విద్యా ప్రపంచంలో ఏంటీ చిచ్చు... శాంతిమంత్రం రాజ్యాంగ విరుద్ధమా?

విద్యా ప్రపంచంలో ఏంటీ చిచ్చు... శాంతిమంత్రం రాజ్యాంగ విరుద్ధమా?
x
Highlights

అసతోమా సద్గమయ.....తమసోమా జ్యోతిర్గమయ..... మృత్యోర్మా అమృతం గమయ..... ఈ మూడు ఉపనిషత్ సంస్కృత వాక్యాలను శాంతి మంత్రాలు అని అంటారు. అవి మనిషి మనస్సుకు...

అసతోమా సద్గమయ.....తమసోమా జ్యోతిర్గమయ..... మృత్యోర్మా అమృతం గమయ..... ఈ మూడు ఉపనిషత్ సంస్కృత వాక్యాలను శాంతి మంత్రాలు అని అంటారు. అవి మనిషి మనస్సుకు ప్రశాంతతను అందించేవి. ప్రపంచ శాంతిని కోరుకునేవి. ఇప్పుడు మాత్రం వాటిపై న్యాయస్థానాల్లో కేసులు పెడుతున్నారు. దేశంలో ప్రశాంతతను తుడిపివేస్తూ....అశాంతికి కారణమవుతున్నారు. విద్యాప్రపంచంలో చిచ్చురేపుతున్నారు. కొన్ని ముస్లిం సంస్థలు చెబుతున్నట్లుగా ఈ శాంతి మంత్రం రాజ్యాంగ విరుద్ధమా? అనే అంశాన్ని ఇక సుప్రీంకోర్టు తేల్చనుంది.

కేంద్రీయ విద్యాలయాల్లో సంస్కృత శ్లోకాలను పఠించడంపై కొన్నేళ్ళుగా వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా జామాయిత్ ఉలేమా-$ఇ-హింద్ అనే ముస్లిం సంస్థ ఈ వివాదానికి ఆజ్యం పోసింది. కేంద్రీయ విద్యాలయాల్లో ఉదయంపై జరిగే ప్రార్థనలకు సంబంధించి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హిందూ ప్రార్థనలు చేయాల్సిందిగా విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నారని ఆ పిటిషన్ లో పేర్కొంది. ఈ విధమైన ప్రార్థనలు రాజ్యాంగవిరుద్ధమని ఆరోపించింది. సుప్రీం కోర్టు ఈ పిటిషన్ ను ఆమోదించనప్పటికీ, ఈ అంశాన్ని పరిశీలించేందుకు రాజ్యాంగ బెంచ్ ఏర్పాటు చేసినప్పుడు వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించింది. తాజా పిటిషన్ ను వినాయక్ షా అనే న్యాయవాది దాఖలు చేశారు. ఈ విధమైన ప్రార్థనలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెరగకుండా చేస్తాయని పిటిషన్ లో పేర్కొన్నారు. దేశంలో 1100కు పైగా కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో ఉదయం పూట ప్రార్థనకు ముందుగా శాంతిమంత్రం పఠించడం 1964 నుంచి కూడా ఆనవాయితీగా వస్తోంది.

భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీన సాహిత్యం వేదాలంటే అతిశయోక్తి కాదు. అలాంటి వేదాల సారాన్ని వివరించేవే ఉపనిషత్తులు. వాటిలో ప్రముఖమైంది బృహదరణ్యక ఉపనిషత్తు. మనకు ఉన్న 108 ఉపనిషత్తుల్లో పదోది బృహదరణ్యక ఉపనిషత్తు. నైతికతకు సంబంధించిన ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. దేశంలో ఏర్పడిన ఎన్నో మతాలు ఈ ఉపనిషత్తులో చెప్పిన నైతిక సూత్రాలనే ఆధారంగా చేసుకున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే.... మతమేదైనా సరే....అన్ని మతాల వారికీ వర్తించే నైతిక సూత్రాలు ఇందులో ఉన్నాయి. మధ్వాచార్య, ఆదిశంకరాచార్య లాంటివారెందరో ఈ ఉపనిషత్తు వాక్యాలతో ప్రభావితమయ్యారు. అసతోమా సద్గమయ.... .తమసోమా జ్యోతిర్గమయ..... మృత్యోర్మా అమృతం గమయ.....ఓం శాంతి...శాంతి...శాంతి అనేది ప్రసిద్ధ ఉపనిషత్ శాంతి మంత్రం. ఈ మాటలకు అర్థం....మమ్మల్ని అసత్యం నుంచి సత్యం వైపు నడిపించు.....చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకెళ్ళు......మరణం నుంచి అమరత్వం వైపు తీసుకెళ్ళు.... అని అర్థం. ఈ శాంతి మంత్రమే ఇప్పుడు దేశంలో అశాంతి రేపనుందా అనే సందేహం ఇప్పుడు కలుగుతోంది. కేంద్రీయ విద్యాలయాలతో సహా మరెన్నో పాఠశాలల్లో ఈ శాంతి మంత్రాన్ని ఉదయం పూట ప్రార్థన గీతానికి ముందుగా పఠించడం ఆనవాయితీగా వస్తోంది. వాటిని పఠించడం రాజ్యాంగ విరుద్ధమంటూ కొన్ని ముస్లిం సంస్థలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సంచలనం రేకెత్తించింది. ఇలాంటి వివాదాలు ఇంకెన్నాళ్ళు? ఇలాంటి సమస్యలకు పరిష్కారం లేదా అనేదే ఇప్పుడు కీలకాంశంగా మారింది.

అసతోమా సద్గమయ .....శాంతి మంత్రంలో ఎక్కడ కూడా మతం ప్రస్తావన లేదు. ఈ మంత్రం విద్యార్థుల్లో సరైన ఆలోచనలను రేకెత్తించేదిగా మాత్రమే ఉంటుంది. కొన్ని వందల ఏళ్ళుగా విద్యార్థులు ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తూనే ఉన్నారు. ఆ శ్లోకం సంస్కృత భాషలో ఉన్నంత మాత్రాన అది హిందూమతానికి చెందిందిగా భావించాల్సిన అవసరం లేదు. సంస్కృత భాష ఎప్పటి నుంచో ఉంది. నిర్దిష్టంగా మతం రూపుదిద్దుకోని కాలం నుంచే వేదాలు ఉన్నాయి. నిజానికి భారత రాజ్యాంగ రూపకల్పన లో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడా సంస్కృతాన్ని జాతీయ భాషగా చేయడాన్ని సమర్థించారు. దేశంలో సంస్కృతం ప్రాచుర్యం పొందేవరకూ, ఒక 15 ఏళ్ళ పాటు ఇంగ్లీషు అధికారభాషగా ఉండాలని అంబేద్కర్ భావించారు. ఇక అన్నిటి కన్నా ముఖ్య విషయం మరొకటి ఉంది. యతో ధర్మ...తతో జయ అనేది సుప్రీం కోర్టు లక్ష్య ప్రకటన. మహాభారతం నుంచి ఆ వాక్యం వచ్చింది. రేపటి నాడు సుప్రీం కోర్టు లక్ష్యప్రకటన సెక్యులర్ గా లేదని ఎవరైనా కేసు వేస్తే....సుప్రీం కోర్టు తన లక్ష్య ప్రకటన నినాదాన్ని మార్చుకుంటుందా? అంతేకాదు...సత్యమేవ జయతే... లాంటి వాక్యాలు, హిందూ మత ప్రాబల్యాన్ని చాటే పూర్ణకుంభం, పూలు, జంతువులు, చెట్లు వివిధ అధికారిక చిహ్నాలుగా ఉన్నాయి. వాటిపై కేసులు వేస్తే వాటిని కూడా మార్చుకుంటూ పోతారా? అలా చేస్తూ పోతే....వేల ఏళ్ళ సంస్కృతి ఆనవాళ్ళు లేకుండా పోతుంది. సంస్కృతిని కోల్పోయిన దేశం సులభంగా విదేశీ శక్తుల ప్రభావానికి లొంగిపోతుంది. ఈ నేపథ్యంలో సంస్కృతికి సంబంధించిన అంశాలపై ఒక నిర్దిష్ట ధోరణిని స్పష్టం చేయాల్సిన సమయం వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories