకు రాలేకపోతున్నారు.. అఖిలేష్ ఫోన్ చేస్తే కనీసం ఆన్సర్ కూడా ఇవ్వరు. ఎన్డీఏ కూటమి ఐక్యత రోజు రోజుకూ విస్తరిస్తుంటే.. ప్రతిపక్షాల ఐక్యత మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. మోడీ తన ఇమేజ్ ను జాగ్రత్తగా వాజపేయిలా మార్చుకుంటున్నారు.. సంకీర్ణ భాగస్వాములను కలుపుకుపోతూ అడుగేస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఉన్న మిత్రులను చెడగొట్టుకుని అదే అహంభావంతో అడుగులేస్తోంది. కాలానుగుణంగా బీజేపీ వ్యూహంలో చేసుకుంటున్న మార్పులు ఆ పార్టీని గెలిపిస్తాయా? లేక రాహుల్ దూకుడు కాంగ్రెస్ ని గెలిపిస్తుందా? ఢిల్లీ గద్దెపై కూర్చోడంలో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి?2019 ఎన్నికలే తేల్చాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories