డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టొద్దని వేడుకోలు...కలకలం రేపుతున్న...

డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టొద్దని వేడుకోలు...కలకలం రేపుతున్న...
x
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగవంతం అయ్యింది. వివేకానందరెడ్డి దగ్గర పని చేసే వారిని అదుపులోకి తీసుకుని సిట్ ప్రశ్నిస్తోంది....

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగవంతం అయ్యింది. వివేకానందరెడ్డి దగ్గర పని చేసే వారిని అదుపులోకి తీసుకుని సిట్ ప్రశ్నిస్తోంది. అటు వివేక రాసినట్లు చెబుతున్న లేఖ కలకలం రేపుతోంది. ఇక ఇవాళ ఉదయం పులివెందులలో వైఎస్‌ రాజారెడ్డి ఘాట్‌లో వివేక అంత్యక్రియలు జరుగుతాయి.

మాజీ మంత్రి వివేకానందరెడ్డిది హత్యేనని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక తేల్చింది. ఆయన శరీరంపై మొత్తం 7 గాయాలు ఉన్నట్లు గుర్తించారు. నుదుటిపై రెండు గాయాలు, మెదడు భాగంలో ఒక గాయం, ఛాతిపైన రెండు గాయాలు, తొడ భాగంలో ఒక గాయం, చేతిపైన మరో గాయం ఉంది. బెడ్రూమ్‌లో చంపి బాత్రూమ్‌లో పడేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివేక మృతదేహాన్ని గుర్తించిన సమయంలో ఇంటి బ్యాక్ డోర్ తెరిచి ఉందని వాచ్ మెన్ తెలిపారు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్ చేసినట్లు అనుమానిస్తున్నారు.

వివేక మర్డర్ మిస్టరీని ఛేదించడానికి సీఐడీ అడిషనల్ డీజీపీ అమిత్ గార్గ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. మొన్న రాత్రి పదకొండున్నర నుంచి ఉదయం ఆరు గంటల్లోపు వివేక ఇంట్లో ఏం జరిగిందనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇంటి బ్యాక్ డోర్ ఎందుకు ఓపెన్ చేసి ఉంది..? డోర్ లాక్ ఎవరు తీశారు..? అనే కోణాల్లో విచారిస్తున్నారు. వివేక దగ్గర పని చేసే వారితో పాటు ఇంటి పనిమనుషులను ప్రశ్నిస్తున్నారు. హత్యకు ముందు వివేకానంద రెడ్డి ఏం చేశారు, ఎవరిని కలిశారు, హత్య జరిగిన రోజు ఏం జరిగింది. మృత దేహాన్ని మొదట ఎవరు చూశారు. హత్య గురించి మొదట ఎవరికి సమాచారం ఇచ్చారు వంటి అంశాల గురించి కూపీ లాగుతున్నారు. అలాగే వివేకా కుటుంబ సభ్యుల దగ్గరి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

మరోవైపు నిన్న సాయంత్రం ఐదు గంటలకు వైఎస్ వివేకానందరెడ్డి రాసినట్లు చెబుతున్న లెటర్ ఒకటి బయటపడింది. ఇందులో డ్రైవర్ ప్రసాద్ ప్రస్తావన ఉంది. డ్రైవర్ ప్రసాద్‌ను డ్యూటీకి తొందరగా రమ్మంటే తనను చచ్చేలా కొట్టాడని రాసి ఉంది. ఈ లేఖ రాయడానికి చాలా కష్టపడ్డానని, డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టొద్దని వివేకా కోరినట్లుగా ఉంది. అయితే వివేక రాసినట్లు చెబుతున్న లేఖపై వైఎస్ జగన్ అనుమానం వ్యక్తం చేశారు. చంపిన వారే లెటర్‌ రాయించారా...? లేదంటే..డ్రైవర్‌పై నెపం నెట్టడం కోసం లెటర్‌ రాశారా..? అని అన్నారు.

అయితే వివేక హత్యలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్యకేసు నిందితుడు సుధాకర్‌రెడ్డి హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజారెడ్డి హత్యకేసులో జైలు శిక్ష అనుభవించిన సుధాకర్‌రెడ్డి మూడు నెలల కింద సత్ప్రవర్తన కింద కడప సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ మర్డర్‌లో అతని పాత్ర ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో అనుమానిత వేలిముద్రలు దొరికాయని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories