జ‌గ‌న్ స్థానం కోసం ప‌వ‌న్ త‌హ‌త‌హ..?

Submitted by lakshman on Sun, 03/18/2018 - 14:46
YS Jagan Vs Pawan Kalyan

2019ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.  అందివచ్చిన అవకాశాన్ని చేజారనీయకుండా ఒడిసిపట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే హస్తినలో ఏపీ రాజకీయం వేడెక్కుతుంటే..ఏపీలో పవన్ కల్యాణ్ తన రాజకీయ చదరంగంలో రాజవ్వడంకోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
2014 ఎన్నికలనుంచి టీడీపీ తో మిత్రపక్షంగా వ్యవహరించిన పవన్ కల్యాణ్ ప్రశ్నించే స్టైల్ ను మార్చేశారు. పార్టీ ఆవిర్బావసభలో అధికార పక్షం తీరుపై నిప్పులు చెరిగారు. బీజేపీ  - వైసీపీ లను నామమాత్రంగా ప్రస్తావన తెచ్చిన జనసేనాని అధికార పార్టీకి చెందిన నారాలోకేష్ అవినీతిని హైలెట్ చేయడంలో సఫలమయ్యారు. దీంతో పవన్ ఏ వ్యూహంతో అడుగులు వేస్తున్నారనే దానిపై  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
అయితే ప్రస్తుతం ఉన్న ఏపీ రాజకీయాల్ని విశ్లేషిస్తే పవన్ ఏపీలో ప్రతిపక్షంగా తన హవా కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
ఓ వైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు తథ్యమని సర్వేలు - ప్రజల్లో ప్రభుత్వంపై ఏర్పడ్డ అసహనం తో జగన్ ఏదో మొక్కుబడిగా 
వ్యవహరిస్తున్నారు. అందుకే  వైసీపీకి రాజకీయ యావే తప్ప ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడాలనే ఆలోచనే లేదన్న విమర్శలు ఎక్కువే. దీంతో పాటు జగన్ పాదయాత్ర కోసం ఏకంగా అసెంబ్లీ సమావేశాలకు కూడా రావడం మానేశారు. తాను వెళ్లకపోతే.. ఎవ్వరూ వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో జగన్ తన ఎమ్యెల్యేలను కట్టడి చెయ్యడం సర్వత్రా విమర్శలు చెలరేగాయి.
 ఇదే అంశాన్ని అదునుగా భావించన పవన్ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ప్రభుత్వంతో పోరాటం చేస్తూ జాగ్రత్తపడుతున్నారు.  
గుంటూరులో అతిసార బాధితులతో భేటీ అయిన పవన్ ప్రభుత్వానికి 24గంటలపాటు డెడ్ లైన్ విధించారు. ఓ వైపు ప్రజల ప్రాణాలు పోతుంటే టీడీపీ రాజకీయం చేస్తుందని విమర్శించారు. తక్షణమే హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో కంగుతిన్న ప్రభుత్వం అతిసార బాధితులకు వైద్యం అందేలా చర్యలు తీసుకుంది. సంబంధిత శాఖలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారుల్ని సస్పెండ్ చేసింది. 
అయితే ఎన్నికల సమయానికి పవన్ ఏమేరకు ప్రభావం చూపిస్తాడో.. ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఓట్లుగా ఎలా మార్చుకుంటాడో అనే అంశాలపైనే పవన్ , ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

English Title
YS Jagan Vs Pawan Kalyan

MORE FROM AUTHOR

RELATED ARTICLES