అయేషా హత్య కేసు : సత్యంబాబు సంచలన వ్యాఖ్యలు

ayesha meera
x
ayesha meera
Highlights

అయేషా మీరా హత్య కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో పాటు గతంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను సీబీఐ విచారించింది.

అయేషా మీరా హత్య కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో పాటు గతంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను సీబీఐ విచారించింది. ఇందులో భాగంగానే గతంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న సత్యం బాబుతో పాటు కోనేరు సతీష్‌లను సీబీఐ అధికారులు విచారించారు.

అయేషా హత్య జరిగిన తరువాత 12 ఏళ్లకు హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ఏ ఆధారాన్ని అంత సులువుగా వదులుకోకూడదని భావిస్తోంది. ఇప్పటికే అయేషా దుస్తులు, ఇతర వస్తువులను దహనం చేసిన ఘటనలో కుట్ర కోణం ఉందని నిర్ధారణకు వచ్చిన సీబీఐ అధికారులు హత్య వెనక ఉన్న పాత్రదారులు, సూత్రదారులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈ కేసులో గతంలో అరెస్ట్ అయిన సత్యం బాబును సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. కుటుంబ సభ్యులతో పాటు విడివిడిగా ఏడు గంటల పాటు విచారించిన దర్యాప్తు బృందం పలు కోణాల్లో సమాచారం సేకరించింది.

తన తల్లిని, చెల్లిని చంపుతామని పోలీసులు బెదిరించడంతోనే అయేషా మీరాను హత్య కేసులో నేరం ఒప్పుకున్నట్టు సీబీఐకి వెల్లడించాని సత్యంబాబు తెలిపారు. ఈ కేసులో తన ప్రమేయం లేదని తనకు తెలుసని కాని అసలు దోషులెరవో తేలాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ విచారణకు తాను అన్ని రకాలుగా సహకరిస్తానని చెప్పిన సత్యం బాబు తనను ఎన్ని సార్లు విచారించినా అభ్యంతరం లేదన్నారు. నిర్భయ తరహాలోనే అయేషాకు న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నట్టు ప్రకటించారు.

అయేషా మీరా హత్య జరిగిన శ్రీ దుర్గా హాస్టల్ నిర్వాహకులను సీబీఐ అధికారులు తొలిసారి విచారించారు. పలు కోణాల్లో విచారించిన సీబీఐ అధికారులు హత్యకు ముందు , హత్య తరువాత జరిగిన పరిణామాలపై దుర్గా హాస్టల్ యాజమాన్యం స్టేట్‌‌మెంట్‌ను రికార్డ్ చేసింది. దీంతో పాటు అయేషాతో చనువుగా ఉండే స్నేహితురాళ్లను, రూంమెట్ల వివరాలు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

మరో వైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు సతీష్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటల సమయంలో ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు కోర్టు నోటీసులను చూపించి అనువణువు పరిశీలించారు. 12 గంటల పాటు ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు కంప్యూటర్ హార్ట్ డిస్క్‌తో పాటు టెలిఫోన్ డైరి, పలు సీడీలను సీజ్ చేశారు. అనంతరం కోనేరు సతీష్‌ను కూడా విచారించారు.

అయేషా మీరా హత్య జరిగిన భవనం కోనేరు ఇంటి పేరుతో ఉండటంతో తన పేరును ప్రచారం తెచ్చారని సీబీఐకి వివరించినట్టు సతీష్ తెలిపారు. ఈ వ్యవహారంలో నార్కో అనాలసిస్ సహా ఎలాంటి పరీక్షలకైనా తాను సిద్దమని ప్రకటించిన సతీష్ 12 ఏళ్లుగా తాము పడుతున్న క్షోభకు ఇకనైనా ముగింపు పలకాలన్నారు. తన ప్రమేయం లేదని తేలితే అయేషా తల్లిదండ్రులు మీడియా ముందు తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు సాక్షులను విచారిస్తున్న సీబీఐ అధికారులు దర్యాప్తు బయటకు లీకు కాకుండా జాగ్రత్తపడుతున్నారు. ఓ వైపు వ్యూహాత్మకంగా దర్యాప్తు సాగిస్తూనే మరో వైపు లభించిన ఆధారాలను కొత్త కోణాలను అన్వేషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories