హింసకు దారి తీసిన మూడో దశ పోలింగ్

హింసకు దారి తీసిన మూడో దశ పోలింగ్
x
Highlights

తొలి రెండు విడతల్లో చెదరుమదురు ఘటనలతో ముగిసిన పోలింగ్‌ మూడో విడత కొన్ని చోట్ల హింసాత్మకమైంది. సార్వత్రిక సమరాంగణంలో కీలక ఘట్టగంగా భావిస్తున్న ఈ...

తొలి రెండు విడతల్లో చెదరుమదురు ఘటనలతో ముగిసిన పోలింగ్‌ మూడో విడత కొన్ని చోట్ల హింసాత్మకమైంది. సార్వత్రిక సమరాంగణంలో కీలక ఘట్టగంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకోగా... మరికొందరు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తంగా 18 కోట్ల 56 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 1640 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.

హింసాత్మక ఘటనలు, అల్లరిమూకల ఆగడాల మధ్య దేశవ్యాప్తంగా లోక్‌సభ మూడో దశ ఎన్నికలు ముగిశాయి. మొత్తం ఏడు దశల పోలింగ్‌లో భాగం మూడో దశలో అత్యధికంగా 116 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలకు ఇది అత్యంత కీలకంగా మారింది. దేశంలోని 14 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగినఈ ఎన్నికల్లో 1,640 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

గుజరాత్ 26 స్థానాలు, కేరళలో 20, గోవాలో 2, కర్ణాటక 14లో, మహారాష్ట్రలో 14, ఒడిషాలో 6, పశ్చిమ బెంగాల్‌లో 5, అసోంలో 4, బీహార్‌లో 5, చత్తీస్‌గఢ్‌లో 7, జమ్మూకాశ్మీర్ ఒకస్థానానికి ఎన్నికలు జరగగా డయ్యూడామన్, దాద్రా నగర్ హవేలీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో చెరో నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించారు.

పశ్చిమ బెంగాల్‌లో మూడో దశ పోలింగ్‌లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముర్షీదాబాద్‌ రానీనగర్‌ ప్రాంతంలోని 27, 28 నంబర్‌ పోలింగ్‌ బూత్‌ల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు బాంబు విసిరి అక్కడి నుంచి పారిపోయాడు. ఒడిశాలోని దెంకనల్‌లో పోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న అధికారి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచారు. ఇటు- కేరళ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓటర్‌ జాబితాలో తన పేరు లేకపోవడంతో మణి అనే వ్యక్తి చనిపోయాడు. మరోవైపు రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న ఇద్దరు వృద్ధులు చనిపోయారు. తలిపరంబాలో పోలింగ్‌ కేంద్రం నుంచి ఇంటికి చేరుకున్న 72 ఏళ్ల వేణుగోపాల మరార్‌ అస్వస్థతకులోనై మరణించారు.

పోలింగ్‌ బూత్‌లోకి అనుకోని అతిథి వచ్చింది. కేరళలో కన్నూర్‌ జిల్లాలో ఓ పోలింగ్‌ బూత్‌లో అకస్మాత్తుగా ఓ పాము కనిపించింది. దీంతో అక్కడి ఓటర్లు, అధికారులు భయాందోళనలకు గురయ్యారు. పామును పట్టుకున్న తరువాత పోలింగ్‌ సజావుగా సాగింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో 18.56 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకోసం ఈసీ 14 రాష్ట్రాల్లో మొత్తం 2.10 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories