మిరపకు ప్రత్యామ్నాయంగా పుచ్చ సాగు

Farmer Success Story of Watermelon
x

మిరపకు ప్రత్యామ్నాయంగా పుచ్చ సాగు

Highlights

Watermelon Cultivation: మిరప సాగుతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఇద్దరు రైతులు ప్రత్యామ్నాయ విధానంతో లాభాల పంట సాగుబాట పట్టారు.

Watermelon Cultivation: మిరప సాగుతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఇద్దరు రైతులు ప్రత్యామ్నాయ విధానంతో లాభాల పంట సాగుబాట పట్టారు. నమ్ముకున్న పంటకు తెగులు సోకి పెట్టుబడులు భారమైన తరుణంలో దాన్ని తొలగించి పుచ్చ సాగు చేపట్టారు. ఆధునిక సాగు విధానాలను అనుసరించి పండించిన పంట ప్రస్తుతం రైతుల ఇంట సిరులు కురిపిస్తోంది. అదే ఊపుతో మరోసారి పుచ్చ సాగుకు మక్కువ చూపిస్తున్న వైనంపై ప్రత్యేక కథనం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పడమటి నరసాపురంకి చెందిన నాగ శ్రీనివాస రావు ఐదు ఎకరాల్లో మిరప సాగు చేశారు. పూత దశలోనే తెగులు సోకి పంట ఎదుగూ బొదుగూ లేకుండా పోయింది. పెట్టుబడి వ్యయం నాలుగు లక్షల రూపాయలు దాటడంతో ముందుకు వెళ్ళలేక పోయారు. పైసా తిరిగొచ్చే మార్గం కనిపించక తోటను తొలగించారు. మిరప మొక్కల్ని మొదట మల్చింగ్ విధానంలో నాటారు. తొలిగించిన తర్వాత పుచ్చసాగు చేపట్టారు. పూత దశలో తేనెటీగల ఆకర్షణ కోసం బెల్లం నీటితో తడిపి బస్తాలను పొలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. తేనెటీగల పరపరాగ సంపర్కం ద్వారా పిందెలు ఎక్కువగా ఏర్పడ్డాయి.

కాయ బరువు 6 నుంచి 8 కిలోలు ఉండటం, మార్కెట్ లో ధర ఉండటం కలిసొచ్చింది. వ్యాపారులే పొలానికి వాహనాలతో వచ్చి పంటను కొనుగోలు చేశారని రైతు తెలిపారు. టన్ను 25వేల చొప్పున 52 టన్నులు విక్రయించారు. పెట్టుబడులు పోను 8 లక్షల వరకు ఆదాయం మిగిలిందన్నారు. ఇదే ఉత్సాహంతో వేసవిని దృష్టిలో పెట్టుకుని మరోసారి పుచ్చసాగు చేస్తున్నారు ఈ సాగుదారు.

జూలూరుపాడుకు చెందిన మాలోత్ రాందాస్ నాయక్ కౌలురైతు. ఎనిమిది ఎకరాల్లో మిరప సాగు చేపట్టారు. అందరిలానే నష్టాలు వెంటాడాయి. తెగులు సోకిన తోటలను రక్షించుకునేందుకు తంటాలు పడ్డారు. 6 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి, చివరకు పంట మార్పిడి మేలని భావించారు. మిరప మొక్కలు తొలగించి పుచ్చ విత్తనాలు నాటారు. మొత్తం 8ఎకరాల నుంచి రెండు కోతల్లో 106 టన్నుల పుచ్చ దిగుబడులు సాధించారు. వచ్చిన పంటను కొనుగోలుదారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేశారన్నారు రైతు. ఆదాయం కూడా ఆశాజనకంగా రావడంతో ప్రస్తుత డిమాండ్‌ను గుర్తించి మరోసారి మల్చింగ్ విధానంలో పుచ్చ విత్తనాలను తన పొలంలో నాటుకున్నారు.

మిరప పంట కాలం ఆరు నెలలు , అదే పుచ్చ సాగు చేసుకుంటే 65 రోజుల్లోనే మొదటి పంట తీసుకోవచ్చునని రైతు చెబుతున్నారు. రెండో పంటగానూ పుచ్చ వేసుకున్నామని వేసవి సమయానికి పంట మార్కెట్ చేరుతుందని రైతులు తెలిపారు. తోటి రైతులు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని రైతులు సూచిస్తున్నారు.

వేసవి కాలంలో చిన్నా పెద్దా అందరూ ఎంతో ఇష్టంగా తినే పండు పుచ్చపడ్డు. మండే ఎండల వేళ ఎర్రటి పుచ్చకాయలు శరీరాన్ని సేదదీరుస్తాయి. వేసవిలో పుచ్చకు మంచి గిరాకీ ఉంటుంది. మార్కెట్ గిరాకీకి ఆధునిక విధానాలను అనుసరించి పుచ్చ సాగు చేస్తే రైతులు లాభదాయకమైన ఆదాయాన్ని పొందవచ్చు.


Show Full Article
Print Article
Next Story
More Stories