విపక్షాలపై సర్జికల్‌ స్ట్రైక్‌... బడ్జెట్‌తో ఇక ఎన్నికల్లోకి!!

విపక్షాలపై సర్జికల్‌ స్ట్రైక్‌... బడ్జెట్‌తో ఇక ఎన్నికల్లోకి!!
x
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఈసారి దాడి జరిగింది మాత్రం దేశంలోనే....జరిగిన దాడితో విపక్షాలు బిత్తరపోయాయి. కేంద్ర...

ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఈసారి దాడి జరిగింది మాత్రం దేశంలోనే....జరిగిన దాడితో విపక్షాలు బిత్తరపోయాయి. కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ రూపంలో ఎన్నికల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఒకటి...రెండు...మూడు....లెక్కలేనన్ని వరాలను ప్రకటించారు. సమాజంలోని ప్రతీ వర్గానికీ ఏదో విధంగా ప్రత్యక్ష లబ్ధి చేకూర్చేలా చేశారు. ఆ ఒక్కటి చాలు...రాబోయే ఎన్నికల్లో ప్రజల ఓటింగ్ సరళిని ప్రభావితం చేసేందుకు. ....మరి ఈ సర్జికల్ స్ట్రైక్ ఆశించిన ఫలితాలను అందిస్తుందా? మరోసారి బీజేపీని అధికారం చేపట్టేలా చేస్తుందా? మధ్యంతర బడ్జెట్ తో ప్రజలకు నిజంగానే లాభం చేకూరుతుందా?

మధ్యంతర బడ్జెట్ కాస్తా ఎన్నికల బడ్జెట్ గా మారిపోయింది. బడ్జెట్ తాయిలాల్లో అత్యధికం ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదనలే. అయినా కూడా ఎన్నికలకు ముందు బడ్జెట్ లో మాత్రమే అవి చోటు చేసుకున్నాయి. సంపన్నులు, మధ్యతరగతి వారు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు, కూలీలు....ఇలా సమాజంలోని అన్ని వర్గాలకు ప్రత్యక్ష లబ్ధి అనేది ఒక బ్రహ్మాస్త్రం. ఈ తరహా బడ్జెట్ ఇదే మొదటిసారి అంటే అతిశయోక్తి కాదు. ఓట్ల కోసమే నోట్లు కురిపిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వ వ్యతిరేకత కాస్తో, కూస్తో పెరిగిందంటూ వచ్చిన సర్వే ఫలితాలను తిరిగి సవరించుకునేలా మోడీ సంధించిన బడ్జెట్ బాణం గురి తప్పలేదు. ఇప్పుడు దేశమంతా ఎక్కడ చూసినా బడ్జెట్ పైనే భారీగా చర్చలు జరుగుతున్నాయి. సమాజంలో ప్రతీ ఒక్కరూ.... తమకు వచ్చే లాభాలేంటో లెక్కలు వేసుకుంటున్నారు.

ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకోవడం మోడీకి కొత్తేమీ కాదు. పెద్ద నోట్ల రద్దు, పాకిస్థాన్ పై సర్జికల్ దాడులు లాంటివి అలాంటివే. పెద్ద నోట్ల రద్దు చర్య కొంత ప్రతికూలతను కలిగించింది. దాన్ని దూరం చేసే రీతిలో ఇప్పుడు మధ్యంతర బడ్జెట్ తెరపైకి వచ్చింది. ఓటర్ల జ్ఞాపకశక్తి తక్కువని అంటారు. ఇక ఇప్పుడు ఓటర్లకు గుర్తుండేది ఎన్నికలకు ముందు బడ్జెట్ తో తమకు కలిగే ప్రయోజనాలే అంటే అతిశయోక్తి కాదు. నిన్న గాక మొన్న దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందనే అంశం వార్తల్లోకి వచ్చింది. అది జనంలోకి పోకముందే మోడీ బడ్జెట్ మంత్రం ప్రజల్ని తన వైపు తిప్పుకుంది. ఇలాంటి అస్త్రాలు మరింకెన్నో తమ వద్ద ఉన్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. అదే గనుక నిజమైతే....విపక్షాలకు గడ్డుకాలం తప్పదు. ఇప్పటికే ముక్క చెక్కలైన విపక్షాలు ఇక అధికార పక్షాన్ని ఎలా ఎదుర్కొంటాయో ఎన్నికల్లో చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories