వైసీపీ ఎంపీల రాజీనామాలపై నిర్ణయం తీసుకోనున్న స్పీకర్

Submitted by arun on Wed, 06/06/2018 - 11:26
YSRCP MPs

ఏపీలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇవాళ వైసీపీ ఎంపీల రాజీనామాలపై లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజున.. వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ రాజీనామా లేఖలను.. స్పీకర్‌కు అందజేశారు. అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న ఈ అంశంపై ఇవాళ స్పీకర్ సుమిత్రా మహాజన్  తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. 

ఇటీవలే స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసిన ఐదుగురు ఎంపీలు.. తమ రాజీనామాలు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అయితే రాజీనామాలు భావోద్వేగంతో చేశారని.. మరోసారి పార్టీ అధినేతతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని.. ఎంపీలకు స్పీకర్ విజ్ఞప్తి చేశారు. అయితే రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న ప్రతిపక్ష పార్టీ ఎంపీలు.. ఇవాళ మరోసారి స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలుసుకోనున్నారు. ఎలాగైనా తమ రాజీనామాలను ఆమోదించుకోవాలనే పట్టుదలతో ప్రతిపక్ష పార్టీ ఉంది. 

అయితే వైసీపీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారా..? లేదా..? అన్న అంశం ఉత్కంఠగా మారింది. ఒకవేళ రాజీనామాలను ఆమోదిస్తే పరిస్థితి ఏంటి..? అయితే రాజీనామాలను స్పీకర్ ఆమోదించినా.. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండటంతో.. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో రాజీనామాలు ఆమోదించినా ప్రతిపక్ష పార్టీకి పెద్దగా ప్రయోజనం లేదనే వాదనలు వస్తున్నాయి. 

అయితే రాజీనామాలు ఆమోదించుకుని ప్రజల్లోకి వెళ్లడమే తమ ముందున్న కర్తవ్యం అని ప్రతిపక్ష పార్టీ నాయకులు చెబుతుండగా.. దీన్నో డ్రామాగా అభివర్ణిస్తున్నారు.. అధికార టీడీపీ నాయకులు. రాజీనామాల పేరుతో వైసీపీ నాయకులు.. నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు కాబట్టే.. రాజీనామాల పేరుతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

English Title
YSRCP MPs To Meet Lok Sabha Speaker

MORE FROM AUTHOR

RELATED ARTICLES