ఇండియాలో చదువు.. అమెరికాలో ఉద్యోగం... సాఫ్ట్‌వేర్‌ కోణం చెప్పే నిజం

ఇండియాలో చదువు.. అమెరికాలో ఉద్యోగం... సాఫ్ట్‌వేర్‌ కోణం చెప్పే నిజం
x
Highlights

విద్యార్థులు విదేశీ బాట పట్టేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అమెరికా విషయానికి వస్తే....అక్కడ ఎలాంటి అనుభవం లేని సాధారణ సాఫ్ట్ వేర్ విద్యార్థి సైతం...

విద్యార్థులు విదేశీ బాట పట్టేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అమెరికా విషయానికి వస్తే....అక్కడ ఎలాంటి అనుభవం లేని సాధారణ సాఫ్ట్ వేర్ విద్యార్థి సైతం ఏడాదికి కనీసం 60 వేల డాలర్ల ఉద్యోగం పొందగలుగుతాడు. భారతదేశంతో పోలిస్తే అదెంతో అధికం. ఒక్కముక్కలో చెప్పాలంటే భారత్ లో ఓ ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని అక్కడ ఒక్క నెలలో సంపాదించవచ్చు. ఈ అంశమే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అమితంగా ఆకర్షిస్తోంది. దీనికి తోడు మరెన్నో కారణాలు కూడా విదేశీ ఉద్యోగాల వైపు చూసేందుకు కారణమవుతున్నాయి. ఒక్క విద్యార్థి అమెరికా వెళ్తే....మరో వంద మందికి అది స్ఫూర్తినిస్తోంది. తామెందుకు అమెరికా వెళ్ళలేము అని వారిని ప్రశ్నించుకునేలా చేస్తోంది. తగిన నైపుణ్యాలు, ఆర్థిక స్తోమత లేకున్నా అమెరికా వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు తమ పిల్లలను విదేశాలకు పంపడాన్ని ప్రతిష్టగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నో కుటుంబాలు అప్పులు పాలు కూడా అవుతున్నాయి. అమెరికా చదువులకు మోసాలు ఇక్కడి నుంచే ప్రారంభమవుతున్నాయి. క్రమ క్రమంగా అవి పెద్దవిగా మారుతూ చివరకు విద్యార్థుల ఉద్యోగ ఆశలకు ఎసరు తెస్తున్నాయి. కొందరు విద్యార్థులు మాత్రమే నిజంగా చదువుకోసం, కొంత ఉద్యోగానుభవం కోసం వెళ్ళి తిరిగి ఇండియాకు వస్తున్నారు. భారత్ లోనూ ఇప్పుడు ఉద్యోగాలు చక్కటి జీతభత్యాలతో లభిస్తున్నా అది కొందరికి మాత్రమే. సాధారణ విద్యార్థుల వార్షిక వేతనాలు ఆరంభంలో 5 లక్షలకు మించడం లేదు. అందుకే నేటికీ అమెరికా ఎంతోమంది భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తూనే ఉంది.

విదేశీ విద్య కోసం కొంతమంది మధ్యప్రాచ్యం, ఆసియా, ఇతర యూరప్ దేశాలను కూడా ఎంచుకుంటున్నారు. జర్మనీకి వెళ్ళే వారి సంఖ్య 2010-11లో 5 వేల పై చిలుకు ఉండగా, 2016-17 నాటికి అది మూడింతలై 15,500కు చేరుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విషయానికి వస్తే, అక్కడి విదేశీ విద్యార్థుల్లో 30 శాతం మంది భారతీయ విద్యార్థులే. భారతదేశంతో పోలిస్తే విదేశాల్లో చక్కటి ఉపాధి అవకాశాలు ఉన్న మాట నిజమే. అదే సమయంలో ఆ దేశాల్లో నిబంధనలు క్రమంగా కఠినమైపోతున్నాయి. నిబంధనలను పాటిస్తేనే చదువు, ఉద్యోగం సాధ్యపడుతాయి. లేని పక్షంలో ఇండియాకు తిరిగి రాక తప్పదు. నిజంగా చదువు కోసమే వెళ్తూ అవకాశం వస్తే నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగాలు చేద్దామనుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీనే ఉదాహరణగా తీసుకుంటే 2013లో అక్కడ భారతీయ విద్యార్థుల సంఖ్య 200 మాత్రమే. 2017 నాటికి అది 726కు పెరిగిపోయింది. మరో వైపున ప్రతిభావంతులకు భారత్ లోనూ వివిధ కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. విదేశీ ఉద్యోగాలకు దీటుగా జీతభత్యాలు పొందుతున్న వారు కూడా ఉన్నారు. వారి సంఖ్య ఇప్పటికైతే తక్కువే అయినప్పటికీ, రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories