వరంగల్ పార్లమెంట్‌పై పట్టు సాధించేదెవరు?

వరంగల్ పార్లమెంట్‌పై  పట్టు సాధించేదెవరు?
x
Highlights

తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాలకు సవాల్ విసురుతున్న వరంగల్ పార్లమెంట్ స్థానం. గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజేతగా నిలిచిన టీఆర్ఎస్‌ కాకతీయుల...

తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాలకు సవాల్ విసురుతున్న వరంగల్ పార్లమెంట్ స్థానం. గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజేతగా నిలిచిన టీఆర్ఎస్‌ కాకతీయుల కోటలో మాత్రం నెగ్గి తీరాలన్న పట్టుదలతో ఉంది. మాలో మాకే పోటీ మాకు ఎవరూ లేరు సాటి అంటున్న గులాబీదళం బంపర్‌ మెజారిటీతో కేసీఆర్‌ బహుమతి ఇవ్వాలని ఉవ్విళ్లూరుతోంది. గట్టి పోటీ ఇచ్చే యోచనలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు వ్యూహరచన చేస్తున్నాయి. మరి ఎవరిది పైచేయి. పట్టు సాధించేదెవరు? ఉనికి నిలబెట్టుకునేదెవరు? మొత్తంగా కాకతీయుల కోటలో కాకలు తీరిన యోధుల సమరంలో అంతిమంగా విజేతగా నిలిచే వీరుడెవరు?

వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అవి స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి, పరకాల, వరంగల్‌ వెస్ట్‌, వరంగల్‌, వర్దన్నపేట, భూపాలపల్లి. ఇక ఈ ఎంపీ పరిధిలో మొత్తం ఓటర్లు 16 లక్షల 53 వేలు, ఇందులో పురుషులు 8 లక్షల 23 వేల 582, మహిళలు 8 లక్షల 29 వేల 716 మంది ఉన్నారు.2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ నుంచి కడియం శ్రీహరి, కాంగ్రెస్‌ నుంచి సిరిసిల్ల రాజయ్య, బీజేపీ నుంచి రగుమల్ల పరమేశ్వర్‌ బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీ జెండా ఎగరేయగా కడియం శ్రీహరి సిరిసిల్ల రాజయ్యపై 3 లక్షలపైగా మెజారిటీతో విజయం సాధించారు.

కిందటిసారి ఎన్నికల్లో మొత్తం 11 లక్షల 74 వేల 631 ఓట్లు పోలవగా టీఆర్ఎస్‌ అభ్యర్థి కడియం శ్రీహరికి 6 లక్షల 61 వేల 639 ఓట్లు, 56.33 శాతం ఓట్‌షేర్‌ వచ్చింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యకు 2 లక్షల 69వేల 65 ఓట్లు, 22.91 ఓటింగ్‌ శాతం, బీజేపీ అభ్యర్థి రగమల్ల పరమేశ్వర్‌కు లక్ష 87 వేల 139 ఓట్లు, ఓటింగ్ శాతం 15.93గా నమోదైంది. ఈ ఎన్నికల్లో శ్రీహరికి వచ్చిన మెజారిటీ 3లక్షల 92 వేల 574.తర్వాత రాజకీయ పరిణామాలతో వరంగల్‌ ఎంపీ పదవికి కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. 2015 బై ఎలక్షన్‌లో టీఆర్ఎస్‌ నుంచి పసునూరి దయాకర్, కాంగ్రెస్‌ నుంచి సర్వే సత్యనారాయణ, బీజేపీ నుంచి పగడిపాటి దేవయ్య బరిలో నిలిచారు. ఆ ఉపఎన్నికల్లో పసునూరి దయాకర్‌ విజేతగా నిలిచారు.

ఇక 2015 ఉపఎన్నికల్లో మొత్తం 10 లక్షల 34 వేల 840 ఓట్లు పోలవగా టీఆర్ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు 6లక్షల15 వేల403, 59.50 ఓటింగ్ శాతం వచ్చింది. రెండోస్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు లక్ష 56 వేల 315 ఓట్లు పడగా, 15.11 ఓటింగ్ శాతం, మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ అభ్యర్థి పగిడిపటి దేవయ్య లక్షా 29 వేల 868 ఓట్లు, 12.57 ఓటింగ్ శాతం నమోదైంది. ఈ ఎన్నికల్లో విజేతగా నిలిచిన దయాకర్‌‌కు 4 లక్షల 59 వేల 88 ఓట్ల మెజారిటీ వచ్చింది.

2019 ఎన్నికల్లో కూడా వరంగల్‌ స్థానంలో త్రిముఖ పోరే జరుగుతుంది. టీఆర్ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, కాంగ్రెస్‌ నుంచి దొమ్మాటి సాంబయ్య, బీజేపీ నుంచి చింతా సాంబమూర్తి బరిలో నిలిచారు.ఈ ఎన్నికల్లో కాకతీయుల కోటలో జెండా ఎగరేస్తామని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. మరి ఈ ముగ్గురి బలాబలాలు ఏంటో చూద్దాం. మొదటగా టీఆర్ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌. కేసీఆర్ హవాతో గట్టెక్కుతామన్న భరోసా ఉంది. వరంగల్ పార్లమెంట్ స్థానంలో ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ నేతలే కావడం కలిసి వస్తుందన్న నమ్మకం ఉంది. ఐదేళ్లలో టీఆర్ఎస్‌ చేసిన విశేష ప్రగతి ప్రజల్లోకి వెళ్లిందన్న భరోసాతో ఉన్నారు దయాకర్‌. అయితే స్వతహాగా పార్టీ క్యాడర్‌ లేకపోవడం, చరిష్మా కలిగిన నాయకుడు కాకపోవడంలాంటి బలహీనతలు కూడా ఉన్నాయి.

ఇక దొమ్మాటి సాంబయ్య. గతంలో నాలుగుసార్లు పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి పనిచేస్తుందన్న భరోసా. తన సామాజిక వర్గం ఓటర్లు వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిని ఎక్కువగా ప్రభావితం చేయడం, పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయల్లోకి వచ్చారన్న పేరుంది. రెండు స్థానాలు రిజర్వ్డ్‌ అయి ఉండటం కలిసొచ్చే అంశం. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే స్థితిలో లేకపోవడం, జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాలతో కాస్త కంగారు పడుతుంది క్యాడర్‌.

అలాగే బీజేపీ అభ్యర్థి చింత సాంబమూర్తి. దేశంలో మోడీ హవా తనకు కలిసొస్తుందన్న భరోసా ఉంది. జిల్లా కేంద్రానికి నిధులు నేరుగా రావడం. వరంగల్ సిటీని స్మార్ట్ సిటీ చేయడం, హృదయ పథకం, వారసత్వ నగరంగా గుర్తించి ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేయడం లాంటి కేంద్ర పథకాలు పట్టం కడుతాయన్న నమ్మకం ఉంది. అయితే స్థానికేతరుడన్న పేరు, బీజేపీకి జిల్లాలో క్యాడర్ లేకపోవడంలాంటి మైనస్‌లు కూడా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories