చేపల పెంపకంలో సరికొత్త టెక్నాలజీ

చేపల పెంపకంలో సరికొత్త టెక్నాలజీ
x
Highlights

ఆధునిక వ్యవసాయం అంటే అందరి చూపు ముందుగా ఇజ్రాయేల్ వైపు మళ్లుతుంది. కానీ ఆ ఇజ్రాయేల్ దేశం చూపును సైతం తనవైపు ఆకట్టుకుంటున్నాడు తెలంగాణకు చెందిన ఓ...

ఆధునిక వ్యవసాయం అంటే అందరి చూపు ముందుగా ఇజ్రాయేల్ వైపు మళ్లుతుంది. కానీ ఆ ఇజ్రాయేల్ దేశం చూపును సైతం తనవైపు ఆకట్టుకుంటున్నాడు తెలంగాణకు చెందిన ఓ అభ్యుదయ రైతు. తక్కువ నీటితో అతి తక్కువ మంది కూలీలతో , సేంద్రియ విధానంలో, ఆధునిక పద్ధతులను ఉపయోగించి లాభాదాయకమైన చేపల సాగు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు మహబూబ్‌నగర్ జిల్లా రైతు. చేపల పెంపకంలో సరికొత్త టెక్నాలజీని తెలుగురాష్ట్రాల రైతులకు పరిచయం చేస్తున్నారు విశ్వనాథరాజు.

విశ్వనాధ రాజుకి వ్యవసాయ రంగం అంటే ఎనలేని ప్రేమ చదివింది పదోతరగతే ఐనా 18 సంవత్సరాల తన వ్యవసాయ అనుభవంతో ఎప్పుడూ కొత్త కొత్త విధానాలను వెతుకుతుంటాడు విదేశాలను సందర్శిస్తూ అక్కడ వాడే కొత్త టెక్నాలజీని రైతులకు పరిచయం చేస్తున్నాడు. అందులో భాగంగానే గత మూడు సంవత్సరాలుగా అతి తక్కువ విస్తీర్ణంలో RAS, Recycling Aqua Culture System అనే పద్ధతిలో చేపలను పెంచుతున్నారు. పావు ఎకరంలో సంవత్సరానికి 70 టన్నుల దిగుబడిని సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

హైదరాబాద్‌ నగరానికి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం పరిధిలోని గుండేడ్‌ గ్రామం. అక్కడే విశ్వనాథ రాజుకు చెందిన వ్యవసాయ క్షేత్రం ఉంది. చుట్టు పక్కల నదులు కానీ, వరదనీటి కాలువలు గానీ లేవు. కేవలం బోర్లతో ఆధునిక పద్ధతులను అవలంభిస్తూ చేపల పెంపకాన్ని విజయవంతంగా చేసి చూపుతున్నారు. ఇందుకోసం విశ్వనాథరాజు రీసర్కులేటింగ్‌ ఆక్వా కల్చర్‌ సిస్టం ను తన వ్యవసాయ క్షేత్రంలో నిర్మించి చేపల పెంపకాన్ని చేపట్టారు.

18 సంవత్సరాల నుంచి హార్టీకల్చర్‌లో ఎన్నో ప్రయోగాలు చేసి కొత్త కిత్త విధానాలను తీసుకువచ్చారు విశ్వనాథరాజు. కూలీల ఖర్చును తగ్గించుకునే ఎన్నో ప్రయోగాలు చేశారు.సత్ఫలితాలను సాధించారు. 5 సంవత్సల క్రితం ఆక్వాఫోనిక్స్‌ టెక్నాలజీని ఉపయోగించి అల్ట్రా హైడెన్సిటీ పద్ధతిలో చేపల పెంపకం , చేపల వ్యర్థాలతో కూరగాయలు పెంచుకుకోవడం అనే నూతన ప్రయోగాన్ని ప్రారంభించారు. విదేశాల్లో అనుసరిస్తున్న పద్ధతులను మన స్థానికతను అనువుగా మనకున్న అవకాశాలను అనుగుణంగా ఏవిధంగా చేయాలలో దానిపై ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఈ కల్టివేషన్ స్ట్రక్చర్‌ను నిర్మించేందుకు ఎక్కువగా ఖర్చవుతుండడం, వీటికి మార్కెట్‌ లేకపోవడంతో ఈ పద్ధతిని పక్కన పెట్టారు.

ఆర్‌ఏఎస్ పద్ధతిలో చేపల పెంపకాన్ని విదేశాల్లో 30 , 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మన భరత దేశానికి ఇది పూర్తిగా కొత్త టెక్నాలజీ. ఆ టెక్నాలజీని తెలంగాణలో మొదటి సారి ప్రవేశపెట్టారు విశ్వనాధరాజు. తక్కువ నీటితో, అతి తక్కువ విస్తీర్ణంలో, ఎక్కడైతే నీటి లభ్యత సరిగా ఉండదో అలాంటి చోట కూడా సునాయాసంగా అంగుళం నీరు వచ్చే బోరు ఉంటే ఎకరంలో చేపలను పెంచుకోవచ్చని నిరూపిస్తున్నారు ఈ రైతు. ఈ పద్ధతిని అనుసరిస్తూ పావు ఎకరం విస్తీర్ణంలో 70 టన్నుల చేపల దిగుబడిని సాధిస్తున్నారు ఈ రైతు.

సంప్రదాయ పద్ధతుల్లో చెరువుల్లో పెరిగే చేపలకు, RAS పద్ధతిలో పెరిగే చేపలకు చాలా వ్యత్సాసం ఉంది. ఈ నూతన పద్ధతిలో చేపలకు కావాల్సిన ఆహారం టైం టు టైం అందుతుంది. చేపల పెరుగుదలకు అనుగుణంగా ఉష్ణోగ్రతలను మెయిన్‌టేన్ చేస్తున్నారు. అంతే కాదు చేపల వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు ప్రత్యేక పద్ధతులను అవలంభిస్తున్నారు. చేపలు ఎలాంటి వ్యాధుల భారిన పడకుండా తగు జిగ్రత్తలు తీసుకుంటున్నారు. సురక్షితమైన వాతావరణంలో వాటని పెంచుతున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో చేసే చేపల పెంపకంలో చేపల వ్యర్థాలు చెరువుల్లోనే ఉండిపోతున్నాయి. అవి అలా డీకంపోజ్ అవ్వడం వల్ల వాటి నుంచి రకరకాల హానికారక గ్యాస్‌లు విడుదలై , అమోనియా శాతం పెరిగిపోయి చేపలకు నష్టం వాటిల్లుతోంది. దీని వల్ల రైతులు పంటను కోల్పోతున్నారు. ఈ RAS పద్ధతిలో మాత్రం ఎప్పటికప్పుడు నీటిని శుభ్రం చేస్తూ చేపల పెంపకాన్ని చేస్తున్నారు.

నీటిలో చేపల వ్యర్థాలను శుభ్రం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రమ్ ఫిల్టర్‌ను కొనుక్కున్నారు ఈ రైతు. నీటిలో ఉన్న వ్యర్థాలతో పాటు చేప తినగా మిగిలిన పదార్ధాలు డ్రమ్ ఫిల్టర్‌లోకి వెళ్లిపోతాయి. అమోనియాను బయోఫిట్లర్ ద్వారా పంపించి నీటిని శుభ్రం చేస్తున్నారు. చెరువుల్లో చలికాలంలో చేపల ఎదుగుదల ఆగిపోతుంది. , వేసవిలో చేపలు చనిపోవడం జరుగుతుంటుంది. దీనికి కారణం ఉష్ణోగ్రతల్లో మార్పులు అందుకే RAS విధానంలో ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పడు కంట్రోల్ చేసుకోవచ్చు. దీని వల్ల ఎదుగుదలలో ఎలాంటి తేడా ఉండదు. సంప్రదాయ పద్ధతిలో కంటే 25 నుంచి 30 శాతం త్వరగా ఎదుగుతాయని గుర్తించినట్లు రైతు చెబుతున్నారు.

సంప్రదాయ విధానంలో కోటి లీటర్ల నీటిలో 3000 చేపలను పెంచితే అవే 3 వేల చేపలను 50 వేల లీటర్ల నీటిలో ఈ విధానాన్ని ఉపయోగించి పెచ్చవచ్చంటున్నారు విశ్వనాధరాజు.

చేపకు సమయానికి అనుగుణంగా ఆహారాన్ని అందించేందుకు ఆటో పీడర్స్‌ను డెవలప్ చేశారు. చెప్పిన సమయానికి, చెప్పినంత ఫీడ్‌ను ఆటోఫీడర్స్ చేపలకు అందిస్తాయి. ఎదుగుదలలో మంచి ఫలితం ఉంటుంది. మార్కెట్‌లో కేజీ చేప ధర 120 రూపాయలు ఉంటే విశ్వనాథరాజు పెంచిన చేప ధర 250 రూపాయలు పలుకుతోంది. దీనికి కారణం ఏంటి అంటే ? ఇవి కెమికల్‌ ఫ్రి చేపలని అంటున్నారు విశ్వనాధరాజు. ఈ చేపను ఒకసారి రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ కవాలంటారని చెబుతున్నారు ఈ రైతు. RAS విధానంలో పెంచే చేపలకు ఎలాంటి కెమికల్ వాడాల్సిన అవసరం లేదని, మందులు ఉపయోగించాల్సిన పనే లేదంటున్నారు. అంతా సహజసిద్ధంగా పెరుగుతాయి కాబట్టే వీటికి ఇంత టేస్ట్ వచ్చిందని. ఈ చేపలను తిన్న వారికి ఆరోగ్యం దక్కుతుందని రైతు చెబుతున్నాడు.

ఇంతకు ముందు బోరునీటితో చేపలను పెంచడం నేరం. కానీ ప్రస్తుతం బోరు నీటితో ఆర్‌ఏఎస్‌ విధానంలో చేపలను పెంచుకోవచ్చని జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. కాబట్టి ఎవ్వరైనా బోరు పద్ధతిలో చేపలను పెంచుకోవచ్చంటున్నారు. ఇందులో అన్ని రకాల చేపనలను సాగు చేసుకోవచ్చు. తిలాపియా, ఫంగీషియస్‌, పండుగప్ప, మార్పులు, జల్లలు, వంటి అంతరించిపోతున్న జాతులు, గ్రూపర్ , కోబియా సీబాస్ అనే సముద్రపు చేపలను పెంచుతున్నారు ఈ రైతు. ఇంత వరకు చేపలను మాత్రమే సాగు చేస్తున్నారు. ఇదే విధానంలో రొయ్యలను, పీతలను పెంచుకోవచ్చంటున్నారు విశ్వనాధరాజు. చేపల పెంపకంలో అధునాతన టెక్నాలజీని తాను అందిపుచ్చుకోవడమే కాదు. తనతో పాటు నలుగురికి ఈ టెక్నాలజీ ఫలాలను అందించేందుకు కృషి చేస్తున్నారు విశ్వనాథరాజు. ప్రతీ నెల 15వ తారీఖున తన క్షేత్రంలో వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నారు. ఈ నూతన టెక్నాలజీ ద్వారా రైతుకు కలిగే ప్రయోజనాలేంటో సవివరంగా వివరిస్తున్నారు. విశ్వనాథరాజు సాగు పద్ధతులను తెలుసుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు పక్క రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి సందర్శకులు పెరిగిపోతున్నారు.

కొత్తగా వ్యవసాయం చేయాలి అది 10 మందికి తెలియజేయాలంటారు విశ్వనాధరాజు. అందుకే ప్రతీ నెల 15 వ తేదీన ఫార్మ్‌కు వచ్చిన వారికి నూతన సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. రైతులతో పాటు పిల్లల్లోనూ చైతన్యాన్ని తెస్తున్నారు. ఇప్పటి వరకు ఇజ్రాయేల్, యూఎస్, చైనా, ఆఫ్రిక వంటి 64 దేశాల ప్రతినిధులు విశ్వనాధరాజు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందంటున్నారు ఈ అభ్యుదయ రైతు. ఇలాంటి టెక్నాలజీ యూరోపియన్ దేశాల్లో వుంది మన భారతదేశంలో మాత్రం మొట్టమొదటి సారీ చూస్తున్నామని అంటున్నారు బెంగళూరు నుంచి వచ్చిన పావని. ఆర్ ఏ ఎస్ టెక్నాలజీ చేపల పెంపకానికి చాల వరకు ఉపయోగపడుతుందని, తక్కువ స్థలంలో ఎక్కువ చేపలను సాగు చేసే పద్ధతి చాల బాగుందన్నారు.

వందెకరాల్లో చేసే చేపల పెంపకాన్ని ఒక ఎకరం విస్తీర్ణంలో ఎలా చేయవచ్చో విశ్వనాధరాజు సాగు విధానాలను చూసి నేర్చుకోగలిగామని గుంటూరు నుంచి వచ్చిన దినేష్ తెలిపారు. సంప్రదాయ చేపల పెంపకానికి , ఆర్‌ఏఎస్‌ చేపల పెంపకానికి చాలా తేడా ఉందని , ఈ పద్ధతి చాలా బాగుందని దీనిని తాను అమలు చేయాలనుకుంటున్నట్లు సత్యన్నారాయణ చెబుతున్నారు. సంప్రదాయ విధానంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించక చాలా మంది రైతులు చేపల పెంపకంలో నష్టాలను చవి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఆధునిక విధానాలను అందిపుచ్చుకున్నట్లైతే రైతు సాగులో రాణించగలుగుతాడంటున్నారు విశ్వనాథరాజు. తన స్వార్థం మాత్రమే చూసుకోకుండా తనకు తెలిసిన పరిజ్ఞానాన్ని పది మందికి పంచుతున్న ఈ అభ్యుదయ రైతు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories