స్వయం ఉపాధి మార్గంగా కుందేళ్ల పెంపకం

స్వయం ఉపాధి మార్గంగా కుందేళ్ల పెంపకం
x
Highlights

ప్రస్తుతకాలంలో జీవాల పోషణ ప్రధానాకర్షగా మారింది. పాడి , గొర్రెలు, కోళ‌్ల పెంపకంతో పాటు కుందేళ్ల పెంపకంపై ఆసక్తి పెరుగుతోంది. మేకలు, కోళ్లకు ఉన్నంత...

ప్రస్తుతకాలంలో జీవాల పోషణ ప్రధానాకర్షగా మారింది. పాడి , గొర్రెలు, కోళ‌్ల పెంపకంతో పాటు కుందేళ్ల పెంపకంపై ఆసక్తి పెరుగుతోంది. మేకలు, కోళ్లకు ఉన్నంత మార్కెట్‌ లేకపోయినా ఔత్సాహకులు మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుని ఈ కుందేళ్లను పెంచేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుందేళ్ల పెంపకాన్ని చేపట్టి దినదినాభివృద్ధి చెందుతున్న రాజన్న సిరిసిల్లా యువరైతు సాగర్ రెడ్డి విజయగాథను తెలుసుకుందాం ఇవాళ్టి నేలతల్లి కార్యక్రమంలో.

వ్యవసాయ అనుబంధ రంగాల్లో అధిక పెట్టుబడితో కూడుకున్నవి పాడి, కోళ్ల పెంపకం అయితే పెట్టుబడి తక్కువతో చిన్నసన్నకారు రైతులకు మంచి ఉపాధి మార్గంగా ఉంటున్నాయి కౌంజులు, నాటుకోళ్లు, కుందేళ్ల పెంపకం. వీటికి మార్కెటింగ్ పరంగా అధిక ప్రయాస ఉన్నప్పటికీ డిమాండ్ ఎక్కడ ఉందో పసిగట్టి వాణిజ్యపరంగా కుందేళ్లను పెంచేందుకు యువరైతులు ఆసక్తిని చూపిస్తున్నారు. చాలా సున్నితమైన ఈ కుందేళ్ల పెంపకంలో మెళకువలను పాటిస్తూ కొన్నేళ్లుగా లాభాదాయకమైన ఆదాయా్ని ఒడిసిపడుతున్నారు సాగర్ రెడ్డి.

ఈ కుందేళ్ల ఫాం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని, నాగం పేట గ్రామంలో ఉంది. కుందేళ్ల పెంపకాన్ని నాలుగేళ్లుగా చేస్తున్నాడు సాగర్ రెడ్డి. మొదటి నుంచి సాగర్ కి వ్యాపారం చేయడమంటే ఆసక్తి. అందరూ రెగ్యులర్ గా చేసేది కాకుండా కొత్తగా వ్యవసాయం చేయాలనుకునేవాడు. డైరీ రంగంలో శ్రమ అధికంగా ఉంటుందని గ్రహించిన సాగర్ కుందేళ్ల పెంపకం గురించి తెలుసుకున్నాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి కుందేళ్ల పెంపకం గురించి అధ్యయనం చేసాడు. పెంపకంలో ఎలాంటి మెళకువలు పాటించాలో తెలుసుకున్నాడు. వెంటనే కుందేళ్ల పెంపకాన్ని చేపట్టాడు.

చికెన్, మటన్, ఫిష్ మాంసం సర్వసాధారనమైపోయింది. అందుకే కొత్తగా ఆలోచించి కుందేళ్ల మాంసం ఉత్పత్తిని ప్రారంభించాడు సాగర్‌.

కుందేళ్ల మాంసంలో కొవ్వు చాలా తక్కువ, ఇందులో ప్రోటీన్లు ఉంటాయి. గుండె జబ్బుతో బాధపడేవారు దీనిని తీసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కుందేలు మాంసంపైన పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ గోవా లాంటి ప్రాంతాల్లో కుందేళ్ల మాంసానికి మంచి డిమాండ్ ఉందంటున్నారు ఈ యవరైతు. మిగతా వాటితో పోల్చుకుంటే తక్కువ పెట్టుబడితో కుందేళ్ల పెంపకాన్ని చేపట్టవచ్చంటున్నారు సాగర్ రెడ్డి. తన దగ్గర 30 నుంచి 40 రకాల కుందేళ్ల బ్రీడ్‌లు ఉన్నాయి. అందులో న్యూజిల్యాండ్ వైట్ , కాలిఫోర్నియన్ వైట్, సోవియట్ చిన్‌చిల్లా వంటి వెరైటీలు ఉన్నాయి.

కుందేళ్లకు మేత కచ్చితంగా సమయం ప్రకారం ఇవ్వాలి. ఆలస్యమైతే అవి బెంబేలుపడి, నీరసించి బరువు తగ్గిపోతాయి. ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల కుందేళ్లు పగటిపూట ఆహారం తీసుకోవు. సాయంకాలం, రాత్రిపూట మాత్రం చురుగ్గా ఉంటాయి. అందుకే సాయంత్రం పూట దాణాను అందిస్తే సంపూర్ణంగా తింటాయి. కుందేళ్లు సామాన్యమైన మేతను తిని దాన్ని అధిక ప్రోటీన్లు గల విలువైన మాంసంగా మార్చుకుంటాయి. రైతుకు లాభాలను తెచ్చిపెడతాయి.

కుందేళ్ళు శాఖాహారులు, కుందేళ్ళ పెంపకం అతిసమర్థవంతంగా చేయాలంటే, వాటికి సంపూర్ణమైన మిశ్రమ దాణా ఇవ్వటం అవసరం. దాణాను పొడి రూపంలో గాని, గుళికల రూపంలోగాని ఇవ్వొచ్చు. మక్కపిండి, గోధుమ పొట్టు, పల్లిపిండి ని సమపాళ్లలో కలపి అందులో మినరల్ మిక్చర్‌ కలిపి కుందేళ్లకు దాణాగా అందిస్తున్నారు. దాణాతో పాటు పచ్చిమేతను కూడా ఇస్తున్నారు. స్టైలో, లూసెన్, హెజ్‌లూసెన్‌ గడ్డిని వీటికి ఆహారంగా వేస్తున్నారు. ఉదయం 7 గంటలకు షెడ్ క్లీన్ చేసుకుని కుందేళ్లకు నీరు దాణా అందిస్తున్నారు. సాయంత్రం పచ్చి గడ్డిని కుందేళ్లకు ఆహారంగా ఇస్తారు. దీని వల్ల ఎదుగుదల బాగుంటుందని సాగర్ చెబుతున్నారు. దాణాలో ఎలాంటి రసాయనాలు కలవవని పూర్తి సేంద్రియ విధానంలో పండించిన ఆహారాన్ని కుందేళ్లకు అందిస్తున్నామంటున్నారు.

కుందేళ్లలో ప్రత్యేకంగా గర్భధారణ సమయం అంటూ ఏమీ లేదు. ఎప్పుడైతే ఆడ కుందేలు మగకుందేలుతో జత కట్టనిస్తుందో అప్పుడు గర్భధారణ సమయంగా భావించాలి. కుందేళ్లలో సంతానోత్పత్తి బాగా రావాలంటే సమయాని కి తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సాగర్.

బాయిలర్‌ కుందేళ్ల పెరుగుదల రేటు చాలా ఎక్కువ. మూడు నెలల వయస్సులోనే రెండు కిలోల బరువు పెరుగుతాయి. సంతతి పరిమాణం కూడా కుందేళ్లలో చాలా ఎక్కువే. సుమారు 8-12 వరకు ఉంటుంది. ఆడ కుందేలు 5-6 నెలలు, మగ కుందేలు 5-6 నెలలు వయస్సు వచ్చినప్పటికీ ఒక సంవత్సరం తర్వా తే సంతానోత్పత్తికి వినియోగించాలి. దీని వల్ల నాణ్యతగల కుందేళ్లను పొందొచ్చు. మిగత పెంపకంలో కంటే కుందేళ‌్ల పెంపకం చాలా మంచిది. తక్కువ పెట్టుబడిత లాభాలను సాధించవచ్చు. ఉత్పత్తి కూడా బాగా వస్తుంది. కుందేళ్ల పెంపకం లాభసాటి వ్యాపారం శ్రమ ఎక్కువ ఉండదు. కుందేళ్ల క్రాసింగ్ అయిన 30 రోజుల్లో పిల్లలు వస్తాయి. పుట్టిన పిల్లలను తల్లి దగ్గర నెల రోజుల పాటు ఉంచాలి. ఆ తరువాత 10 రోజులు క్రాసింగ్ చేసి పిల్లలను ఉత్పత్తి చేయాలి.

కుందేళ్లు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎలాంటి రోగాలు రావు. షెడ్డులో సరైన శుభ్రత లేకపోయినా, ఆహారం అందించడంలో తేడాలు ఉంటే తప్పితే వాటి పెంపకంలో ఎలాంటి సమస్యలు ఉండవు. నష్టాలు లేని బిజినెస్‌ ఈ కుందేళ్ల పెంపకం అని అంటున్నాడు ఈ యువరైతు. ఏప్రిల్ మే నెలలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల క్రాసింగ్ చేయించకూడదు. షెడ్‌లో వాతావరణాన్ని ఎప్పుడూ కంట్రోల్ చేస్తూఉండాలి. నార్మల్ టెంపరేచర్ మెయింటేన్ చేసుకోవాలి. అలాగే వర్షాకాలంలో, చలికాలంలో కుందేళ్లను వెచ్చగా ఉండేందుకు పరదాలను కట్టుకోవాలి.

నష్టాలు లేని వ్యాపారం ఈ కుందేళ్ల పెంపకం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కుందేళ్ల మాంసం గురించి పెద్దగా అవగాహన లేకపోయినా రానున్న కాలంలో మంచి డిమాండ్ ఉంటుందని అంటున్నాడు ఈ రైతు. అందుకే రైతులు ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా చిన్నగా పెంపకాన్ని చేపట్టి పెంపకంపై పూర్తి అవగాహన, మెళకులను తెలుసుకోవాలంటున్నాడు. పెంపకంలో ఎవరికైనా సందేహాలు ఉంటే తాము సలహాలు, సూచనలు అందించడానికి అన్నివేలలా సిద్ధం అంటున్నారు సాగర్ రెడ్డి.

వ్యవసాయ అనుబంధ రంగాల్లోకి రావాలనుకునే వారికి కుందేళ్ల పెంపకం మచి అవకాశమంటున్నాడు ఈ రైతు. 200 కుందేళ్లను పెంచాలంటే సుమారు 2 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. షెడ్డు నిర్మాణాన్ని బట్టి ధర తగ్గోచ్చు, పెరగొచ్చు. అంతే కాదు. కుందేళ్లకు ఆర్గానిక్ ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేకంగా అరెకరంలో గడ్డిని సాగు చేయాలంటున్నారు సాగర్‌. ప్రస్తుతం కుందేళ్ల మాంసం వినియోగంపై తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా అవగాహన లేదు. కానీ భవిష్యత్తులో రాబిట్ మాంసానికి సంబంధించిన ఔట్లెట్లు పెరిగే అవకాశం ఉంది.

కుందేళ్ల పెంపకంలో 200 ఫీమేల్ బ్రీడర్స్ తీసుకుంటే ఒక్కొక్కటి 4 నుంచి12 పిల్లలను అందిస్తుంది. అలా 200 కుందేళ్ల నుంచి కనీసం 800 పిల్లలు వస్తాయి. ఒక్కొక పిల్ల 2 కేజీలు తూగుతుంది. ప్రతీ 40 రోజులకు 120 రోజుల్లో 2 కేజీల బరువుకు వస్తాయి. 40 రోజులకు ఒకసారి ఒక బ్యాచు ఉంటుంది. లైవ్‌లో వీటిని సేల్ చేసుకోవచ్చు. నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుంది.

కొత్తగా కుందేళ‌్ల పెంపకాన్ని చేయాలనుకునే వారు ముందు సర్వే చేయాలి. ఆ తరువాత లాభాన్ని , నష్టాన్ని అంచనా వేసుకోవాలి. తక్కువ ఖర్చులో షెడ్ వేసుకుని తక్కువ మొత్తంలోనే ప్రారంభిస్తే కొద్ది కొద్దిగా అవగామన వచ్చిన తరువాత పెద్దమొత్తంలో సాగు చేసుకోవచ్చు. బడ్జెట్ ప్రకారం ప్రారంభించుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్, ఫిష్ తో పాటు కుందేళ్ల మాంసానికి కూడ రానున్న కాలంలో మంచి డిమాండ్ పెరుగుతుంది తక్కువ పెట్టుబడి, తక్కు స్థలంలో కుందేళ్ల పెంపకాన్ని చేపట్టి లాభాల బాటలో పయనిస్తున్న సాగర్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ రంగంలోకి రావాలనుకునే వారికి తన నుంచి సహకారం అన్నివేళలా ఉంటుందంటున్నాడు సాగర్.


Show Full Article
Print Article
Next Story
More Stories